– విజయవాడతో పాటు గుంటూరుపై దృష్టి
– గుంటూరు కార్పొరేషన్ పరిధిలో 39 గ్రామాలు, 8 మండలాలు
– రద్దు అవనున్న రూరల్ మండలం
– సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
అమరావతి, మహానాడు: నవ్యాంధ్ర రాజధానిలో గుంటూరు – విజయవాడ జంట నగరాలుగా అభివృద్ధి చేయడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే స్మార్ట్ సిటీ పథకంలో ఈ రెండు నగరాలకు కేంద్రం రూ. 2 వేల కోట్లు మంజూరు చేసింది. హైదరాబాద్ కు దీటుగా జంట నగరాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గుంటూరు సమీపంలోని కొన్ని గ్రామాలు, మండలాలను కలిపి గ్రేటర్ గుంటూరు గా అవతరించబోతుంది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
గ్రేటర్ గుంటూరులో కలిసే మండలంలోని గ్రామాలివి.
మేడికొండూరు: పేరేచర్ల, డోకిపర్రు, ఫిరంగిపురం: అమీనాబాద్, చేబ్రోలు: నారాకోడూరు, గొడవర్రు, గుండవరం, ప్రత్తిపాడు: చిన్న కొండ్రుపాడు, యనమదల, ఈదుల పాలెం, తాడికొండ: లాం, కంతేరు, దామరపల్లి, గరికపాడు, పొన్నెకల్లు, వట్టిచెరుకూరు: పుల్లడిగుంట, కొర్నేపాడు, వింజనంపాడు, కుర్నూతల, పెద్దకాకాని: రామచంద్రపాలెం, నంబూరు, అగతవరప్పాడు, గోళ్లమూడి, కొప్పురావూరు, పెద్దకాకాని, వెలిగండ్ల, వెంకట కృష్ణాపురం, గుంటూరు: చిన్న పలకలూరు, మల్లవరం, గొర్లవారిపాలెం, జొన్నలగడ్డ, చల్లావారిపాలెం, తురకపాలెం, తోకావారిపాలెం, లాల్ పురం, వెంగళాయపాలెం, దాసుపాలెం, ఓబులు నాయుడుపాలెం.
గుంటూరు గ్రామం మున్సిపాలిటీగా ఏర్పడి 150 ఏళ్లు అవుతోంది. ఉత్సవాలకు సిద్ధమవుతున్న తరుణంలో గ్రేటర్ గుంటూరు గా రూపాంతరం చెందనున్నది. ఈ మేరకు గుంటూరు కార్పొరేషన్ లో ఎనిమిది మండలాల పరిధిలోని 39 గ్రామాలు విలీనం అవ్వనున్నాయి. గుంటూరు రూరల్ మండలం పూర్తిగా కనుమరుగవనున్నది. ఆయా పంచాయతీల్లో స్థానిక ప్రజాప్రతినిధుల పదవి కాలం పూర్తి అయిన తర్వాత వాటిని నగరపాలక సంస్థలో కలుపుతారు.