– ఊరి పెద్ద.. ఇప్పుడు ఊరి‘పేద’
– బికారవుతున్న సర్పంచ్
– ఆత్మహత్యల బాటన ఊరుపెద్ద
– చేసిన పనికి బిల్లుల్లేవు
– వచ్చిన బిల్లులు ఊడ్చేసిన సర్కారు
– కేంద్రం పంపిన 8660 కోట్లు దారిమళ్లింపు
– హైకోర్టు అక్షింతలు విడుదల కాని నిధులు
– చెప్పుతో కొట్టుకున్న వైసీపీ సర్పంచ్
– వైసీపీలో ఎందుకు ఉన్నానా అని వాపోయిన సర్పంచ్
– ‘చెప్పు’కోలేని సర్పంచులు వేలల్లోనే
– వందల కోట్ల బిల్లులు పెండింగ్‌లో
– సొంత సొమ్ముతో గెలిచిన సర్పంచులు
– చేతి చమురు వదిలించుకుని మరీ అభివృద్ధి పనులు
– అటు బిల్లులు రాక, ఇక ఎన్నికల ఖర్చు తీరక వెతలు
– హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటున్న సర్పంచులు
– అధికార పార్టీ సర్పంచుల్లో కట్టలు తెగుతున్న ఆగ్రహం
– సజ్జలపైనే తిరుగుబాటు చేసిన అసంతృప్తి
– వైసీపీ ఆఫీసు పెద్దలకు చెప్పినా ఫలితం శూన్యం
– రగులుతున్న వైసీపీ సర్పంచులు
( మార్తి సుబ్రహ్మణ్యం)
వాళ్లంతా ఊరికి పెద్దలు. వారి మాటే వేదవాక్కు. వారి చెబితే అది శిలాశాసనం. వారు వస్తున్నారంటే అందరికీ భయభక్తులు. ఏ పంచాయతీ అయినా వారు తీర్చాల్సిందే. ఎమ్మెల్యేలయినా, మంత్రులయినా ముందు వారి గుమ్మం తొక్కాల్సిందే. ఆ దర్పం నిన్నా, మొన్నటిది కాదు. కొన్ని దశాబ్దాల నాటిది!
కానీ ఇప్పుడు వారి పరిస్థితి కడు దయనీయం. నాటి డాబు లేదు. దర్పమూ లేదు. పార్టీల ప్రతిష్ఠకు పోయి, అప్పుల అప్పారావులుగా మారి, బికారిగా మారుతున్న దుస్థితి. ఊళ్లో ముఖం చెల్లక, హైదరాబాద్‌కు వెళ్లి కూలీల అవతారమెతుతున్న బతుకు. విషాదం. అలాంటి విషాదజీవులు ఇక సర్కారుతో తాడోపేడో అంటున్నారు. సొంత పార్టీ అయినా లెక్కచేయకుండా, అధికారపార్టీలో ఉన్నందుకు తమ చెప్పుతో తామే కొట్టుకునే, తిరుగుబాటుకు తెరవేపారు. తమ బకాయిలు ఎప్పడిస్తారని.. సొంత పార్టీ పాలకులనే ప్రశ్నించే స్థాయికి అడుగులేస్తున్నారు. ఏపీలో సర్పంచులు ప్రారంభించిన సమరం ఇది!
సర్పంచుల ఆకలికేకలతో ఏపీలోని గ్రామాలు దద్దరిల్లుతున్నాయి. చేసిన పనులకు బిల్లులు రాక, వచ్చిన బిల్లులు సర్కారు దొడ్డిదారిలో ఎత్తుకుపోవడంతో అప్పులపాలయి.. వడ్డీ వ్యాపారులకు సమాధానం చెప్పలేక.. ఊళ్లో తలెత్తుకోలేక.. సర్పంచులు నలిగిపోతున్నారు. మరోవైపు.. డజన్ల మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్న విషాద ఘటనలు. పేరుకు అధికార పార్టీ అయినా.. ఐదు పైసల ఉపయోగం లేని, నయా పైసా అధికారం లేని పార్టీలో ఎందుకు కొనసాగుతున్నామా? అని బహిరంగంగా తమ చెప్పుతో తామే కొట్టుకుని, ఆగ్రహజ్వాల ప్రదర్శిస్తున్న వైనం.. అటు అధికార వైసీపీ నాయకత్వానికీ ప్రమాద ఘంటికగానే మారింది.
గ్రామాలకు కేంద్రం నుంచి నేరుగా వచ్చే నిధులను, రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లిస్తున్న వైనం సర్పంచులకు శాపంగా మారింది. ఎన్నికల్లో 15 నుంచి 30 లక్షలు ఖర్చు చేయడంతోపాటు.. సొంత నిధులతో గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాని వైనం, సర్పంచులను బిచ్చగాళ్లకు చేస్తోంది. చాలామంది సర్పంచులు తమ దుస్థితి చెప్పేందుకు.. భిక్షాటన చేసిన సందర్భాలు, అధికార పార్టీని తలదించుకునేలా చేశాయి. వారిలో వైసీపీకి చెందిన సర్పంచులే ఎక్కువ ఉండటం విచిత్రం.
నిజానికి 2022-23 ఆర్ధిక సంవత్సరానికి… ఏపీలోని 12,918 గ్రామ పంచాయతీలకు 2020 కోట్ల రూపాయలు, కేంద్ర ఆర్ధిక సంఘం నిధులు విడుదల చేసింది. అయితే ఆర్ధిక సంవత్సరం ముగిసి ఏడాది దాటుతున్నా, ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను, గ్రామపంచాయితీలకు విడుదల చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జాతీయ బ్యాంకుల్లో సర్పంచుల పేరిట తెరచిన, పిఎఫ్‌ఎంఎస్ అకౌంట్లలో వేయాలన్నది సర్పంచుల డిమాండ్. కానీ ప్రభుత్వం మాత్రం పాత పద్ధతిలోనే సీఎఫ్‌ఎంఎస్- పిడి అకౌంట్లలో జమచేసుకుని, వాటి నుంచి సర్పంచులకు సమాచారం ఇవ్వకుండా, నేరుగా ప్రభుత్వమే ఆ నిధులను లాగేసుకుని, ఇతర పథకాలకు మళ్లించడం వివాదంగా మారింది. దానితోపాటు గ్రామపంచాయితీ నిధులపై ఫ్రీజింగ్ విధించడం కూడా, సర్పంచుల ఆగ్రహానికి కారణమవుతోంది. గ్రామీణాభివృద్ధికి కేంద్రం పంపిన 8660 కోట్లను సర్కారు మళ్లించి, సొంత అవసరాలకు వాడుకోవడంపై జరుగుతున్న రచ్చకు, సర్కారు నుంచి ఇప్పటిదాకా సమాధానం లేదు. అయితే ఆ నిధులను విద్యుత్ బిల్లులకు, జమ చేసుకున్నామని చెబుతున్న సర్కారు.. మళ్లీ కరెంటు బిల్లులు కట్టాలని, సర్పంచులపై ఒత్తిడి చేయడంపై మండిపడుతున్నారు.
గ్రామాల్లో చాలామంది సర్పంచులు మరొకరి పేరుతో అభివృద్ధి కార్యక్రమాలకు, అప్పులు చేసి మరీ తమ సొంత నిధులు వెచ్చించారు. కానీ నాలుగేళ్లయినా ఇప్పటిదాకా బిల్లులు రాకపోవడం, వడ్డీ వ్యాపారుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో, పలువురు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు సర్పంచుల విషాదానికి నిలువెత్తు నిదర్శనం. మరికొందరు సర్పంచులు పక్క ప్రాంతాల్లో కూలీ పనులకు వెళుతున్న దారుణం. ఇంకొందరు సర్పంచులు హైదరాబాద్ వలస వెళ్లి.. అక్కడ రోజువారీ కూలీ పనులు, హోటళ్లు, మెస్‌లలో పనులు చేస్తున్న అవమానకర పరిస్థితులు.
ప్రభుత్వ వైఖరి తమ స్థాయి తగ్గించాయని, అధికార వైసీపీ సర్పంచులు మండిపడుతున్నారు. బిల్లులు రాని వైనంపై ఎమ్మెల్యేలకు చెప్పినా, ఫలితం లేకపోవడం ఆగ్రహానికి గురిచేస్తోంది. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వైసీపీ సర్పంచ్.. వైసీపీలో ఎందుకు కొనసాగుతున్నానో అర్ధం కావడం లేదంటూ.. తన చెప్పుతో తానే కొట్టుకోవడం సంచలనం సృష్టించింది. ఇది అధికార పార్టీ సర్పంచుల విషాదానికి ఒక నిదర్శనమని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
గత ఎన్నికల సమయంలో పార్టీకి సొంత డబ్బులు ఖర్చు చేసి, గ్రామాల్లో వైసీపీ జెండా పాతిన సర్పంచులు, రేపటి ఎన్నికల్లో మళ్లీ పార్టీకి అదే అంకితభావంతో పనిచేయటం కష్టమని వైసీపీ నియోజకవర్గ నేతలు స్పష్టం చేస్తున్నారు. సర్పంచులతో ఎన్నికల్లో పనిచేయించుకోవడం ఈసారి కత్తిమీద సామేనంటున్నారు.
తమకు జరుగుతున్న అవమానాలు- దుస్థితిపై వైసీపీ సర్పంచులు.. గత ఫిబ్రవరి 1న జరిగిన సమావేశంలో, ఏకంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపైనే తిరుగుబాటు చేశారు. దీన్నిబట్టి వైసీపీ సర్పంచులలో ఆగ్రహజ్వాల స్థాయిలో ఉందో స్పష్టమవుతుంది. పార్టీ ఆఫీసులో జరిగిన వైసీపీ సర్పంచుల సమావేశంలో సర్పంచులు తమ దుస్థితిని, సినిమా కష్టాలు ఏకరవు పెట్టారు. ‘మా గ్రామ పంచాయితీ నిధులన్నీ మన ప్రభుత్వమే దొంగిలిస్తే మా గ్రామాలు ఎలా అభివృద్ధి చేయాలి? మమ్మల్ని నమ్మి గెలిపించిన మా ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి’’ అని నిలదీశారు.
అయితే.. ‘‘నవరత్నాల పథకాలకే మీ పంచాయితీ నిధులు మళ్లించడం వ ల్ల కొంత ఇబ్బందులున్న మాట నిజమే. అయినా నవరత్న పథకాల వల్లనే మీరు గెలిచారు’’ అని సజ్జల చేసిన వ్యాఖ్యలు, సర్పంచుల ఆగ్రహం మరింత పెంచాయి. ‘మేం గ్రామాల్లో కష్టపడి పనిచేస్తేనే జగన్ సీఎం అయి, ప్రభుత్వం వచ్చిందన్న విషయం గుర్తు పెట్టుకోవాల’ని ఖరాఖండీగా చెప్పడం వేడి పుట్టించింది. ఇది వైసీపీ సర్పంచుల ఆగ్రహం-అసంతృప్తికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది.
మరోవైపు.. ఫిబ్రవరి 1న గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు నుంచి గుంటూరు కలెక్టరేట్ వవరకూ సర్పంచులు నిర్వహించిన ర్యాలీ, వారి అసంతృప్తికి అద్దం పట్టింది. నిధులు లేని పదవులు మాకెందుకు? నిధులు-అధికారం లేని పదవులిచ్చి గ్రామాల్లో, తలెత్తుకోకుండా చేశారని సర్పంచులు విరుచుకుపడిన వైనం, మీడియాలో హల్‌చల్ చేసింది. కొందరు సర్పంచులు భిక్షాటన చేయడం, మరికొందరు రోడ్లపై పడుకుని నిరసన ప్రకటించిన దృశ్యాలు, వైసీపీ సర్కారును అప్రతిష్ఠపాలుచేశాయి.
ఇక నిధులు మళ్లించిన వైనంపై.. అటు హైకోర్టు కూడా అక్షింతలు వేయడంతో, వైసీపీ సర్కారు ముద్దాయిగా నిలబడాల్సి వచ్చింది. కేంద్రం పంపిన 14,15వ ఆర్ధిక సంఘ నిధులు దారిమళ్లించడంపె,ై ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయితీల ఖాతాలో నిధులను సర్పంచులకు తెలియకుండా, రాష్ట్ర ప్రభుత్వం ఎలా వాడుకుంటుంది? ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు ఎందుకు మళ్లించింది? ఒకవేళ మళ్లించినా ఆ నిధులను, మళ్లీ ఎందుకు పంచాయితీ నిధుల్లో ఎందుకు బదిలీ చేయలేదు? మూడు నెలలయినా ప్రభుత్వం కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని, వైసీపీ సర్కారుపై అక్షింతలు వేయడం.. సర్కారును ఇరుకునపెట్టింది.
ఈ అవమానాలు చాలవన్నట్లు.. సర్పంచులపై వాలంటీర్లను ప్రయోగించడాన్ని, వైసీపీ సర్పంచులు జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రామ సచివాలయాలు, వాలంటర్లీను తమకు సమాంతరంగా ప్రోత్సహించడాన్ని సర్పంచులు సహించలేకపోతున్నారు. వారంతా తమ అధీనంలో పనిచేయాలన్నది సర్పంచుల వాదుల. అధికార పార్టీ సర్పంచులమైనప్పటికీ, వాలంటీర్లకు ఉన్న విలువ కూడా తమకు ఇవ్వకపోతే, ఇక రేపటి ఎన్నికల్లో ప్రజలు తమ మాట ఎలా వింటారని నిలదీస్తున్నారు. గ్రామ ప్రజలను ప్రభావితం చేసే సర్పంచుల్లో నెలకొన్న అసంతృప్తి… చివరకు ఎటు దారి తీస్తుందోనన్న ఆందోళన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది.