– ఉల్టా చోర్ థియరీని ఒంటబట్టించుకున్న వైసీపీ
– తాను చేసిన తప్పులకు కూటమిది బాధ్యత అన్నట్టుగా కలరింగ్
– 108 అంబులెన్స్ వ్యవస్థ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై వైసీపీ తొండాట
– వైసీపీ కుట్రలను సమర్ధంగా తిప్పికొడుతున్న కూటమి సర్కార్
– ఆధారాలు, సాక్ష్యాలు, డాక్యుమెంట్లతో గట్టిగా కౌంటర్లు ఇస్తున్న ప్రభుత్వం
– దుష్ప్రచారం చేస్తూ దొంగల్లా దొరికిపోతున్న వైసీపీ నేతలు
అమరావతి: ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే. ఇప్పుడు వైసీపీ వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ రాజకీయ వర్గాలు ఆ పార్టీ గురించి… ఆ పార్టీ నేతల గురించి ఇదే అనుకుంటున్నారు. ఉల్టా చోర్ కొత్వాల్ కే డాంటే అనే దానికి ఉదాహరణగా వైసీపీని చూపిస్తే సరిపోతుందనే సెటైర్లు వినిపిస్తున్నాయి. దొంగే పోలీసుపై ఆరోపణలు చేస్తున్నట్టు అనే ఆ సామెత సారాంశాన్ని… ఆ థియరిని వైసీపీ బాగా అలవాటు చేసుకున్నట్టుగా కన్పిస్తోంది.
ఇటీవల కాలంలో వరుసగా జరిగిన సంఘటనల్లో వైసీపీ ఇదే తరహాలో వ్యవహరించింది. 108 అంబులెన్సుల వ్యవస్థ, అలాగే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంశాలపై కూటమి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేస్తోంది. ఫేక్ ప్రచారంతో ప్రభుత్వాన్ని బద్నాం చేయడం… ప్రజల దృష్టిని మళ్లించడం… వంటి అంశాలే అజెండాగా కొన్ని రోజులుగా వైసీపీ కుట్రలకు తెర లేపింది. అయితే వైసీపీ కుట్రలను కూటమి ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోంది… గట్టిగానే కౌంటర్ ఇస్తోంది.
కూటమి ప్రభుత్వం అటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేస్తూ… ప్రజల మెప్పును పొందుతూ పరిపాలన సాగిస్తోంది. అలాగే ఎక్కడైనా పొరపాటు జరిగితే.. బేషజాలకు పోకుండా వాటిని సరిదిద్దుకుంటోంది. ఈ క్రమంలో వైసీపీ పూర్తిగా అభూత కల్పనలతో వార్తలు పుట్టించే దిశగానే ఆలోచన చేస్తున్నట్టుగా కన్పిస్తోంది. ఇటీవల కాలంలో 108 అంబులెన్సుల వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆధార రహితంగా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని కార్నర్ చేసే ప్రయత్నం చేసింది.
అయితే వైసీపీ చేపట్టిన ఈ దుష్ప్రచారాన్ని కూటమి ప్రభుత్వం, టీడీపీ ఎమ్మెల్యేలు సమర్థంగా తిప్పికొట్టారు. క్షేత్ర స్థాయికి వెళ్లి వాస్తవాలను మీడియాకు, ప్రజలకు వివరించారు. అలాగే వైసీపీ హయాంలో 108 అంబులెన్సుల వ్యవస్థ ఏ విధంగా భ్రష్టు పట్టిందనే అంశాన్ని కూడా సాక్ష్యాలతో సహా వివరించారు. దీంతో వైసీపీకి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది.
కడుపు మంటతో వైసీపీ కుట్రలు
రాష్ట్ర ప్రభుత్వంపై ఏదోక కుట్రలు పన్నుతూ కాలక్షేపం చేయడం… ప్రజలను తప్పుదోవ పట్టించడం అనేది వైసీపీకి అలవాటుగా మారింది. దీంట్లో భాగంగా ప్రతి అంశంలోనూ కుట్రలకే ప్రాధాన్యమిస్తోందనే ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరుబట్టి అర్థమవుతోంది. ప్రభుత్వం వెనుకబడిన రాయలసీమ మీద ఫోకస్ పెట్టడం… దానికి మంచి రెస్పాన్స్ రావడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోందనే భావన వ్యక్తమవుతోంది.
అలాగే సీమ జిల్లాలను పూర్వోదయ స్కీం కింద అభివృద్ధి చేసేలా ప్రభుత్వం సిద్దం చేస్తున్న ప్రణాళికలు కార్యరూపం దాల్చితే… సీమ ప్రజల తలరాత మారే సూచనలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. దీంతో రేవంత్ చేసిన కామెంట్లను వైసీపీ అందిపుచ్చుకున్నట్టుగా కన్పిస్తోంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆధారం చేసుకుని కట్టుకథ అల్లిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.
రేవంత్ చేసిన కామెంట్లను ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబుపై వైసీపీ అర్థం లేని ఆరోపణలు చేసింది. అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మూలనపడింది… అటక ఎక్కిందే వైసీపీ హయాంలోననే అంశాన్ని కూటమి స్పష్టం చేస్తోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ దాచిపెట్టి… తాను చేసిన తప్పును… తన నిర్వాకాన్ని కూటమి ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తోందనేది ప్రభుత్వ వాదన. రాయలసీమ ప్రాజెక్టుపై వైసీపీ చేసిన విమర్శలతో కొన్ని కీలకాంశాలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి.
ఎన్జీటీ ఇచ్చిన తీర్పులు, కేంద్రం ఇచ్చిన ఆదేశాలు, సీడబ్ల్యూసీ చేసిన సూచనలు మరోసారి చర్చకు వచ్చటాయి. దీంతో వైసీపీ రక్తి కట్టించాలనుకున్న డ్రామా అట్టర్ ప్లాప్ అయినట్టుగా కన్పిస్తోంది. ఎటువంటి అనుమతులు లేకుండా జగన్ హమాంలో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును చేపట్టారని ఏపీ ఇరిగేషన్ వర్గాలు చెప్పాయి. 2020లోనే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును నిలిపేయాలని ఎన్జీటీ, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చాయి.
జగన్ అనాలోచిత చర్యల వల్లే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు ఆగిపోయిందంటున్న ఇరిగేషన్ వర్గాలు స్పష్టం చేశాయి. అనుమతి లేకుండా ప్రాజెక్టు చేపట్టొద్దంటూ 2020 ఆగస్టులోనే కేంద్ర జలశక్తి, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుంటే పనులు చేపట్టవద్దంటూ 2020 జులైలో కేఆర్ఎంబీ స్పష్టం చేశాయి. పర్యావరణ అనుమతులు లేనందున రాయలసీమ పనులు చేపట్టవద్దంటూ 2024లో స్పష్టం చేసిన ఎన్జీటీ. ఇంత తతంగం గత ప్రభుత్వంలో జరిగినా… ఎలాంటి కౌంటర్లు దాఖలు చేయలేదు నాటి వైసీపీ ప్రభుత్వం.
వైసీపీ నిర్వాకం వల్ల నిలిచిపోయిన రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఎన్జీటీలో కూటమి ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తోంది. ఇప్పుడు వాటికి కౌంటర్లు దాఖలు చేస్తూ… రాష్ట్ర వాదనలను కూటమి సర్కార్ వినిపిస్తోంది. గతేడాది మార్చిలోనే ఏపీ ఇరిగేషన్ శాఖ ఎన్జీటీలో కౌంటర్ దాఖలు చేసింది.
వాస్తవాలు ఇలా ఉంటే… దీనికి పూర్తి విరుద్దంగా వైసీపీ దుష్ప్రచారం చేయడంతో ఆ పార్టీ తప్పుడు విధానాలు మరోసారి బయటపడ్డాయి. సాక్ష్యాలు, డాక్యుమెంట్లు. తీర్పులను దాచిపెట్టి.. వైసీపీ ఆడిన డ్రామాలను కూటమి ప్రభుత్వం ఎండగట్టింది.
పీపీపీతో పరువుపోయిందని… అంబులెన్సుల వ్యవస్థపై అబద్దాలు
పీపీపీ విధానంతో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలన్న ప్రభుత్వ విధానాన్ని తప్పు పట్టి… ఏదో లబ్ది పొందాలని వైసీపీ ప్రయత్నించింది. అయితే పీపీపీ పద్దతిన మెడికల్ కాలేజీల నిర్మాణాలపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన సిఫార్సులపై వైసీపీ ఎంపీ గురుమూర్తి సంతకం పెట్టారు. దీంతో వైసీపీ పీపీపీ విధానంపై పోరాడుతున్నామని చెప్పిన అంశం ఒట్టి బూటకమని తేలింది. పైగా పీపీపీ మెడికల్ కాలేజీల అంశంపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా లేఖ రాయడం వైసీపీ జీర్ణించుకోలేకపోయింది. దీంతో ఆ పార్టీ నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది.
పైగా పీపీపీ మెడికల్ కాలేజీల విషయంలో స్వయంగా జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి… ఆ పార్టీని మరింత డామేజ్ చేశాయి. దీంతో ఈ విషయంలో వైసీపీ ఇక మాట్లాడలేకపోతోంది. ఈ క్రమంలో 108 అంబులెన్సుల అంశాన్ని తెర పైకి తెద్దామనే ప్రయత్నం కూడా కూటమి ప్రభుత్వం ఎండగట్టడంతో అదీ బూమరాంగ్ అయింది.
దీంతో వైసీపీకి ఎటూ దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో పీపీపీ మెడికల్ కాలేజీల విషయంలో పిచ్చొళ్లమయ్యాం… 108 విషయంలో పరువు పొగొట్టుకున్నామని ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది.
తలలు పట్టుకుంటున్న వైసీపీ నేతలు
తాము ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తెరపైకి తెస్తున్న వివిధ అంశాలు తమకు ఎదురు తిరగడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉన్నారు వైసీపీ నేతలు. ప్రభుత్వాన్ని బద్నాం చేయబోయి… తాము కుడితిలో పడ్డ ఎలకల్లా మారిపోతున్నామనే అంశంపై తర్జన భర్జనలు పడుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా… ఎలాంటి గ్రౌండ్ వర్క్ ప్రిపరేషన్ లేకుండా చేస్తున్న ఈ వ్యవహరం పట్ల పార్టీ పరువు పోతోందనే చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోందని సమాచారం.