• నాడు మైక్రో ఫైనాన్స్ సంస్థలకు వైఎస్ తోడ్పాటు-నేడు రుణ యాప్ లకు జగన్ రెడ్డి చేయూత
• రాష్ట్రంలో లోన్ యాప్ మరణాల పాపం జగన్ రెడ్డిదే
• చంద్రన్న తెచ్చిన డ్వాక్రా, అంగన్వాడీలను జగన్ రెడ్డి నిర్వీర్యం చేయడంతో అప్పు కోసం రుణయాప్ లను ఆశ్రయిస్తున్న మహిళలు
-అంగన్వాడీ మరియు డ్వాక్రా విభాగాల టీడీపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. ఎవరిని అత్యాచారం చేసి చంపేస్తారో, ఎవరిపై అక్రమ కేసులు బనాయిస్తారో, అర్థరాత్రి తలుపు తట్టి దాడులు చేసి అరెస్ట్ లు చేస్తారో అనే భయానక పరిస్థితులు నెలకొన్నాయి. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి మైక్రో ఫైనాన్స్ సంస్థలను ప్రోత్సహించి గ్రామీణుల జీవితాలతో ఆడుకున్నారు. నేడు జగన్ రెడ్డి లోన్ యాప్ సంస్థలపై చర్యలు తీసుకోకుండా అమాయక ప్రజల బలవన్మరణాలకు కారణమవుతున్నారు. మహిళా పక్షపాతిని, మాది మహిళా ప్రభుత్వం అని చెప్పుకొనే జగన్ రెడ్డి, వైసీపీ నాయకులు ఆచరణలో ఘోరంగా వైఫల్యం చెందుతున్నారు. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక రాజమండ్రిలో దుర్గారావు దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హృదయ విదారకమైనది. అనాథలయిన ఆ పిల్లల పరిస్థితి చూస్తుంటే మనసు కలిచివేస్తోంది. తల్లిదండ్రులను పోగొట్టుకున్న చిన్నారులకు ఆర్థిక సాయం ప్రకటించి చేతులు దులుపుకున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వరుస బలవన్మరణాల పై ప్రజలకు సమాధానం ఇవ్వాలి. లోన్ యాప్ సంస్థల నిర్వాహకుల పై ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? ఆర్బీఐ నిబంధల ప్రకారం లోన్ యాప్ సంస్థలు నడుస్తున్నాయా అనేది ప్రభుత్వం పరిశీలన చేసిందా?
పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని లోన్ యాప్ సంస్థలు దాష్టీకాలకు పాల్పడుతున్నాయి. . కేవలం ఒక్క క్లిక్ చాలు నిముషాల్లో డబ్బులు అంటూ ఆశచూపి అప్పుల ఊబిలోకి ప్రజల్ని నెడుతున్నారు. తీరా రుణం ఇచ్చాక వసూలు చేసే క్రమంలో పైశాచికంగా మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్నారు. బాధితుల ఫోన్ నెంబర్లకు నగ్న వీడియోలు పంపడం, సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టి వారిని మానసికంగా వేధిస్తున్నారు. పరువు పోయిందనే బాధతో బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
నాడు వంటింటికే పరిమితమైన మహిళలకు డ్వాక్రా సంఘాల ఏర్పాటుతో చంద్రబాబు గారు ఆర్థిక తోడ్పాటు అందించారు. వారి కాళ్లపై వారు నిలబడేలా చేశారు. నేడు జగన్ రెడ్డి మహిళా సంక్షేమాన్ని విస్మరించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు తూట్లు పొడిచారు. ఫలితంగా మహిళలు ఆర్థిక ఇబ్బందులు పడుతూ అప్పుల కోసం తప్పని పరిస్థితుల్లో లోన్ యాప్ వంటి సంస్థలను ఆశ్రయించాల్సి వస్తోంది. మహిళా సంక్షేమం గురించి గొప్పలు చెప్పే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారు. డ్వాక్ర మూలధన నిధిపై కన్నేశారు. చేతిలో రూపాయి లేక మహిళలు అధిక వడ్డీలకే అప్పులు చేయాల్సి వస్తోంది. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
లోన్ యాప్ ఆగడాలకు ఒక్క ఈ ఏడాదిలోనే పదుల సంఖ్యలో చనిపోయారు. అప్పు చెల్లించమని రికవరీ ఏజెంట్లు ఇంటికొచ్చి బెదిరించడంతో అవమానం తట్టుకోలేక హరిత అనే ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మంగళగిరిలో అప్పు చెల్లించినప్పటికీ అశ్లీల చిత్రాలు బంధువులకు పంపుతామనే బెదిరింపులతో, లోన్ యాప్ వేధింపులకు తట్టుకోలేక ప్రత్యూష్ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా కడియంలో చదువు కోసం రుణం తీసుకున్న సతీష్ అనే పీజీ విద్యార్థి రుణ యాప్ నిర్వాహకుల వేధింపులకు గురి అయ్యాడు. అశ్లీల చిత్రాలు సెల్ కు పంపి బెదిరించడంతో మానసిక ఒత్తిడికి లోనై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి.
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి , మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లకు సైతం లోన్ యాప్ వేధింపులు ఎదురైనా చర్యలు తీసుకోలేక చేష్టలుడిగిన చూసిన దద్దమ్మ ప్రభుత్వం జగన్ రెడ్డిదే. గడప గడపకు కార్యక్రమంలో ఉన్నప్పుడు సుమారు 70 నుంచి 80 సార్లు లోన్ యాప్ నుంచి తనకు కాల్స్ వచ్చాయని మంత్రి కాకాణి స్వయంగా చెప్పారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కైతే లోన్ యాప్ నిర్వాహకులు చుక్కలు చూపించారు. డబ్బులు కట్టమని ఫోన్ లో విసిగించారు. కాల్స్ వ్యవహరాన్ని వీరిద్దరూ పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా తూతూమంత్రంగా విచారణ చేశారే కానీ చర్యలైతే లేవు. మంత్రులు, ఎమ్మెల్యేల ఫిర్యాదు చేసినా చేష్టలుడిగి చూస్తున్న జగన్ రెడ్డి ఇక సామాన్యులకు ఏం రక్షణ కల్పిస్తారు? ఆర్బీఐ అనుమతి లేని యాప్ యాప్ లపై కఠిన చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం కాలయాపన చేయడం దేనికి సంకేతం?
జగన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ లేదు. వైసీపీ ప్రభుత్వ శాంతిభద్రతల వైఫల్యం కారణంగా 6 ఏళ్ల చిన్నారి నుంచి 60 ఏళ్ల వృద్ధురాలి వరకూ బయట తిరగలేని పరిస్థితులు. NCRB రిపోర్ట్ ప్రకారం 2021లో మహిళలపై 17,752 నేరాలు జరిగాయంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎక్కడున్నట్టు? అంటే రోజుకు సగటున ఆడబిడ్డలపై 49 అఘాయిత్యాలు నమోదవుతున్నాయంటే మహిళా భద్రతపై జగన్ రెడ్డికి ఏం చిత్తశుద్ధి ఉన్నట్టు? మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలు దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలోనే ఎక్కువగా జరగడం జగన్ రెడ్డి అరాచక పాలనకు నిదర్శనం కాదా? రాష్ట్రంలోని అన్ని పార్టీల అధినేతలు, ఉమెన్ యాక్టివిస్టులు స్పందించినా జగన్ రెడ్డి చోద్యం చూడటమే కాకుండా పైపెచ్చు నేరస్థులను కాపాడేందుకు కులచిచ్చు రెచ్చగొట్టే దుర్మార్గానికి దిగజారడం క్షమించరాని నేరం. జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవాలంటే బరితెగించాలనే అభిప్రాయానికి రాబట్టే అరగంట, గంట , న్యూడ్ వీడియో పోరంబోకులు పేట్రేగిపోతున్నారు. మద్యపాన నిషేదంపై మాట తప్పిన జగన్ రెడ్డి డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు యువతను బానిసలు చేయడంతో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి,జాతీయ మహిళా కమిషన్ సహా పలువురు నేతల దృష్టికి తీసుకెళ్లారు. అయినా జగన్మోహన్ రెడ్డి మాధవ్ పై చర్యలు తీసుకోకుండా మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం దారుణం.
ఈ మూడేళ్ల కాలంలో అంగన్వాడీలను జగన్ రెడ్డి నిర్వీర్యం చేశారు. ప్రకాశం జిల్లా, వెనిగండ్ల మండలంలోని ఒక ప్రాంతంలో అంగన్ వాడి ఆయా తన విధులని నిర్వర్తిస్తుంటే సర్వే పేరుతో వచ్చి అసభ్యంగా ప్రవర్తించటంతో కేకలు పెడితే చుట్టుపక్కల వాళ్లు వచ్చారు. పీకే సర్వే టీంలో ఉన్న మెంబర్ ఆ వ్యక్తి అని తెలిసింది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం వీడి మహిళా భద్రత, మహిళా సంక్షేమంపై దృష్టిపెట్టాలి. లోన్ యాప్ నిర్వాహకుల పై కఠిన చర్యలు తీసుకోవాలి. బలవన్మరణాలకి పాల్పడిన వారి కుటుంబాలకు నామమాత్రపు ఆర్ధిక సాయం అందించి చేతులు దులుపుకుంటే ఊరుకోం. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తాం. గడప గడపకు కార్యక్రమంలో పాల్గొంటున్న వైసీపీ నేతలు పోలీసు బందోబస్తుతో తిరగపోతే ప్రజలు చెప్పుతో కొట్టి సమాధానం చెప్పేవారు.