Suryaa.co.in

Andhra Pradesh

చిరుత దాడి ప్రదేశాన్ని పరిశీలించిన టీటీడీ ఈవో

– కాలినడక భక్తులను బృందాలుగా పంపే ఏర్పాట్లు

అలిపిరి కాలినడక మార్గంలో ఏడో మైలు వద్ద బాలుడిపై చిరుత దాడి చేసిన ప్రదేశాన్ని టీటీడీ ఈఓ శ్రీ ఏవి.ధర్మారెడ్డి శుక్రవారం మరోమారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ దాడి చేసింది పిల్లచిరుత కావడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పిందన్నారు. దాడి జరిగిన సమయంలో భక్తులు పెద్దగా అరవడం, రిపీటర్ స్టేషన్ నుంచి లైట్లు వేయడంతో చిరుత బాలుడిని వదిలి వెళ్లిపోయిందన్నారు.

టీటీడీ అటవీ శాఖ అధికారులు చిరుత సంచారాన్ని గుర్తించారని, అలిపిరి గాలిగోపురం నుంచి నరసింహస్వామి గుడి వరకు చిరుత సంచరిస్తున్నట్టుగా తెలుస్తోందని చెప్పారు. ఈ కారణంగా రాత్రి 7 గంటల తరువాత అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం నుండి 200 మంది భక్తులను ఒక బృందంగా కలిపి పంపేలా ఏర్పాట్లు చేశామన్నారు.

వీరితోపాటు సెక్యూరిటీ గార్డ్ ఉంటారని, భక్తులు గోవింద నామస్మరణ చేసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పారు. చిన్నపిల్లలను బృందం మధ్యలో ఉంచుకుని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

LEAVE A RESPONSE