Suryaa.co.in

Editorial

ఉండవల్లి ‘ఓదార్పు’ యాత్ర

– సజ్జల స్థానంలో ఉండవల్లిని పెట్టాలంటున్న వైకాపేయులు
– జగన్ ఓటమిపై తెగ బాధపడుతున్న ఉండవల్లి అరుణ్‌కుమార్
– మిత్రుడి బిడ్డ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ఉండవల్లి
– జగన్‌కు మళ్లీ మంచిరోజులు వస్తాయని జోస్యం
– తమిళ పార్టీలను సూత్రీకరించిన రాజమండ్రి మేధావి
– రాష్ట్ర ప్రయోజనాల కోసం బాబు పోరాడాలట
– జగన్ మళ్లీ జైలుకు వెళ్లే అవకాశమే లేదట
– ఈవీఎం గోల్‌మాల్‌పై బాబు కేంద్రాన్ని ప్రశ్నించాలట
– చంద్రబాబుపై ఉండవల్లి ‘కరణంగారి తెలివితేటల’ ప్రయోగం
– జగన్ ఓటమిపై ఉండవల్లి ‘పాజిటివ్ పోస్టుమార్టమ్’
– ఉండవల్లిని సలహాదారుగా పెట్టుకోవాలంటున్న వైసీపీ సీనియర్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)

రాజమండ్రి మేధావి, దివంగత ైవె ఎస్‌కు మరో ఆత్మ, జగనయ్యకు శ్రేయోభిలాషి, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ ఇక తటస్థ ముసుగు తొలగించి జగనయ్య పార్టీలో జాయినవడం మంచిది. జాయనవడమే కాదు. ఆ పార్టీకి సలహాదారుగా ఉంటేమంచిది. సజ్జల ఎలాగూ ఫెయిలయ్యారు. ఫలితాల తర్వాత పత్తా లేరు. ఉండవల్లి అయితే జగనయ్య శ్రేయోభిలాషి, స్వార్ధం లేని మనిషి కాబట్టి.. వైసీపీకి సలహాదారుగా ఉంటే మంచిది.. ఇదీ వైకాపేయుల మనోభావన! ఓవైపు పార్టీ ఓడిపోయి శోకతప్త హృదయంతో వెక్కిళ్లు పెట్టి ఏడుస్తున్న.. జగన్ సహా పార్టీ శ్రేణులకు, ‘ఓదార్పు-2’ యాత్ర చేపట్టిన.. ఏకైక హితైషి ఉండవల్లి కంటే, జగనయ్యకు శ్రేయోభిలాషి ఇంకెవరుంటారన్నది వైకాపేయుల ప్రశ్న.

వైకాపా ఓడినందుకు జగన్ కంటే ఉండవల్లి ఎక్కువ బాధపడిపోతున్నారు. రాజమండ్రిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఉండవల్లి సూత్రీకరించిన అంశాలు, తెరపైకి తెచ్చిన వాదనలు, చంద్రబాబుకు చేసిన సూచనలు, జగన్‌కు చెప్పిన ధైర్యవచనాలు.. ‘మెదడు’న్న వారంతా నిశితంగా పరిశీలిస్తే స్ఫురించేది అదే. గమ్మతుగా జగన్‌కు ధైర్యం చెప్పడానికి ఉండవల్లి తెరపైకి తెచ్చిన తమిళనాడు సూత్రీకరణ భేషుగ్గా ఉంది. తమిళనాడులో అప్పుడెప్పుడో కరుణానిధి-జయలలిత కాంబినేషన్ గురించి ఉండవల్లి విశ్లేషణ, జగన్‌కు బోలెడంత ధైర్యం చెప్పేదే. తమిళనాడులో ఒకసారి ఘోరంగా ఓడిన ఒక పార్టీ, మళ్లీ తర్వాతి ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చేవి. అదీ అరుణన్న జగనన్నకు చెప్పిన ధైర్యం. ఈ ముక్క చెప్పే తెలివి జగన్ పక్కనున్నవారికి ఏదీ? దటీజ్ ఉండవల్లి!

కాబట్టి 11 సీట్లు వచ్చినంతమాత్రాన కుంగి కుమిలిపోవాల్సిన పనిలేదు.. ఇంట్లో దుప్పటి కప్పుకుని పడుకోవాల్సిన పని అసలే లేదు.. నీ స్టైల్లో నువ్వెళ్లు బిడ్డా. మళ్లీ ఐదేళ్ల తర్వాత నీదే అధికారం అని చెప్పడమే ఉండవల్లి ప్రెస్‌మీట్ వెనుక కవిహృదయం. నిజంగా జగన్ ఉన్న ఈ విషమ పరిస్థితిలో, ఇంత దుఃఖ సాగరంలో ఇన్నేసి హితవచనాలు చెప్పి, మళ్లీ యుద్ధానికి సన్నద్ధం చేసేంత సాహసి ఎవరున్నారు? ఎక్కడున్నా జగన్ సుఖం కోరుకునే అరుణన్న తప్ప!

ఒకరకంగా ఆంధ్రాలో జగన్- పవన్ అదృష్టవంతులు. వారు కోరకుండానే బోలెడుమంది స్వయంప్రకటిత సలహాదారులున్నారు. వారు ఆలోచించకుండానే వారి తరఫున ఆలోచించేవాళ్లున్నారు. వారిద్దరితో సంబంధం లేకుండానే.. వారి అనుమతి-ప్రమేయం లేకుండానే వారేం చేయాలో నిర్దేశిస్తుంటారు. మీరు ఇట్లా చేయవద్దు. అట్లా చేయండి. మీరు ఆ పనిచేస్తే మీ అభిమానులు సహించరంటూ లేఖలు రాస్తుంటారు. లేకపోతే ప్రెస్‌మీట్లు పెడుతుంటారు. ఎలాగూ మీడియాకు మేత కావాలి కాబట్టి.. సదరు సలహాదారులు అవుట్‌డేటెడ్డా కాదా అని పెద్దగా పట్టించుకోరు. ఆరకంగా ఈ తరహా స్వయంప్రకటిత సలహాదారులు ‘మేం కూడా ఉన్నాం’ అని చెప్పుకునే ప్రయత్నాలు చేస్తుంటారు.

పవన్ మేలు కోసం ముద్రగడ-హరిరామ జోగయ్య, జగన్ మేలు కోసం ఉండవల్లి అరుణ్‌కుమార్.. ఈ బాపతు స్వయం ప్రకటిత సలహాదారులేనన్నది రాజకీయ పరిశీలన విశ్లేషణ. వాళ్లు కోరకుండానే- వాళ్లకు తెలియకుండానే వారికోసం శ్రమదానం చేసే టైపన్నమాట! పవన్ ఎలా నడవాలో ముద్రగడ-జోగయ్య ప్రెస్‌మీట్లలో మాట్లాడి మాట్లాడి అలసిపోయారు. టన్నులకు టన్నుల లేఖ రాసి డస్సిపోయారు. చివరాఖరకు వీరు విచిత్రంగా ‘జై జగన్’ అని, వైకాపేయులుగా రూపాంతరం చెందారు.

ముద్రగడ అయితే ఇచ్చిన మాట ప్రకారం, తన పేరును ‘పద్మనాభరెడ్డి’గా మార్చేసుకునే పనిలో ఉన్నారు. వీరికి ఎలాగూ పని ఉండదు. పెద్దగా ఇతర వ్యాపకాలూ ఉండవు. వీరిని పిలిచి సలహా అడిగేవారూ ఉండరు. ఒక్క మీడియా వాళ్లు మాత్రమే, అప్పుడప్పుడూ స్టోరీలకు బైట్ల కోసం గొట్టాలు పెడుతుంటారు. సరే.. ఎవరి తాపత్రయం వారిది. ఎవరి ఉనికి గోల వారిది!

ఇక మళ్లీ రాజమండ్రి మేధావి ఉండవల్లి దగ్గరకొస్తే.. తాజాగా ఆయన నిర్వహించిన ప్రెస్‌మీట్ భలే వింతగానూ, మరికొంత విడ్డూరంగానూ ఉంది. జగన్‌కు మళ్లీ మంచిరోజులొస్తాయని జోస్యం చెప్పిన అరుణనన్న.. చంద్రబాబుకూ ‘అడగకుండా’నే, కొన్ని సలహా ఇవ్వడమే ఆశ్చర్యపరిచింది. ఆ ప్రకారంగా.. విభజన హామీల మేరకు రాష్ట్రానికి 1.42 లక్షల కోట్లలో రావలసిన, 50 శాతం ఆస్తుల కోసం చంద్రబాబు పోరాడాలట.

నాటి విభజన బిల్లుపై మళ్లీ చర్చకు డిమాండ్ చేయాలట. స్కిల్ డెవలప్‌మెంట్ కేసును చంద్రబాబు సీబీఐకి అప్పగించే అవకాశం ఉందట. ఇక ప్రధానంగా ఇటీవలి ఎన్నికల సందర్భంగా కనిపించకుండా పోయిన, 20 లక్షల ఈవీఎంల గురించి చంద్రబాబు ఎలుగెత్తి చాటాలట. ఇలా ‘‘కరణం గారి తెలివితేటల’’న్నీ, అరుణన్న ఒక్క ప్రెస్‌మీట్‌లోనే ప్రదర్శించేశారు.

ఆయన కోణంలో ఇవన్నీ రాష్ట్ర ప్రయోజనాలు. కాదనలేం. మరి ఈ తెలివితేటలన్నీ.. తన మిత్రుడి కొడుకు జగన్ సీఎంగా ఉన్నప్పుడు చెప్పి, ఆయన చెవులు పిండి ఎందుకు చేయించలేకపోయారన్నది బుద్ధిజీవుల ప్రశ్న. సరే జగనంటే జగమొండి కాబట్టి, కాసేపు ఆయన మాటలు వినలేదనుకుందాం. ఆయనకు చెబితే వినే అలవాటు లేదనుకుందాం.

కానీ కేసీఆర్ ఇంటికి భోజనానికి వెళ్లి, పప్పు-ఆవకాయ-ఉలవచారు-గోంగూర తిన్నప్పుడు.. ఆయనతో విభజన హామీలు పరిష్కరించుకోండి అని ఇదే రాజమండ్రి కరణం గారు ఎందుకు చెప్పలేదు? మీ రాష్ట్రం నుంచి మా రాష్ట్రానికి న్యాయంగా రావలసిన విద్యుద్ బకాయిలు సహా, ఇంకా బోలెడు విభజన పనులు వెంటనే చేయాలని, అప్పుడే కేసీఆర్‌ను ఎందుకు ప్రశ్నించలేదన్నది రాజమండ్రి వాసుల ప్రశ్న. అంతకంటే ముందు.. అసలు తెలంగాణతో ఆస్తుల పంచాయతీ తేలకుండా సెక్రటేరియేట్ భవనం ఎలా ధారాదత్తం చేశావని జగన్‌ను ఎందుకు నిలదీయలేదన్నది రాజమండ్రి ప్రెస్‌క్లబ్ గోడలు సంధిస్తున్న ప్రశ్న.

ఇక మాయమైన ఈవీఎంల ముచ్చటను.. చంద్రబాబు మాట్లాడితే బాగుంటుందన్న రాజమండ్రి కరణం గారి తెలివితేటలేవో.. ఓడిపోయి మైలేజీ కోసం ఎదురుచూస్తున్న జగనయ్యకే చెప్పి, ఆయనను హీరోను చేయవచ్చు కదా? టీడీపీ ఎన్టీయే కూటమిలోనే ఉంది. కాబట్టి అది ఈవీఎంల గురించి మాట్లాడలేదు. అంటే టీడీపీతో ఆ అంశాన్ని మాట్లాడించి, దానిని ఎన్డీయే నుంచి బయటకు వచ్చేలా చేస్తే.. తన మిత్రుడి కొడుకు జగన్‌ను టీడీపీ స్థానంలో ఎన్డీయేలో చేర్చాలన్న, కరణం గారి తెలివితేటలు కనిపిస్తూనే ఉన్నాయి. అది గ్రహించడానికి మేధావి కానక్కర్లేదు. మెదడుంటే చాలు!

అదేదో జగన్‌తోనే.. మాయమైన ఈవీఎంల గురించి నిలదీయిస్తే, కేంద్రాన్ని ఎదిరించిన మొనగాడిగా పేరు వస్తుంది కదా? ఆ సలహా జగనయ్యకు ఎందుకివ్వలేదు? ఎందుకివ్వలేదంటే.. జగన్ కేసుల పిలక కేంద్రం వద్దే ఉంది కాబట్టి! జగన్ అలా గళం విప్పితే, ఆయన మీద ఇలా మళ్లీ పాత కేసులు చుట్టేస్తాయి కాబట్టి!!

ఆ ప్రకారంగా మిత్రుడి కొడుకును.. మళ్లీ కష్టాల్లోకి నెట్టడం ఇష్టం లేక, చంద్రబాబు భుజంపై తుపాకీ పెట్టి ఎన్డీయేను పేల్చే ఎత్తుగడ అన్నమాట. ఈ ‘కరణం గారి తెలివితేటలు’ రాజమండ్రి వాసులకే తెలిసినప్పుడు.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు తెలియకుండా ఉంటాయా? రాజకీయ కరణంగారి అమాయకత్వం కాకపోతే?!

ఇక బాబు అరెస్టుకు కారణమైన స్కిల్ డెవలెప్‌మెంట్ కేసును, సీబీఐకి అప్పగిస్తారన్న మరో జోస్యం కూడా కరణంగారి తెలివితేటల్లో భాగమేనన్నది తమ్ముళ్ల అనుమానం. ఆ ప్రకారంగా ఆ కేసును సీబీఐకి అప్పగించేలా చేసి.. జగన్ మాదిరిగానే, చంద్రబాబు జుట్టును కేంద్రానికి అప్పగిస్తే, చూసి ఆనందించాలన్నది రాజమండ్రి కరణం గారి కోరికలా ఉందన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. పార్ట్‌టైం పొలిటీషియనయిన ఉండవల్లికే ఇన్ని తెలితేటలుంటే.. పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బాబుకు ఇంకె న్ని తెలివితేటలుంటాయని ఆలోచించకపోవడమే ఆశ్చర్యం.

తన మిత్రుడి సుఖం .. రాజకీయ భవిష్యత్తు కోసం ఇంకా పరితపిస్తున్న ఉండవల్లిని, వైసీపీ సలహాదారుగా నియమించాలన్నది ఇప్పుడు వైకాపాలో వెల్లువెత్తుతున్న డిమాండ్. ఇంకా ఎంతకాలం ఉండవల్లి ముసుగులో మాట్లాడతారు? అదేదో మనమే ఆ ముసుగు తీయించి.. వైకాపా కండువా కప్పేసి, సలహాదారు పదవి ఇస్తే ‘ఫ్యాను’ కిందే సేదతీరుతారు కదా? అసలు ఉండవల్లి కంటే జగన్‌ను ప్రేమించే ఆరాధకులెవరు?

అంతా జగనయ్య ఇచ్చే పదవులు-డబ్బుల కోసం ఆరాటపడేవారే తప్ప, ఈవిధంగా జగన్ బాగు కోసం ఆలోచించేవారెవరు? పైగా సబ్జెక్టు నాలెడ్జ్ కూడా బాగా ఉన్నందున, జగనయ్య ప్రసంగాలు-అసెంబ్లీలో (అవకాశం ఇస్తే) టాకింగ్ పాయింట్లకు, రాజమండ్రి మేధావి అక్కరకొస్తారుకదా అన్నది వైకాపేయులు జగనయ్యకు ఇస్తున్న సలహా.

నిజమే. ఉండవల్లి మాత్రం ఎంతకాలం ఈ ముసుగులో, మూగప్రేమతో ఊపిరాడకుండా ఉంటారు? ఈ వయసులో ఆయనకూ ఏదో వ్యాపకం కావాలి కదా? ఎంతైనా అలవాటయిన ప్రాణం కదా? ఎన్నిరోజులు రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌కు పరిమితమవుతారు? ఆయనది రాష్ట్ర స్థాయి కాబట్టి, అదేదో వైకాపా తీర్థం తీసుకుని, తాడేపల్లిలో ప్రత్యక్షమైతే జగనయ్యకు బోలెడంత బలం, ఊరట కదా? అలా ఎందుకు ఆలోచించకూడదు?

LEAVE A RESPONSE