మరొక దుర్మార్గపు చర్య
మొన్న “తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం” మీదుగా వెళుతుంటే ఒక మిత్రుడు ఆ కళావేదిక పేరులోని “తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య” భాగాన్ని తొలగించారన్నారు. ఆశ్చర్యపోయాను. ఆ వార్త ప్రసారమాధ్యమాలలో వచ్చిందో! లేదో! నేనైతే గమనించలేదు. నిన్న వెళ్ళి చూశాను. “కళాక్షేత్రం” అన్న మేరకే ఉంచారు.
నాకు తెలిసిన మేరకు కళాక్షేత్రం నిర్మాణానికి స్థలాన్ని దానం చేసిన తుమ్మలపల్లి వారి పేరుతో పాటు ప్రఖ్యాత వాగ్గేయకారుడు, మహాకవిగా ప్రసిద్ధికెక్కిన క్షేత్రయ్య పేరును జోడించి ఆ కళావేదికకు “తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం”గా నామకరణం చేయబడింది. విజయవాడ నగరం నడి బొడ్డులో ఉన్నది. రైల్వే స్టేషన్ కు ఆర్టీసీ బస్టేషన్ కు మధ్యలో ఉన్నది. ప్రజలందరికీ అనుకూలమైన కళావేదిక. స్థలం ఇచ్చిన దాతలు, మహాకవి క్షేత్రయ్య వచ్చి ప్రశ్నించలేరు కదా! అన్న తేలిక భావనతో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లుంది.
తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం సాంస్కృతిక కార్యక్రమాలకు, రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలకు, రాజకీయ పార్టీలు – ప్రజా సంఘాల సభలు, మహాసభల నిర్వహణకు అనుకూలమైన వేదికగా ప్రసిద్ధి చెందింది. దీనితో నాకు అనుబంధం ఉన్నది. 1981 డిసెంబరు 11-13 తేదీలలో తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలోనే అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభ జరిగింది. ఆ మహాసభలోనే నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాను. 1989 ఆగస్టు 21న తుమ్మలపల్లి కళాక్షేత్రంలోనే నా దండల పెళ్ళి కూడా జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే యన్.టి.ఆర్. వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పేరును డా.వై.యస్. రాజశేఖరరెడ్డి వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయంగా అడ్డగోలుగా మార్చి విమర్శల పాలైయ్యింది. తాజాగా తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం పేరు మార్చడం అత్యంత హేయమైన చర్య. పేరును తక్షణం పునరుద్ధించి విజ్ఞత ప్రదర్శించాలి. ఇలా పేర్లు మార్చే దుష్ట ఆలోచనలకు ప్రభుత్వం తక్షణం స్వస్తి చెప్పాలి.