ఆర్కే సార్, మీరు వెళ్లిపోయారు. అందరం వెళ్లిపోవాల్సిందే. కానీ మీరు గర్వంగా నడిచిన దారిలోనే వెళ్లిపోయారు. మాలాంటి వాళ్లు మిగిలిపోయారు. చెదపురుగుల్లా, రాజ్యం చేతిలోని రాబంధుల్లా. మీ డెడ్ బాడీని చూసి మేము కన్నీళ్లు కారుస్తాం. అవి కల్తీ అని మాకు తెలుసు. ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లు పెడతాం. కవితలు రాస్తాం. భాష వచ్చిన వాళ్లు, ఓపిక ఉన్న వాళ్లు వ్యాసాలు కూడా రాస్తారు. లైక్‌లు, కామెంట్స్ చెక్ చేసుకుని, కామెంట్స్‌కి లైక్స్ కొట్టి నిద్రపోతాం. తెల్లారి వేరే పనులు చాలా వుంటాయి మాకు.
సార్, మీరు మాలాగే ఒక తల్లి కడుపులో జన్మించారు. మీకు ఒక జీవితముంది, కుటుంబముంది. కానీ మీరు దుర్మార్గాన్ని ద్వేషించారు. పేద ప్రజల్ని ప్రేమించారు. తుపాకీ తీసుకుని అడవికి వెళ్లారు. బలహీనులకి బలవంతులెపుడూ న్యాయం చేయరు. భిక్షం వేస్తారంతే. అందుకే తిరగబడ్డారు. మాకూ వయసులో ఆవేశం వుండేది. కోపం వుండేది. పేద ప్రజల తరపున మాట్లాడే వాళ్లం. అదంతా మోసం. నాలుగు డబ్బులు కనిపిస్తే సీసాలోని దెయ్యంలా మాలోని అసలు మనిషి బయటికొచ్చాడు. వాడు వ్యాపారాలు చేసాడు. పెత్తనాలు చేసాడు. ఇల్లు, భూములు కొన్నాడు. భౌతిక సుఖాలన్నీ అనుభవిస్తూనే మేము పేదల పక్షానా, పీడితుల తరపున ఉన్నట్టు నాటకాలాడాం.
సార్, మీరు జనం కోసం అడవుల్లో వున్నారు. మేము మా కోసం నగరాల్లో వున్నాం. సాయుధ పోరాటంతో ఈ వ్యవస్థ మారుతుందనే భ్రాంతిలో మీరున్నారు. ఈ వ్యవస్థ లొసుగులు ఆధారంగా బాగా బతకాలనే క్లారిటీతో మేమున్నాం. మీరు వెళ్లిపోతారు. మేము మిగులుతాం. మీరు గుర్తుంటారు. మేము వుండం. అదీ తేడా.కార్లు కొంటాం. గేటెడ్ కమ్యూనిటీలో కాపురం వుంటాం. పిల్లల్ని జాగ్రత్తగా చదివించుకుని అమెరికా పంపుతాం. ఒక రౌండ్ మేమూ అమెరికా వెళ్లి రోడ్ల శుభ్రత, హారన్ వినిపించకపోవడం గురించి లెక్చర్లు ఇస్తాం. డాలర్ల లెక్కలతో డప్పాలు కొట్టుకుంటాం. చీమల గురించి మాట్లాడ్తాం కానీ, మాకు డౌనోసార్లు ఇష్టం. ఇళ్లలో ఆ ఫొటోలే వుంటాయి.
విస్కీలో సోడాలా యవ్వనం బుడగలు బుడగలుగా పొంగుతున్న వేళ మేమూ శ్రీశ్రీ పద్యాలే చదివాం. సింహాలకి నీతిశతకం అర్థం కాదు. లేగదూడలు బతకాలంటే చేయాల్సింది ఉద్యోగాలు కాదు, భుజానికి వుండాల్సింది లంచ్ బాక్స్ బ్యాగ్ కాదు అనుకున్నాం. బరువు మోయడానికి కావాల్సింది శక్తి కాదు, ధైర్యం.
తర్వాత మేము రచయితలు, జర్నలిస్టులు, అధికారులు, ఆక్టోపస్‌లా అనేక టెంటకిల్స్‌తో రూపాంతరం చెందాం. కాసింత ప్రయోజనం కోసం కిందవాళ్లని తొక్కేసాం. అబద్ధాలు చెప్పాం, ఎవరి మీద పోరాటం చేయాలనుకున్నామో వాళ్లకి సయామి కవలలుగా మారిపోయాం. నాయకులకి అంగీలోపల బనియన్‌గా అతుక్కుపోయాం. ఎవరి కోసం పోరాటం చేయాలనుకున్నామో వాళ్లని పురుగుల్లా చూసాం. వెట్టి చాకిరీ చేయించాం. మీరంటూ వుంటారే బూర్జువాలు, వర్గ శత్రువులు అని , వాళ్లని గుర్తు పట్టడం సులభం. మేమే అంత సులభంగా దొరకం. పెదవుల చాటున కత్తులు దాచుకుని కమ్యూనిస్టు ప్రణాళికని, మార్క్సిజాన్ని కంఠతా పట్టేవాళ్లం.ఆర్కే సార్, మీరు ఎన్ని తుపాకులు మోసినా మనిషిని మనిషి గౌరవించడం, సమానంగా చూడడం జరగదు. ఇది తెలియక మీరు అడవుల్లో ఉన్నారు. తెలిసీ ఏసీ గదుల్లో వున్నాం.
మేమూ ఒకరోజు గుండెపోటుతోనో, ఆస్పత్రుల్లో లక్షలు లక్షలు బిల్లులు కట్టో చచ్చిపోతాం. పేపర్‌లో వార్త, ఒకరిద్దరు ఉత్సాహ పడి వ్యాసాలు కూడా రాస్తారు. పంజాగుట్ట స్మశాన వాటికకు కొంత మంది వస్తారు. మా వారసులు లైమ్‌లైట్‌లో ఉంటే ఎక్కువ మంది వస్తారు. నగరాల్లో స్మశానాలు కూడా మనుషుల్ని కలిపే కూడలలు. చచ్చిపోయన వాడి గురించి రెండు మాటలు, OTT వెబ్ సిరీస్, రియల్ ఎస్టేట్ గురించి ఎక్కువ మాటలు మాట్లాడి వెళ్లిపోతారు.పోయినా మీరు గుర్తుంటారు. పెద్ద కర్మ తర్వాత మా పిల్లలకి కూడా మేము గుర్తుండం. మీ కోసం చరిత్రలో ఒక పేజీ వుంటుంది. మా ఫొటో గోడ మీద మాత్రమే వుంటుంది.
ఇదంతా రాయడం ఎందుకంటే మీ ఉద్యమం పట్ల ప్రేమతోనో, ఇంకొకటో కాదు. కాసేపు కరెంట్ పోతేనే భరించలేని వాళ్లం అడవిని ప్రేమిస్తామా? జీవితమంతా పోరాడి పోరాడి అలసిపోయి ప్రశాంతంగా నిద్రపోతున్న మీ ఆఖరి ఫొటో చూసి దుక్కం వచ్చింది, భయమేసింది. ఏదో అపరాధ భావన. అద్దంలో చూసుకుంటే వికృత ఆకారం కనిపించింది. దాన్నుంచి బయట పడడానికే ఈ రాతలు. నిజానికి అన్ని రకాల గిల్టీనెస్‌లని మూడు పెగ్గుల విస్కీతో కప్పేయగల సమర్థులం మేము.
ఆర్కే సార్, మీరు మరణించినా బతికే వుంటారు. మేము మరణించి చాలా కాలమైంది. మా అంత్యక్రియలు మా చేతుల మీదుగానే జరిగాయి. సమాధుల్లో జీవించే సంతృప్త జీవులం.