(తిరుమలలో నిత్యన్నదానం ప్రారంభమైన రోజు 06.04.1985)
ఏడుకొండలపై కోనేటి స్నానం
వెంకన్న దర్శనం..
విమాన వేంకటేశ్వరుని
సందర్శనం..
అంతకు మునుపు
కింద గోవిందరాజు
కుంచంతో కనువిందు..
ఆపై పాపనాశం..
ఆకాశగంగ..
మద్దిమద్దిలో
చిన్న చిన్న గుడులు..
మదిమదిలో భక్తిభావన..
దర్శనం క్యూలైన్లో
వుండగానే బావాజీతో
స్వామి పాచికలాడే
కమనీయ దృశ్యం..
పాచికలంటే
పరాచికాలు కాదండోయ్..
ఇలలో..కలియుగంలో
జరిగిన అద్భుతం..
ఇలా ఎన్నెన్నో విశేషాలతో
శేషాచల సమూహంలో
సాక్షాత్తు పరమాత్మ సన్నిధిలో యాత్ర..
కొండ దిగుతూ
ఆంజనేయునితో ముచ్చట..
మంగాపురంలో అమ్మతో
నను బ్రోవుమని చెప్పవే
అంటూ ఓ చిన్న మాట..
అటు పిమ్మట..
కాళహస్తిలో శివయ్య..
కాణిపాకంలో ఆయన కొడుకు గణపయ్య..
ఈ మొత్తం యాత్రలో
గోవిందా…గోవిందా
ఇదే నామజపం..
ఓ పరితాపం..పశ్చాత్తాపం..
ప్రయాణం కాదది ప్రమోదం..
భగవంతునికి ఆమోదం!
ఇంత యాత్రలో ఒకే వెలితి
స్వామి పూజ
ఘనమే అయినా
పొట్ట పూజకు ఎన్నిపాట్లో..
యాతన..కొంత చింతన..
పూర్వమైతే అక్కడే వంటలు
కొందరైతే చద్ది మూటలు..
దేవుని లీలలపై మాటలు..
తోచిన పాటలు..
ఇప్పుడైతే బడ్డీలు..హోటళ్ళు
టీలు..కాఫీలు..
వేంకటరాముని ముంగిట హల్దీరాములు..
డబ్బు’న్నోళ్లు’ ఆరాములు..
లేనోడికి రైలెక్కే వరకు
కడుపులో రైళ్లే…!
ఈ వెత..వెలితి తీర్చేందుకు
కొండపై కొండంత అండ..
యాత్రికుల కడుపునిండ
వెలసింది అన్నసత్రం..
వెంగమాంబ చేతి పొత్రం..
ఆ మహాభక్తురాలి వీలునామా పత్రం..
ఆమె వెంకన్న గూటిలో గువ్వ
తన పేరిట భక్తులకు
కడుపు నిండా బువ్వ..!
విహార భోజనంబు..
వింతైన వంటకంబు..
వెంకన్న చేతి విందు..
అహహ్హ..ఎందరొచ్చినా
తరగని అదే పసందు!
అదేమి శేషాచలమో..
అక్కడ అదెంత మహిమో..
అది అన్నసత్రమో..
ఆదిదేవుడిచ్చిన అక్షయపాత్రమో..
ఆరగించే ప్రతి భక్తుడూ
శ్రీనివాసుని అనుగ్రహపాత్రమో!
ఆహా ఏమి రుచి..
అనరా మైమరచి..
ఎన్నిమార్లు తిన్నా గాని
తనివే తీరనిది..
దివిలో కొలువైన శ్రీపతి
ఎంగిలే కదా..
భువిపై వేంచేసి ఉన్న
శ్రీనివాసుని చేతి చలువే సదా
ఆ అద్భుతానికి కలియుగంలో భక్తులు
బహుదా..ఫిదా..సదా..
ఓ భక్తవరదా..!
సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286