రష్యాను నిలువరిస్తామని, ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని నాటో దేశాలు, అమెరికా మొదటి నుంచి చెబుతూ వస్తున్నది. ఉక్రెయిన్ కోసం నాటో దళాలను సరిహద్దులకు తరలించి చాలా రోజులైంది. కానీ ఆ దళాలు ఉక్రెయిన్‌లోకి ఎంటర్ కాలేదు. అమెరికా సైతం తమ బలగాలను పోలెండ్‌కు తరలించింది. అయితే, రష్యాతో నేరుగా యుద్ధం చేయబోమని, ఉక్రెయిన్‌కు అవసరమైన సహకారం మాత్రమే చేస్తామని చెబుతూ వచ్చింది. నాటో, అమెరికా దేశాలు అండగా ఉంటాయని అనుకున్న ఉక్రెయిన్‌కు భంగపాటే మిగిలింది. యుద్ధం వచ్చే సరికి నాటో దళాలు ఒక్క అడుగుకూడా ముందుకు వేయడం లేదు, అటు అమెరికా సైతం చూస్తుండిపోయింది మినహా ముందుకు వచ్చి రష్యాను నిలువరించలేదు.
దీంతో పశ్చిమ దేశాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెస్కీ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు తమను ఒంటరిని చేశాయని అన్నారు. తమకు చేతనైన వరకు పోరాటం చేస్తామని అన్నారు. ప్రజలు సైతం తమ దేశం కోసం పోరాటం చేసేందుకు ముందుకు వస్తున్న తరుణంలో ఎంత వరకు పోరాటం చేయగలరు అన్నది చూడాలి. అయితే, రష్యా సైన్యం ఉక్రెయిన్ రాజధానిలోకి ప్రవేశించడంతో పాటు, అధ్యక్షుడి భవనంపై దాడి చేసేందుకు రష్యా గెరిల్లా సైన్యం రంగంలోకి దిగినట్టు సమాచారం. దీంతో తమ అధ్యక్షుడిని రక్షించుకునేందుకు ఉక్రెయిన్ ఆర్మీ జెలెస్కీని బంకర్‌లోకి తీసుకెళ్లినట్టు సమాచారం.
మారువేషాల్లో రష్యా సైన్యం…
ఉక్రెయిన్‌లో వార్ తీవ్రస్థాయిలో జరుగుతున్నది. రష్యా సైన్యం వేగంగా ఉక్రెయిన్ రాజధాని వైపు దూసుకుపోతున్నది. ఈరోజు ఎలాగైనా అధ్యక్ష భవనంపై రష్యా జెండా ఎగరవేసేందుకు రష్యా దళాలు ప్రయత్నించే అవకాశం ఉంది. కీవ్‌లోకి ప్రవేశించే రష్యన్ దళాలు మారు వేషాల్లో నగరంలోకి ప్రవేశిస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెస్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ దళాల దుస్తులు ధరించి కీవ్‌లోకి ప్రవేశిస్తున్నారని, వారి వెనుక రష్యా బలగాలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, కీవ్‌లో తమ సైన్యం రష్యన్ దళాలను నిలువరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు జెలెస్కీ తెలిపారు.
కీవ్‌లోకి ప్రవేశించే రష్యన్ దళాల్లో అత్యధికశాతం సైనికులు గెరిల్లా యుద్ధంలో నేర్పరులు. దీంతో వీరు అధ్యక్షభవనంపై మెరుపుదాడి చేసి భవనాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచం మొత్తం పుతిన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా, ఏ మాత్రం వెనకడుగు వేయకుండా రష్యాకు పునర్వైభవాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. సోవియట్ యూనియన్ దేశాలను సంఘటితపరిస్తే ప్రపంచంలో రష్యా తిరిగి బలం పుంజుకుంటుందని, అగ్రదేశానికి ధీటుగా జవాబిస్తుందని నిపుణులు చెబుతున్నారు.