– నెతన్యాహు యూదు దురహంకారంపై
– తిరగబడ్డ ఇస్లామిక్ ఇరాన్
ఇరాన్ ను ఒక్క రాత్రిలో “రాతి యుగం”లోకి నెడతామని, ఆ దేశ నాగరికత మొత్తాన్ని అంతం చేస్తామని, మా ఆయుధ సంపత్తిలో ఉన్న ఇప్పటి వరకు ఇరాన్ పై ప్రయోగించని ఆయుధాలను ఎక్కుపెడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ ఇటీవల వ్యాఖ్యానించడంతో అణ్వాయుధాలను ప్రయోగిస్తారేమోనన్న అనుమానాలు రేకెత్తాయి.
అణ్వాయుధాలు మానవాళి వినాశనానికే దారితీస్తాయి. అణుబాంబును తయారుచేసుకునే పనిలో ఇరాన్ నిమగ్నమై ఉన్నదని, తద్వారా అమెరికా – ఇజ్రాయెల్ దేశాల భద్రతకు ఇరాన్ నుండి ముప్పు ఉన్నదని ఆరోపించి, 2025 జూన్ లో 12 రోజుల యుద్ధం చేసి, అణు ప్రయోగశాలలను పూర్తిగా నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాడు ఘనంగా ప్రకటించుకున్నారు.
ఇరాన్ అణు బాంబును తయారు చేసుకునే ప్రయత్నాల్లో లేదని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ ప్రకటించినప్పటికీ, మరొకవైపున ఈ అంశంపై జరుగుతున్న చర్చలు కూడా ముగింపు దశకు చేరుకున్న దశలో, ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేసుకునే పనిలో ఉన్నదని మళ్ళీ ఆరోపించి, “ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ” పేరుతో అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పై ఫిబ్రవరి 28న సైనిక దాడి చేశాయి.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమేనీతో సహా నలబై మందికిపైగా కీలక నేతలను హతమార్చారు. యుద్ధాన్ని కొనసాగించారు. పది వేలకుపైగా నిర్దేశించుకున్న లక్ష్యాలపై దాడి చేసి, భారీ నష్టం చేశారు. ఒక బాలికల పాఠశాలపై దాడి చేసి 165 మంది పసి పిల్లల ప్రాణాలు తీశారు. ఆసుపత్రులతో సహా విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు, ఇతర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశారు.
ఇస్లామిక్ ఇరాన్ తన ఉనికికే ప్రమాదం ముంచుకొచ్చిందని తిరగబడ్డది. అమెరికా- ఇజ్రాయెల్ సైనిక దాడికి ఎదురొడ్డి నిలిచి భీకర యుద్ధం చేసింది. చేస్తున్నది. ఇజ్రాయెల్ మరియు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడింది. పర్యవసానంగా జరిగిన నష్టం నుండి గల్ఫ్ దేశాలు కోలుకోవడానికి దశబ్దాలు పడతాయన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి.
ప్రపంచ ఇంధన (ముడి చమురు మరియు లిక్విడ్ గ్యాస్) సరఫరాలకు మరియు రసాయనిక ఎరువుల ఉత్పత్తులకు అవసరమైన ముడిసరుకుల సరఫరాకు ఆయువు పట్టుగా ఉన్న హోర్ముజ్ జలసంధిపై ఇరాన్‌కున్న వ్యూహాత్మక పట్టును బ్రహ్మాస్త్రంగా ప్రయోగించింది. యుద్ధంలో భౌతికంగా జరిగిన విద్వంసం కంటే ఎక్కువగా ప్రపంచం బహుముఖంగా నష్టపోయింది, ఇంకా నష్టపోతూనే ఉన్నది.
యుద్ధానికి “పుల్ స్టాప్” పెట్టకుండా, రెండు వారాల పాటు అమెరికా- ఇరాన్ విరామం ప్రకటించాయి. కానీ, ఇజ్రాయెల్ ఉల్లంఘించింది. తెరుచుకున్న హోర్ముజ్ జలసంధి, మళ్ళీ మూతబడింది. దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. సంప్రదింపులు ఫలప్రదం కావాలని, శాశ్వత పరిష్కారానికి ఒప్పందం జరగాలని, తక్షణం యుద్ధాన్ని విరమిందాలని ప్రపంచ ప్రజానీకం బలంగా కోరుకుంటున్నది.
చరిత్ర ఏం చెబుతున్నది: మానవాళిని సర్వనాశనంచేసే అణుబాంబును మొట్టమొదట తయారు చేసిందే. అమెరికా. 1945 ఆగస్టు 1న న్యూమెక్సికో రాష్ట్రంలోని నిర్జన ప్రాంతంలో ప్రధమంగా అణ్వస్త్ర పరీక్ష చేసింది. రెండు బాంబులు వేర్వేరు సాంకేతిక పరిజ్ఞానంతో, ఒకటి యురేనియంతో, మరొకటి ప్లూటోనియంతో తయారుచేసింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగింపుకు వచ్చిన సందర్భమది.
1945 ఏప్రిల్ 30న హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నారు. జర్మన్ సైన్యం మే 7-8 తేదీల్లో బేషరతుగా సోవియేట్ యూనియన్ “రెడ్ ఆర్మీ”కి లొంగిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించిన నాజీ జర్మనీ ఘోరపరాజయంతో యుద్ధం ముగిసింది. సోవియెట్ యూనియన్ తో పాటు ప్రపంచ దేశాల ప్రజలు మే 9న విజయోత్సవ దినం జరుపుకున్నారు. అమెరికా తన అణ్వస్త్రాల శక్తిని ప్రపంచానికి దాటి, ఆధిపత్యాన్ని ప్రదర్శించడం కోసం, నాడు జర్మనీ మిత్ర దేశంగా ఉన్న జపాన్ లోని హిరోషిమాపై 1945 ఆగస్టు 6న మరియు ఆగస్టు 9న నాగసాకిపై అణు బాంబులను ప్రయోగించి, మారణహోమం సృష్టించింది.
దాదాపు రెండున్నర లక్షల మంది మరణించారు. ఆ రెండు నగరాలు పూర్తిగా ధ్వంసమైనాయి. మానవ చరిత్రలో అణ్వాయుధాలను ఉపయోగించిన ఏకైక సందర్భం అదే. ఈ దుష్టచరిత్ర అమెరికా సొంతం. ప్రస్తుతం రష్యా (5500), అమెరికా (5000+), చైనా (600), ఫ్రాన్సు (290), యునైటెడ్ కింగ్డమ్ ( 225), భారత్ (180) పాకిస్తాన్(170), ఇజ్రాయెల్ (90), ఉత్తర కొరియా (50), మొత్తం తొమ్మిది దేశాల దగ్గర దాదాపు 12,300 అణ్వాయుధాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అంటే రష్యా, అమెరికా వద్దే దాదాపు 90% గుట్టలు గుట్టలుగా నిల్వచేయబడి ఉన్నాయి.
అమెరికా రష్యా దేశాల మధ్య అణ్వస్త్రాల నిరోధక ఒప్పందం గడువు ముగిసిపోయింది. అణ్వాయుధాలను మొదట ఉపయోగించం అన్న కట్టుబాటుకు అణ్వస్త్ర దేశాలు కట్టుబడి ఉండకపోతే, మానవాళికి ప్రమాదం ముంచుకొస్తుంది. కొత్త ఒప్పందంపై దృష్టిసారించలేదు. అణ్వాయుధ్ధాల ఆధునికీకరణ వైపు అమెరికా చర్యలు చేపట్టిందన్న వార్తలు వచ్చాయి.
కొన్ని దేశాలు అణ్వాయుధాలను క్రమంగా తగ్గించాలన్న డిమాండ్ ను పెడచెవిన పెట్టి, కొన్ని దేశాలు వాటి సంఖ్యను పెంచుకుంటున్నాయి. ఇది తీవ్ర ఆందోళనకరమైన పరిస్థితి.
చెప్పిందొకటి – చేస్తున్నదొకటి: డొనాల్డ్ ట్రంప్, తన ఎన్నికల ప్రచారంలో “ఇకపై యుద్ధాలు వద్దు; ఈ మూర్ఖపు, అర్థరహితమైన యుద్ధాలను ముగించండి” అన్నారు. ఆయన నోట జాలువారిన మంచి మాటలు అవి. ఎన్నికల్లో గెలిచారు. రెండోసారి అధికార పీఠం ఎక్కారు. నోబుల్ శాంతి బహుమతి కోసం పడరానిపాట్లు పడ్డారు. అణ్వస్త్రాలున్న భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని లెక్కకుమించినసార్లు గొప్పగా చెప్పుకున్నారు.
అలాగే, మరో ఏడు యుద్ధాలను కూడా ఆపిందానని చెప్పుకున్నారు. ప్రపంచ ప్రజల కళ్ళకు గంతలు కట్టి ఆయన ఖాతాలో ఉన్న యుద్ధాలను చూడకుండా చేయాలనుకున్నారు. తనకు నోబుల్ శాంతి బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మిత్రుల ద్వారా సిఫార్సులు చేయించుకున్నారు. అయిన, ఫలితం దక్కలేదు. నోబుల్ బహుమతి కమిటీని మరియు నార్వే దేశాన్ని నిందించారు.
వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరియా మచాడోకు 2025 నోబుల్ శాంతి బహుమతి దక్కింది. ట్రంప్ “శాంతి యాత్ర” విరమించుకుని, యుద్ధోన్మాదంతో చెలరేగిపోయి మొదటి “నోబుల్ యుద్ధ బహుమతి”ని గెలవాలని కంకణం కట్టుకున్నట్లుంది. జనవరిలో వెనిజులా అధ్యక్షుడిని అపహరించారు.
వెనిజులా సార్వభౌమత్యంపై సైనిక దాడి చేసినందుకు ట్రంప్ ను ప్రశంసిస్తూ మరియా కొరియా మదాడో తన నోబుల్ శాంతి బహుమతిని ఆయనకు బహుకరించారు. “నో” అనకుండా ట్రంప్ దాన్ని స్వీకరించడం అందర్నీ నివ్వెరపరచింది. ట్రంప్ తన సైనిక దాడుల పరంపరను కొనసాగిస్తూ ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ పై దాడి చేశారు. నలబై రోజులు గడిచినా భీకర యుద్ధంలో ఇరాన్ నిలవడమే కాదు, ముప్పేట ఎదురు. దాడి చేసింది.
గత 47 ఏళ్ళుగా అమెరికాపై ఇరాన్ ప్రత్యక్ష పరోక్ష యుద్ధం సాగిస్తోందని, దాని అంతు చూస్తానని, ఆ దేశాన్ని “రాతి యుగం”లోకి వెనక్కి నెట్టేస్తానంటూ ప్రగల్భాలు పలికారు. కానీ, ఒంటరి (ఇజ్రాయేల్ మినహా)గా మిగిలారు. నాటో కూటమి దేశాలను ట్రంప్ అభ్యర్థించినా ఒక్క దేశం కూడా మద్దతుగా నిలవలేదు.
యుద్ధంతో భారీగా నష్టపోయిన గల్ఫ్ దేశాల నుండి సహజంగానే వత్తిడి ఉంటుంది. ప్రపంచ ప్రజలు మరియు అమెరికా ప్రజల్లో అత్యధికులు యుద్ధాన్ని వ్యతిరేకించారు.కడకు, 140 కోట్ల మంది క్రైస్తవ మతస్తులకు ఆరాధ్యులైన పోప్ లియో XIV యుద్ధాన్ని యుద్ధాన్ని తీవ్రంగా ఖండించారు. తక్షణం ఆపాలని పిలుపునిచ్చారు. అమెరికాలో నవంబరులో జరిగే మధ్యంతర ఎన్నికలు తరుముకొస్తున్నాయి.
యుద్ధ నష్టాలు, ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాలు, ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెడుతున్న యుద్ధంపై ప్రపంచ దేశాల వ్యతిరేకత, స్వదేశంలోను మరియు అంతర్జాతీయంగా పెరిగిపోతున్న ప్రజావ్యతిరేకత, విమర్శలు ట్రంప్ లో అసహనాన్ని, ఉక్రోషాన్ని పెంచాయి. అడకత్తెరలో పోకచెక్కలాగా యుద్ధంలో ఇరుక్కుపోయారు. బయటికి గంభీరంగా ఇరాన్ కు హెచ్చరికలు చేస్తున్నా, ఈ యుద్ధం నుండి ప్రస్తుతానికి బయటపడడానికి మార్గాన్వేషణలో పడ్డారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ “ఎప్పుడేం మాట్లాడతారో”, ఎలాంటి ప్రమాదం తెచ్చిపెడతారో అన్న భావన ప్రజల్లో ఏర్పడింది.
ఇరాన్‌కు అణ్వాయుధాలు తయారు చేసుకునే సామర్థ్యం లేకుండా చేశానని ప్రకటించుకున్న ట్రంప్ ఒక్క రాత్రిలో ఇరాన్ ను రాతి యుగంలోకి నెట్టేస్తాననడంతో అణ్వస్త్రాన్ని ప్రయోగిస్తారా అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే, సూటిగా సమాధానం చెప్పలేదు. ఈ పరిణామాలను గమనిస్తుంటే అమెరికా ఇజ్రాయేల్ రెండు కలిసి ఇరాన్ మనుగడపై చేస్తున్న సైనిక దాడి పూర్వరంగంలో అణ్వాయుధాలను తమ అంబులపొదలో చేర్చుకోకపోతే తమకు భద్రత ఉండదనే అభద్రతా భావానికి ప్రస్తుత యుద్ధం ఇరాను నెట్టిందన్న భావన కలుగుతున్నది.
ఇరాన్ కు డిపిఆర్ (ఉత్తర) కొరియా దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆదర్శంగా కనపడవచ్చు. ఉన్ అంటే ట్రంప్ కు శతృత్వంతో మిళితమైన వల్లమాలిన ప్రేమ. కారణం ఆ దేశం అణ్వాయుధాలున్న దేశాల జాబితాలో చేరింది. అందుకే కిమ్ జోంగ్ ఉన్ అంటే నిప్పుతో చెలగాటంగా భావిస్తున్నారు.
భిన్న కోణాల్లో పర్యవసానలపై అధ్యయనం: ఈ యుద్ధంపై సామాజిక ఆర్థిక – భౌగోళిక రాజకీయ దృష్టికోణంలో విస్తృత పరిశీలనచేయాలి. ప్రపంచంపై నయా సామ్రాజ్యవాద ఆధిపత్యం కోసం ట్రంప్ “అమెరికా ఫస్ట్” వ్యూహాత్మక విధానం, పశ్చిమాసియాపై ఆధిపత్యం కోసం యూదుల జాత్యాహంకారంతో నెతన్యాహూ, ఇద్దరు కలిసి ఇరాన్ పై పథకం ప్రకారం సైనిక దాడి చేశారు. మత రాజ్యంగా ఉన్న ఇరాన్ ప్రతికారేచ్ఛతో యుద్ధ భూమిలో నిలిచింది. షియా ముస్లింల అస్తిత్వ పోరాటంగా పరిగణించింది.
శత్రువుల గుండెల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ట్రంప్- నెతన్యాహూ దురహంకార ద్వయం ఆలోచనలు- మాటలు – చేష్టలు “పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటం” అన్న నానుడిగా అంతర్జాతీయ సమాజానికి తయారయ్యాయి.ఇరాన్ చేస్తున్న యుద్ధం ఆ దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకోవడం కోసమే కాదు, షియా ముస్లిం జాతి ఉనికిని పరిరక్షించుకోవడం కోసం చేస్తున్న జీవన్మరణ పోరాటంగా కనబడుతున్నది.
ప్రజాస్వామ్యాన్ని భూస్థాపితం చేసిన పాలన అయినప్పటికీ ఇరాన్ ప్రజలు అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని ప్రతిఘటిస్తున్నారు. మత రాజ్యం అయినప్పటికీ ప్రపంచ ప్రజల నైతిక మద్దతు ఇరాన్ వైపే ఉన్నది. అమెరికా ప్రజల్లోనే 61% మంది యుద్ధాన్ని వ్యతిరేకస్తున్నారని సర్వేలు వెల్లడించాయి. ట్రంప్ ‘అమెరికా ‘ఫస్ట్’ అంటూ ‘ట్రాన్సాక్షనల్ ఇంపీరియలిజం (లావాదేవీల సామ్రాజ్యవాదం)’ ప్రపంచంపై రుద్దుతున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
లాటిన్ అమెరికా, పశ్చిమాసియా ప్రాంతాల్లోని చమురు, సహజ వాయువు నిల్వలను, అరుదైన ఖనిజాలను కొల్లగొట్టాలనే దుర్బుద్ధితో, అంతర్జాతీయ చట్టాలను సహితం లెక్కచేయకుండా ట్రంప్ సైనిక శక్తిని ఉపయోగిస్తున్నారు. వీటో హక్కును దుర్వినియోగం చేస్తూ, ఐక్యరాజ్య సమితిని, భద్రతా మండలిని నిర్వీర్యం చేశారు. 19వ శతాబ్దం నాటి ఆధిపత్య శైలిని పునరుద్ధరించాలని డొనాల్డ్ ట్రంప్ కలలు కంటున్నారు.
– టి. లక్ష్మీనారాయణ