– మునుగోడులో బీజేపీకి ‘ప్రాణ’ సంకటం
– నద్దా ఆసుపత్రి హామీని గుర్తు చేస్తున్న టీఆర్‌ఎస్
– బీజేపీ ‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రచారానికి బీఆర్‌ఎస్ కౌంటర్
– అదే రోజు ‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటూ బీజేపీ వాల్‌పోస్టర్లు
– బీజేపీకి ‘ఆసుపత్రి నమూనా’తో బీఆర్‌ఎస్ బద్నామ్
– ‘నద్దా ఉత్తుత్తి ఆసుపత్రి’ అంటూ బోర్డు
– కళాకారులతో నద్దా వేషం
– బీఆర్‌ఎస్ ఉత్తుత్తి నమూనాకు విశేష ఆదరణ
– బీఆర్‌ఎస్ ఎత్తుగడతో బీజేపీకి తలనొప్పి
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘వినోదం’ సినిమా చూశారా?…. అందులో శ్రీకాంత్ ఉత్తుత్తి బ్యాంకు సృష్టించి, కోట శ్రీనివాసరావును పిచ్చోడిని చేస్తారు. అది కామెడీ. ఇప్పుడు సేమ్ టు సేమ్ అలాంటి ప్రచారాన్నే బీఆర్‌ఎస్ కొంచెం మార్చి.. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీని బద్నామ్ చేస్తోంది. వినోదం సినిమాలో ఉత్తుత్తి బ్యాంకు ఉంటే, మునుగోడులో ‘జెపి నద్దా ఉత్తుత్తి ఆసుపత్రి’ని సృష్టించిన బీఆర్‌ఎస్, ప్రచారంలో కొత్త ఒరవడికి తెరలేపింది. ఇదంతా కేసీఆర్‌ను విమర్శిస్తూ, బీజేపీ సృష్టించిన ’ ఆ ఒక్కటీ అడక్కు’ వాల్‌పోస్టర్లకు ప్రతి సృష్టి అన్నమాట.
గమ్మతేమిటంటే.. బీజేపీ సృష్టించిన ‘ ఆ ఒక్కటీ అడక్కు’ కూడా, సినిమాలో డైలాగే! అంటే మునుగోడు ప్రచారం తిట్లు, సవాళ్లు ముగిసి.. చివరాఖరకు సినిమా స్టైల్ దిశగా సాగుతోందన్నమాట. ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠగా మారిన మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో, బీఆర్‌ఎస్-బీజేపీ ఒకదానికొకటి పోటాపోటీగా దూసుకుపోతున్నాయి. ఆకర్షణీయమైన నినాదాలు, సవాళ్లు-ప్రతి సవాళ్లు, తిట్లు-శాపనార్ధాలతో ఇప్పటిదాకా సాగిన ఎన్నిక ప్రచారం, ఇప్పుడు సినిమా డైలాగుల దిశగా సాగటం ఆసక్తికరంగా మారింది.
అందులో భాగంగా బీజేపీ.. తన తొలి అడుగును, రాజేంద్రప్రసాద్ ‘ ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో ప్రారంభించింది. అందులో రావుగోపాలరావు తరచూ వాడే ‘ ఆ ఒక్కటీ అడక్కు’ డైలాగును, లేటెస్టుగా బీజేపీ తన ఎన్నిక ప్రచారంలో వాడేసుకుంది. కేసీఆర్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ‘ ఆ ఒక్కటీ అడక్కు’అన్న కాప్షన్‌ను, అన్ని వాల్‌పోస్టర్లలోనూ కామన్‌గా వాడింది. ఆ వాల్‌పోస్టర్లను బీజేపీ దళపతి బండి సంజయ్, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ చుగ్ ఆవిష్కరించారు. ఇది సహజంగా బీఆర్‌ఎస్‌కు షాక్ కలిగించింది.
దీనితో మేల్కొన్న బీఆర్‌ఎస్ వ్యూహబృందం.. అదే సినిమా స్టైల్‌లో ‘ జెపి నద్దా ఉత్తుత్తి ఆసుపత్రి’ని వాయువేగంతో సృష్టించి, బీజేపీకి షాక్ ఇచ్చింది. ఒక ఆసుపత్రి నమూనా సృష్టించి, దానిపై ‘జెపి నద్దా ఉత్తుత్తి ఆసుపత్రి’ అని బోర్డు పెట్టింది. అంతేకాదు. అక్కడ కళాకారుల బృందాలతో, నద్దా వేషం వేయించి మరీ ఓటర్లకు కనువిందు చేసింది. మర్రిగూడ బస్టాండ్ వద్ద ఏర్పాటుచేసిన ఈ ఉత్తుత్తి ఆసుపత్రి నమూనా, ప్రజలను యమా ఆకట్టుకుంటోంది.
మునుగోడు నియోజకవర్గంలో.. ఫ్లోరోసిస్ రీసెర్చి ఇనిస్టిట్యూ అండ్ హాస్పిటల్ నిర్మిస్తామన్న నద్దా గత హామీ, ఉత్తుత్తిదేనని ప్రజలకు తెలిపేందుకు, బీఆర్‌ఎస్ ఈరకంగా సినీ మార్గం ఎంచుకుంది. ఏదైతేనేం.. ఇప్పటి దాకా సీరియస్ పాలిటిక్స్ పండించిన రాజకీయ పార్టీలు.. ప్రచారం చివరిరోజుల్లో కామెడీ సీన్లు పండించటం, మునుగోడు ఓటర్లకు కాసింత రిలీఫే కదా?! శుభం!