Suryaa.co.in

Andhra Pradesh Telangana

తెలుగు రాష్ట్రాల్లో అనూహ్య వాతావరణం

– వాతావరణ శాఖ హెచ్చరికలు

విశాఖపట్నం: మునుపెన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు పగటిపూట రోకండ్లు పగిలే ఎండ..మరోవైపు విపరీతమైన ఈదురు గాలులు, అకాల వర్షాలు ప్రజల్ని అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా ఇరు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది.

వాతావరణంలో తీవ్ర మార్పులు ఉంటాయని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. రాబోయే ఐదురోజుల్లో ఓ మోస్తరు వర్షాలు ఉంటాయని తెలిపింది. అంతేకాదు.. క్యుములో నింబస్‌ మేఘాల ప్రభావంతో కొన్ని చోట్ల కుండపోత వానలు కురుస్తాయని తెలిపింది. 40-50 కిలోమీటర్ల వేగంతో గాలిదుమారం వీస్తుందని, అలాగే క్రికెట్‌ బాల్‌ సైజ్‌లో వడగండ్ల వానకు ఆస్కారం ఉందని హెచ్చరించింది.

మరోవైపు పగటి పూట ఉష్ణోగ్రతల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ పెరుగుదల ఉండొచ్చని అంచనా వేస్తోంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తోంది.

LEAVE A RESPONSE