Suryaa.co.in

Editorial

అతడే తుది.. అతడే ఆది!

– మునుగోడులో చరిత్ర సృష్టించనున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి కూసుకుంట్ల
– టీఆర్‌ఎస్‌కు చివరి అభ్యర్ధి ప్రభాకర్‌రెడ్డి
– ఈసీ వద్ద గుర్తింపు లభిస్తే ఆయనే బీఆర్‌ఎస్‌ తొలి అభ్యర్ధి
– మునుగోడుతో టీఆర్‌ఎస్‌ కొత్త రికార్డులు
( మార్తి సుబ్రహ్మణ్యం)

టీఆర్‌ఎస్‌కు ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నిక, ఆ పార్టీకి ఎన్నికల చరిత్రలో ఆసక్తికర ముగింపు-కొత్త అధ్యాయం ప్రారంభించేందుకు కారణమవనుంది. ఇప్పటివరకూ ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్‌ఎస్‌.. ఇటీవలే బీఆర్‌ఎస్‌గా పేరు మార్చుకుని, జాతీయ పార్టీగా ఆవిర్భవించింది. ఆ మేరకు ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు కూడా పంపింది. ప్రస్తుతం ఆ ప్రక్రియ ఢిల్లీలో కొనసాగుతోంది.

ఈలోగా మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడింది. ఆ మేరకు బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డిMunugode రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి తమ నామినేషన్లు దాఖలు కూడా చేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కూడా సోమవారమే నామినేషన్‌ దాఖలు చేయాల్సి ఉండగా, దానిని వాయిదా వేసుకున్నారు.

అయితే మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించినా, సాధించకపోయినా.. ఎన్నికల్లో ఒక ఆసక్తికరమైన చరిత్ర సృష్టించనుంది. అదెలాగంటే… ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్‌ఎస్‌, జాతీయ పార్టీగా మారిన తర్వాత.. ఆ పార్టీకి సంబంధించినంత వరకూ పోటీచేస్తున్న చివరి ఎన్నిక ఇదే. అంటే ప్రాంతీయ పార్టీ హోదాలో పోటీ చేస్తున్న చివరి ఎన్నిక అన్నమాట. ఆరకంగా కూసుకుంట్ల చిట్టచివరి టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి అవుతారు.

ఇప్పటివరకూ బీఆర్‌ఎస్‌ కోసం కారు గుర్తునే కేసీఆర్‌ ఎంపిక చేసుకున్నప్పటికీ, అది ఇంకా ఈసీ వద్ద పెండింగ్‌లోనే ఉంది. దానికి పెద్ద అవరోధాలు ఉండకపోవచ్చని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఒకవేళ నామినేషన్‌ ఉపసంహరణ ప్రక్రియ వరకూ బీఆర్‌ఎస్‌కు కారు గుర్తు వస్తే.. అప్పుడు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌కు తొలి అభ్యర్ధి అవుతారు. మునుగోడు ఉప ఎన్నికలో ఆయనే మొనగాడయితే.. ఇక బీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీకి ఆయనే బోణీ కొట్టినవారవుతారు. అంటే టీఆర్‌ఎస్‌కు తుది.. బీఆర్‌ఎస్‌కు తొలి అభ్యర్ధి అన్న రికార్డును ప్రభాకర్‌రెడ్డి సొంతం చేసుకుంటారన్నమాట.

LEAVE A RESPONSE