అప్పుడు ఆలస్యం…
ఇప్పుడు ఆంక్షల ఎత్తివేతలో తొందరేల..
సరిగ్గా రెండేళ్ల క్రితం (11 March 2020)..కరోనా మహమ్మారిని ప్రపంచ ఆరోగ్య సంస్థ పాండమిగ్గా ప్రకటించిన వేళ..
ఆనాడు ఆలస్యం చేసిందని హూ మీద ప్రపంచ దేశాల్లో కొన్ని దుమ్మెత్తిపోయగా ఇప్పుడు అదే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ఎత్తివేతకు కొన్ని దేశాలు ఎందుకు అంతలా ఉరకలెత్తిపోతున్నాయని ప్రశ్నిస్తోంది.
మహమ్మారి వేగం మందగించిన మాట వాస్తవమే అయినా ఇంకా ప్రమాదం పూర్తిగా వదిలిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రమే గాక పలువురు శాస్త్రవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు.
కరోనా అనే వైరస్ ప్రపంచాన్ని ఎన్నోసార్లు మోసం చేసిందని..ప్రతిసారి తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోందని గుర్తు చేస్తున్నారు.ఈసారైతే ఇక రాదనే ఆశలు మరింత బలంగా విస్తరించి ఉన్నాయని..అందుకే ప్రపంచం తేరుకుని నెమ్మదిగా ఆంక్షల ఎత్తివేతకు సిద్ధపడుతోందని..కొన్ని దేశాలు అప్పుడే ఆ దిశగా పెద్ద అడుగులే వేసేసాయని వారంటున్నారు.అయితే ఆ విషయంలో కొంచెం ఆచితూచి అడుగులు వేస్తే బాగుండేదని..ఇప్పటికైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
కోవిడ్ కారణంగా వివిధ దశల్లో పలు దేశాల్లో మరణించిన వారి సంఖ్య 1.82 కోట్లుగా ఉన్నా వాస్తవ సంఖ్య అంతకు మించి 40 లక్షలకు పైగానే ఉంటుందని అంచనా.. ఇక ఇతరత్రా చూస్తే అనేక దేశాల ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి..కొన్ని దేశాలు..సంస్థల పరిస్థితి పూర్తిగా తల్లక్రిందులు అయిపోయింది కూడా.
ప్రపంచం మరోసారి అలాంటి విపత్తును ఎదుర్కోవడానికి సిద్ధంగా లేదు.
అటువంటప్పుడు ఆ పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడడమే అవశ్యం..ప్రపంచ దేశాల అధినేతలు..
సంబంధిత సంస్థలు..మేధావులు..నిపుణులు ఆ దిశగా ఆలోచన చేయడం మంచిది..
ఇ.సురేష్ కుమార్