– అవి బ్రాహ్మణ సామాజికవర్గం వారివన్న ఆపేక్షనా?
– వాటిలో బాధితులలో బ్రాహ్మణులే ఎక్కువ
– మరి వారి గురించి పోరాడరేం సారూ?
గోదావరి జిల్లా వాసిగా పార్టీలకు అతీతంగా ఉండవల్లి గారంటే నాకు అభిమానం, గౌరవం వున్నాయి.కానీ కాస్తో,కూస్తో చదువుకుని ,కాస్తా సామాజిక స్పృహ కలిగిన ఒక సామాన్య వ్యక్తిగా ఉండవల్లి గారికి ఒక చిన్న ప్రశ్న లేదా సూచన…
అయ్యా ఉండవల్లి గారు..
గడచిన రెండు దశాబ్దాలుగా ఎప్పుడు రామోజీ గారు, మార్గదర్శి ,ఈనాడు పేర్లు వినిపించిన మీరు వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం పరిపాటి.అయితే దాదాపు అయిదు దశాబ్దాల నుంచి రామోజీ రావు, ఈనాడు, మార్గదర్శి పేర్లు వింటున్నాం.ఈ దేశంలో చాలా ఆర్ధిక సంస్థలు తమ సంస్థలో పొదుపు చేసుకున్న మదుపుదారుల సొమ్ముని ఎగవేసిన కేసులు కోకొల్లలు. మీరు అలాంటి వాటి గురుంచి మాట్లాడిన దాఖలాలు లేవు. ఈరోజు దాకా మార్గదర్శిలో పొదుపు చేసుకున్న మదుపు మాకు ఇవ్వలేదని ఎవరు ఫిర్యాదు చేసిన విషయం నాకైతే తెలీదు. మీ దృష్టిలో అలాంటివి వుంటే చెప్పండి తెలుసుకుంటాం. ఏది ఏమైనా మార్గదర్శి చేసే వ్యాపారం చట్ట విరుద్ధం అన్న మీ ఆరోపణలో నిజానిజాలు కోర్టులో నిర్ధారణ అవుతుంది. న్యాయపరమైన అంశం కాబట్టి నేను దాని జోలికి పోను.
మార్గదర్శి వారు ఎప్పుడైనా వ్యాపారంలో నష్టపోతే మదుపుదారులు పొదుపు చేసుకున్న సొమ్ము ఏమైపోతుందా అన్న మీ ఆందోళన నేను అర్ధం చేసుకుంటా. అయితే అదే సమయంలో మన గోదారి జిల్లాలో ఈ మధ్యే జయలక్ష్మి సొసైటీ, ఆ మధ్య అగ్రిగోల్డ్ లాంటి సంస్థలు మూసేసి వేలాదిమంది మదుపుదారులు సొమ్ము వందల కోట్ల సొమ్ము దోచేశారు. అందులో సామాన్య కుటుంబాలకు చెందిన వేలాదిమంది కోట్లాది రూపాయలు వున్నాయి. ఇందులో అన్ని సామాజిక వర్గాలు వున్నాయి.
ముఖ్యంగా ఈ సంస్థల యాజమాన్యం బ్రాహ్మణ సామాజిక వర్గం కాబట్టి, ఈ మదుపుదారుల్లో బ్రాహ్మణులు కూడా చాలామంది వున్నారు. మదుపుదారులు నుంచి ఎటువంటి ఫిర్యాదు లేని మార్గదర్శి అక్రమాలు గురుంచి తరచు ప్రెస్ మీట్స్ పెట్టే మీరు.. ఈ రెండు సంస్థలు గురుంచి కనీసం ఎప్పుడు ప్రస్తావించక పోవడం కుల పక్షపాతం అని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆనాడు అవినీతి ఎక్కడ వున్న కుక్కలా పసిగడతాను అన్న మీ మాటలు, ఇప్పటికీ మా చెవుల్లో మార్మోగుతున్నాయి. కాబట్టి కేవలం తన సామాజిక వర్గానికి సంబంధించిన సంస్థలు కాబట్టి, వాటి గురించి ఎప్పుడు ఉండవల్లి గారు మాట్లాడరు అన్న అపప్రధ మీకు రాకూడదని మీ అభిమానిగా నా కోరిక. అన్యధా భావించకుండా ఆ రెండు సంస్థలు వల్ల నష్టపోయిన బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకి మీరు బాసటగా నిలుస్తారని ఆశిస్తూ..
– చిరంజీవి