సోషల్‌మీడియాలో బీజేపీ ‘బూటు’ పురాణం
అటు ఆంధ్రాలో నవ్వులపాయిలన ‘పువ్వు’పార్టీ
( మార్తి సుబ్రహ్మణ్యం)
అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడిందట. తప్పులో కాలేసినట్లు.. బీజేపీ ఇప్పుడు బూటులో కాలేసింది. ఈ ‘బూటు’ పురాణం ఇప్పుడు సోషల్‌మీడియాలో తెగ వైరలయి, కమలనాధులకు కక్క లేక మింగలేకన్నట్లుగా మారింది. మీకు తెలుసుగా.. హిందుత్వం, దేవుళ్లపై బీజేపీకి బోలెడన్ని రైట్సున్నాయని! దేశంలో హిందుత్వానికి ఎక్కడ గత్తర వచ్చినా ముందు వాలేది బీజేపీ, దాని పరివారమే. పట్టుమని పదిమంది ఎమ్మెల్యేలు కూడా లేని రాష్ట్రాల్లో.. ఆ పార్టీకి ఆశ, శ్వాస అన్నీ హిందుత్వమే. మరి ఇతర పార్టీలతో ‘రాజకీయ సర్దుబాటు’ చేసుకునే రాష్ట్రాల్లో కూడా, అంతే దూకుడుగా వెళుతుందా అంటే… ‘ఆ ఒక్కటీ అడక్కు’ అన్నదే వెంటనే వచ్చే సమాధానం! అంటే ఆంధ్రా-తెలంగాణ వంటి రాష్ట్రాల్లో అన్నమాట!! అయితే కమలదళాలు, అక్కడా యుద్ధం చేస్తుంటాయి. కానీ రాళ్లతో కాదు. బంతిపూలతో!!! అంటే ‘నేను కొట్టినట్లు నటిస్తా. నువ్వు ఏడ్చినట్లు నటించుమ’న్నట్లన్నమాట.ఇవన్నీ బహిరంగ రహస్యాలు!!!!
ఇక ఈ కొసరు నుంచి అసలు విషయంలోకి వస్తే.. భక్తికి కేరాఫ్ అడ్రసయిన బీజేపీకి కొత్తగా మహా చెడ్డ చిక్కొచ్చిపడింది. తెలంగాణ బీజేపీ రధసారథి బండి సంజయుడి పాదయాత్రకు వచ్చిన బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, కర్నాటక ఎంపీ తేజస్వి సూర్యతేజకు, బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఆయన కూడా కష్టకాలంంలో బీజేపీ ‘బండి’ లాగుతున్న, సంజయుడి వద్దకు వెళ్లి సంఘీభావం ప్రకటించారు. తర్వాత బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. తేజస్విసూర్యకు బుల్లి గణపతి విగ్రహాన్ని బహుకరించారు. అదేం తప్పుకాదు. అతిథులకు జ్ఞాపికలివ్వడం సంప్రదాయం కూడా. మరి ఇందులో చిక్కేమిటనే కదా డౌటనుమానం? ఎస్. ఇక్కడే బీజేపీ ‘బూటులో కాలేసింది’.
మన రఘునందన్ రాముడు మంచిబాలుడి మాదిరిగా, శాస్త్రప్రకారం కాళ్లకు చెప్పులు లేకుండా గణపతి బొమ్మను, తేజస్వి సూర్యకు బహుకరించారు. మరి అది దేవుడి విగ్రహం కదా? పైగా బీజేపీకి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో పొలిటికల్ మైలేజీ తెచ్చిన దేవుడాయన. మరి తేజస్వి కూడా అంతే భక్తితో కాళ్లకు చెప్పుల్లేకుండా, ‘రఘన్న’ ఇచ్చిన గణపతి బొమ్మను అంతే సంప్రదాయం ప్రకారం అందుకోవాలి కదా? అలాకాకుండా.. కాళ్లకు వేసుకున్న బూట్లు విప్పకుండానే, ఠీవిగా గణపతిబొమ్మ అందుకున్నారు. ఇంకేముంది? ఆ ఫొటో కాస్తా సోషల్‌మీడియాకు చిక్కింది. మరి నిత్యం అందులోనే బతికే నెటిజన్ల చేతులు ఖాళీగా ఉండవు కదా? ‘నిజమైన హిందువులయితే దీనిపై స్పందించండి’.. ‘బీజేపీ వాళ్లు చెప్పులేసుకున్నా దేవుడేమీ అనడా’.. ‘బూట్లేసుకుని దేవుడి విగ్రహం తీసుకున్నా ఫర్వాలేదా?’, ‘బీజేపీ హిందుత్వం భలేభలే’ అంటూ ట్రోలింగు శరపరంరంగా వస్తుంటే.. పాపం కక్కలేక, మింగలేని పరిస్థితి కమలనాధులది. ఇలా బీజేపీ ‘బూటు’ పురాణం ‘నెట్టింట’ హల్‌చల్ చేస్తోంది.
ఇక ఆంధ్రాలోకి అడుగుపెడదాం.
సరే.. అసలే వాన, ఆపై వర్షం అన్నట్లు.. ఇప్పుడు గణపతి సీజన్. దానికితోడు కరోనా సీ(రీ)జన్. దానితో తెలుగు రాష్ట్రాలు కూడా, ఆ నిబంధనలు దృష్టిలో ఉంచుకుని, గణపతి మండపాలకు అనుమతులివ్వలేదు. దానితో అరివీర భయంకరుడైన ‘రాజీ’లేని పోరాట యోద్ధ, ‘డాక్టర్ సోము వీర్రాజు’ ఆధ్వర్యాన ఆంధ్రాలో కమలనాధులు కన్నెర్ర చేసి, జగనన్న సర్కారుకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. ‘‘జగన్ ప్రభుత్వం హిందువుల పండుగల విషయంలో పక్షపాతం చూపిస్తోంది. బార్లు, వైన్సు, స్కూళ్లు, సినిమాహాళ్లు, వైసీపీ ఎమ్మెల్యేల ర్యాలీలకు లేని కరోనా.. మా గణపతి మండపాలు పెట్టుకుంటేనే వస్తుందా’’ అంటూ లా పాయింట్లు తీశారు. గవర్నర్ వద్దకు వెళ్లి ‘ఇదేం అన్యాయం ప్రభూ’ అని ‘కమలన్న’లు మొత్తుకున్నారు. జిల్లాల్లో ధర్నాల వంటి హంగామా చేశారు. అయితే గుంటూరు, విజయవాడ, ఒంగోలు లాంటి నాలుగయిదు జిల్లాల్లో తప్ప, కమలం పువ్వు ధర్నాలు ఎక్కడా వికసించలేదు. అందాకా ఎందుకు? బీజేపీ రధసారథి, ఉద్యమ పితామహుడయిన డాక్టర్ సోము వీర్రాజు, సొంత తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలోనే పట్టుమని పదిమంది కార్యకర్తలు లేని ధర్నా ఫొటోలు… సోషల్‌మీడియాలో వచ్చి పార్టీ పరువు గోదావరి పాలయిందనుకోండి. అది చాలదన్నట్లు.. అరెస్టయిన వీర్రాజు పోలీస్‌స్టేషన్‌లో కూర్చుని, అల్పాహారం- నీళ్లు తాగుతున్న ఫొటోలు కూడా సోషల్‌మీడియా పుణ్యాన బయటకొచ్చాయి.అది వేరే విషయం!ఆవిధంగా వినాయక మండపాల అనుమతిపై నానా యాగీ చేస్తున్న కమలనాధులపై, వైసీపేయులు.. అదే ‘హిందుత్వ అస్త్రం’తోనే ఎదురుదాడి చేయడంతో, పాపం వీర్రాజు బ్యాచ్ నోరెళ్లబెట్టాల్సివచ్చింది. ఆంధ్రాలో వినాయక విగ్రహాలు పెట్టనివ్వని జగన్ సర్కారును ఎండగడుతున్న వీర్రాజు.. పక్కనే బీజేపీ అధికారంలో ఉన్న కర్నాటకలో, మరి ఎందుకు ఆంక్షలు విధించిందన్న విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వేసిన ప్రశ్నకు.. ‘పువ్వు పార్టీ’ మైండ్‌బ్లాంకయిపోయింది. అంతేనా? ఇదిగో కేంద్రంలో ఉన్న మీ పువ్వుపార్టీ ప్రభుత్వమే కోవిడ్ నిబంధనలు విధించి, రాష్ట్రాలకు పంపిందంటూ.. మోదీ సర్కారు మార్గదర్శకాలను మీడియా ముందు పెట్టడంతో.. బీజేపీ దిమ్మ తిరిగి, బొమ్మపడింది. ఇప్పటివరకూ మల్లాది విష్ణు ప్రశ్నలకు జవాబిస్తే ఒట్టు!
ఈలోగా హైకోర్టు రంగంలోకి దిగి కోవిడ్ నిబంధనల ప్రకారం, ప్రైవేటు స్థలాల్లో విగ్రహాలు పెట్టుకోవచ్చని, మతపరమైన అంశాలను అడ్డుకునే అధికారం ప్రభుత్వానికి లేదని చెప్పడంతో… వీర్రాజు అండ్ కోకు, గండం గడిచి పిండ ం బయటపడినట్లయింది. ఈలోగా ‘కర్నాటకలో అలా ఏపీలో ఇలా’ అంటూ సోషల్‌మీడియాలో నెటిజన్లు బీజేపీని ఆడేసుకుంటున్నారు. పోనీ వినాయక విగ్రహాలపై అంత హంగామా చేసి, బీజేపీ రాజకీయంగా ఏమైనా బావుకుందా అంటే అదీ లేదాయె! పైగా.. జగన్ హిందువుల పండుగల పట్ల బాగా కఠినంగా ఉన్నారన్న మెసేజ్.. ఇతర మతాల వారిలో నాటుకుపోవడం ఆయనకది పొలిటికల్ మైలేజీగా మారింది. సో… తెలిసో, తెలియకనో ఒకరకంగా జగనన్న ఇమేజ్‌ను, ‘పువ్వుపార్టీ’ తన శక్తిమేరకు పెంచినట్లు లెక్క! అందుకే అతి సర్వత్రా వర్జయేత్ అని పెద్దలు ఊరకనే చెప్పలేదు మరి!!