పేదరికం కన్న బిడ్డను భారంగా భావించే పరిస్థితికి చేర్చింది. అనారోగ్యంతో బాధపడే ఆ దంపతులు తాము కన్న ఆడపిల్ల బరువు గుండెలపై నుంచి దింపేసుకుందామని పదమూడేళ్ళకే మైనర్ బాలికకు వివాహం చేసేసారు. ఆ బాలిక ప్రసవానికి ముందు తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందిన విషాద గాధ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
చల్లపల్లి మండలం పురిటిగడ్డకు చెందిన ఏకుల వెంకట్రావ్ – జ్యోతి దంపతుల ఏకైక కుమార్తె కీర్తన ఏడవ తరగతి చదువుతుండగా గతేడాది మచిలీపట్నం శారదా నగర్ కు చెందిన అంగన్వాడీ ఆయా గండ్రపు దేవమ్మ కుమారుడు గండ్రపు ప్రవీణ్ కుమార్ తో రహస్యంగా బాల్య వివాహం చేశారు. గర్భం దాల్చిన కీర్తనకు వయసు ఎక్కువ చెప్పి అత్త దేవమ్మ మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించింది. ఆగష్టు 11న పురిటిగడ్డ వచ్చిన కీర్తన పి హెచ్ సీ లో చెకప్ కు వెళ్లగా ఆమె పరిస్థితి గమనించిన వైద్యాధికారిణి డాక్టర్ కేవీ పద్మావతి హై రిస్క్ కేసుగా గుర్తించి మచిలీపట్నం రిఫరెన్స్ చేశారు. రిఫర్ లేటర్ తీసుకోకుండా కీర్తన వెళ్ళిపోవటంతో సిబ్బందిని ఇంటికి పంపి ఆమె పరిస్థితి వివరించారు. ఆగష్టు 13న ఆశా వర్కర్ ను వెంట పెట్టి 108 అంబులెన్సులో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి వైద్యులు ప్లేట్ లెట్స్ తగ్గిపోయినట్లు గుర్తించి 14న విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ ఆగష్టు 15న గర్భంలో ఉన్న శిశువు, 16న కీర్తన మృతి చెందారు. 17న మచిలీపట్నంలో కీర్తన అంత్యక్రియలు గుట్టు చప్పుడు కాకుండా భర్త, అత్త జరిపించారు.