Suryaa.co.in

Features

తిరునాళ్ల ఉత్సాహాలతో కోట్ల రూపాయలు ఆవిరి

-సాంప్రదాయ తిరునాళ్లలో వికృత చర్యలు, రాజకీయ పార్టీల అండదండలు .. సొమ్ము చేసుకుంటున్న పోలీసులు ..

పల్నాడు జిల్లా వినుకొండ ప్రాంతం అంటే వెనుకబడిన ప్రాంతంగా చెప్పవచ్చు అభివృద్ధికి ఆమడ దూరంలో కనీస మౌలిక వసతులు కరువై అభివృద్ధికి నోచుకోని పల్లె ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో ఒక్క రాత్రికి తిరునాళ్ళ వేలం వెర్రి కి కోట్ల రూపాయలు ప్రజలు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఇందుకు నిలువెత్తు సాక్ష్యం నిన్న జరిగిన వినుకొండ కొండ పండగ తిరణాళ్ల తొలి ఏకాదశి తో తిరుణాల్లలు ముగుస్తాయి. ఒక్క వినుకొండ ఏకాదశి తిరుణాలలో ఒక్కరాత్రికి 11 విద్యుత్ ప్రభలు నిర్మించి దాదాపు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇందుకు రాజకీయ ప్రజా ప్రతినిధులు వత్తాసు పలికారు.

తెలుగుదేశం పేరుతో ఆరు, వైసీపీ పేరుతో 5 ఎలక్ట్రికల్ విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేసి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేశారు. కోవిడ్ నిబంధనలు సడలించడంతో ఆర్థిక మాన్యాన్ని సైతం లెక్కచేయకుండా వినుకొండ నియోజకవర్గం లో ఈఏడాది దాదాపు 100 విద్యుత్ ప్రభల్తో గ్రామ గ్రామాన తిరునాళ్ల ఉత్సవాలకు 50 కోట్ల వరకు ఖర్చు చేసి ఉంటారని ఒక అంచనా ఇలా సంతలు, సాంప్రదాయాలకు దైవ భక్తితో జరపాల్సిన ఈ ఉత్సవాలను రికార్డింగ్ డాన్సులతో, విద్యుత్ ప్రభలు నిర్మించి డబ్బును వృధా చేస్తున్నారు. వెనుకబడిన బోల్లపల్లి వంటి అటవీ ప్రాంతంలో సైతం త్రాగడానికి నీరు లేకపోయినా లక్షలు ఖర్చు చేసి సొనకానందాన్ని పొందుతున్నారు. ఎందుకు తెలుగుదేశం, వైసీపీ పార్టీలు వారి జండాలను ఇచ్చి ప్రచారాలకి వేదికగా మార్చుకుంటున్నారు. ఈ సందర్భంగా శావల్యాపురం మండలం బొందిలిపాలెం గ్రామంలో తెలుగుదేశం, వైసీపీ వర్గాల మధ్య తిరునాళ్ల ప్రభల ఏర్పాటు విషయంలో ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. అయినా తిరుణాళ్లు మాత్రం ఆగలేదు. స్థానిక పోలీసులు ముడుపులు అందుకోని అనుమతులు ఇస్తున్నారన్నది బహిరంగ రహస్యం.

సొమ్ము చేసుకుంటున్న పోలీసులు

తిరుణాళ్లను కూడా పోలీసులు ఆదాయ వనరులుగా ఉపయోగించుకుంటున్నారని విమర్శలు వినవస్తున్నాయి.అయితే అధికార పార్టీ ప్రభలు నిర్మించిన వారికి పోలీస్ మామూళ్ల డిస్కౌంట్ వసతి కల్పించారట. తెలుగుదేశం ఒక్కొక్క ప్రభ నుండి 30,000 వసూలు చేస్తే, అధికార పార్టీ వారి నుండి పదివేలు మాత్రమే తీసుకుంటున్నారన్నది పెద్ద చర్చగా మారింది. ఇలా జరుగుతున్న తిరునాళ్లకు రాజకీయ పార్టీ నేతలు కూడా ఆర్థిక సహాయం తమ వంతు చేస్తూ తిరునాళ్లకు అండదండలుగా నిలుస్తున్నారు. ఇలా వినుకొండతోTdp-ycp పాటు పల్నాడు ప్రాంతంలోని అనేక పల్లెల్లో కూడా తిరునాళ్ల పేరుతో జరుగుతున్న ఆర్థిక విధ్వంసం పై అధికారుల మౌనం వెనుక ఆంతర్యం ఏమిటి..? ఆర్థిక సంక్షోభంతో కృంగిపోతున్న ఈ సమయంలో కోట్ల రూపాయలు తిరునాళ్లకు కుమ్మరిస్తుంటే రాజకీయ నేతలు, అధికారులు, ప్రజాప్రతినిధులు వత్తాసులో పలకడం ఏమిటని విమర్శలు వినవస్తున్నాయి. ఇదే నిధులతో గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రోత్సహిస్తే బాగుంటుంది అని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు. పంటలు సరిగా పండక రైతాంగం నష్టాల ఊబిలో ఊరుకుపోయారు. నిత్యవసర వస్తువుల ధరలు నింగినంటుతున్నాయి. ఆర్థిక మాన్యం జీవన ప్రమాణాలకు ఇబ్బందిగా మారింది. ఇలాంటి సమయంలో అన్నదానం వంటి కార్యక్రమాలను ప్రోత్సహించి పేదవాడి కడుపు నింపిన ఉపయోగం ఉంటుంది. అంతేకానీ ఒక రాత్రి తిరునాళ్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అవివేకంగా చెప్పవచ్చు ఇప్పటికైనా అధికార యంత్రాంగం వేలం వెర్రి తిరునాళ్లను కట్టడి చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలి.

-vrc

LEAVE A RESPONSE