-మా నౌకరీలు మాగ్గావాలే నినాదంతో ఈనెల 25న ఇందిరాపార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ‘‘నిరుద్యోగ మహా ధర్నా’’
-టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందే
-కేటీఆర్ ను బర్తరఫ్ చేయాల్సిందే
-పరీక్షల రద్దు నేపథ్యంలో నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వాల్సిందే
-పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నేతలతో సమావేశమైన బండి సంజయ్ కుమార్
-మీడియా సంస్థలపైనా, జర్నలిస్టులపైనా కేసీఆర్ సర్కార్ చేస్తున్న దాడులపై పోరాడాలని నిర్ణయం
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మరో ఆందోళనకు సిద్ధమైంది. ‘‘మా నౌకరీలు మాగ్గావాలె’’ నినాదంతో ఈనెల 25న ఇందిరాపార్క్ వద్ద ‘‘నిరుద్యోగ మహా ధర్నా’’ చేపట్టాలని నిర్ణయించింది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగే నిరుద్యోగ యువతతో కలిసి ఈ నిరుద్యోగ మహా ధర్నా నిర్వహించనుంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమై టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ, మీడియా సంస్థలపై దాడులు, జర్నలిస్టుల అరెస్ట్ వంటి అంశాలపై చర్చించారు.
పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు జి.వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్సీ ఎస్.రామచంద్రరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు ఆంటోనీ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ, అధికార ప్రతినిధి జె.సంగప్ప తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ నేపథ్యంలో 30 లక్షల మంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నందున, వారికి మద్దతుగావ వివిధ రూపాల్లో పోరాట కార్యక్రమాలను రూపొందించేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా సాగర హారం, మిలియన్ మార్చ్ వంటి అంశాలు ఈ సందర్భంగా చర్చకొచ్చాయి. తొలుత ఈనెల 25న ఇందిరాపార్క్ వద్ద నిరుద్యోగ మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో సీఎం కేసీఆర్ కొడుకు పాత్ర ఉన్నందున వెంటనే ఆయనను బర్తరఫ్ చేయాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలని, ఖాళీ ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలనే ప్రధాన డిమాండ్లతో నిరుద్యోగ మహాధర్నా చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని బండి సంజయ్ పార్టీ నేతలను కోరారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై గళం విప్పుతూ ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్న మీడియా, సోషల్ మీడియా సంస్థలను, యూ ట్యూబ్ ఛానళ్లను బెదిరించడం, జర్నలిస్టులను అరెస్ట్ చేయడం వంటి పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా సంస్థలు, జర్నలిస్టులకు అండగా నిలవడంతోపాటు వారి పక్షాన పోరాటం చేయాలని ఈ సందర్భంగా పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా ఆయా సంస్థల కార్యాలయాలకు వెళ్లి జర్నలిస్టులకు సంఘీభావంగా తెలపాలని నిర్ణయించారు. అందులో భాగంగా వివేక్, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులతో బండి సంజయ్ బృందాన్ని ఏర్పాటు చేశారు.