విద్యా ప్రణాళిక సదస్సు ఆగస్టు నెలలో సమావేశ పరచి ప్రణాళికలు రూపొందిస్తున్నారంటే మన విద్య అధికారులకు విద్యపై ఎంతమేరకు చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. బోధన, అభ్యసన కార్యక్రమాల్లో జాప్యం జరగకుండా వీలైనంత త్వరగా అడ్మిషన్లు నిర్వహించాలని ఉపకులపతులు, విద్యా అధికారులు భావించినా ప్రవేశాల ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. డిప్లొమా అడ్మిషన్లలో కేవలం ముప్పైఐదు శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాలలో నలభై శాతం సీట్లు మిగిలిఉన్నాయి. దాదాపు 85 ప్రైవేటు ఐటీఐ లలో సున్నా అడ్మిషన్లు. ప్రతి సంవత్సరం నిర్వహించాల్సిన రీసర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మూడేళ్లకొకసారి మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. 2020 లో పరీక్ష నిర్వహించి 2021 లో ఫలితాలు విడుదల చేసి 2022 లో అడ్మిషన్ జరుపుతున్నారు. విశ్వవిద్యాలయాలలో పీజీ చేరే విద్యార్థులు లేరు.
గత సంవత్సరం వందలాది సీట్లు భర్తీ కాక మిగిలిపోయాయి. జగనన్న విద్యా దీవెన ప్రైవేటు కళాశాలలకు వర్తించదు కాబట్టి చాల కళాశాలల్లో సీట్లు భర్తీ కాక నిశబ్ద రాజ్యం రాజ్యమేలుతుంది. ఇక రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం ఆర్జేసీసెట్, డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆర్డీసీసెట్ నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్ అడ్మిషన్ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు అడ్మిషన్ ప్రక్రియ మే నెలలో ప్రారంభించి జూన్ నెల నుండి పాఠాలు బోధిస్తుంటే మన వారు సెప్టెంబర్ సమీపిస్తున్న అడ్మిషన్ల ఊసే లేదు. ప్రభుత్వం నిర్వహించిన కామన్ ఎంట్రన్స్ టెస్టు లో మంచి ర్యాంకు సాధించినా ప్రైవేటు విశ్వవిద్యాలయాలలో చేరుతున్నారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలలో కోర్సులకు పరిమితులు ఉండవు, ఎన్ని కావాలంటే అన్ని సీట్లు భర్తీ చేసుకోవచ్చు. డిమాండ్ ఉన్న కోర్సులో పదిహేను, ఇరవై సెక్షన్లు భర్తీ చేసుకొని కోర్ ఇంజినీరింగ్ బ్రాంచీలను నిర్లక్ష్యం చేస్తున్నారు. సెప్టెంబర్ లో ప్రభుత్వం నిర్వహించే అడ్మిషన్ ప్రక్రియలో పాల్గొని మంచి కాలేజీలో సీట్లు వచ్చినా ప్రైవేటు విశ్వవిద్యాలయం వారు వీరు కట్టిన ఫీజు, సకాలంలో సర్టిఫికెట్లు వాపసు ఇవ్వరు. చాల మంది విద్యార్థులు చేసేదేమి లేక అక్కడే చదువు కొనసాగిస్తున్నారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలలో అడ్మిషన్లు కట్టడి చేయాలి, ప్రభుత్వ సెట్ ద్వారా అడ్మిషన్లు వేగవంతం చేయాలి లేదా ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు పూర్తి అయిన తరువాతే ప్రైవేటు కళాశాల అడ్మిషన్లు జరగాలి. ప్రభుత్వ కళాశాలలో విద్యను పటిష్ఠపరుస్తున్నాం అని గొప్పలు చెప్పేవారు, ఆచరణలో పేద మధ్యతరగతి ప్రజలకు విద్యను దూరం చేసేదిగా ఉందని డా.యం.సురేష్ బాబు అభిప్రాయపడ్డారు.
డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ మరింత ఆలస్యమయ్యేలా ఉంది. కరోనాకు ముందు వరకు ఏటా జూలై ఒకటో తేదీ నుంచి అడ్మిషన్ల స్వీకరణ, ఆ వెంటనే తరగతుల ప్రారంభం జరిగేది. అయితే గత రెండేళ్లు కోవిడ్- 19 కారణంగా విద్యా సంవత్సరం ప్రారంభం కావడంలో తీవ్ర జాప్యం జరిగిన విషయం తెలిసిందే. ఆ ప్రభావం గత విద్యా సంవత్సరంపైనా చూపడంతో ఇంటర్మీడియట్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఫెయిలయ్యారు. గత నెల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫస్టియర్ 54 శాతం, సెకండియర్ 61 శాతం మంది పాసయ్యారు. ఈ నేపథ్యంలో ఫెయిలైన విద్యార్థులు వెనుకబడిపోకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆ మేరకు షెడ్యూల్ కూడా విడుదల చేసింది. పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పాసైతే.. వారిని రెగ్యులర్‌గా పాసైన వారితోపాటుగానే పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అదే విధంగా మార్కుల మెమోలనూ విడుదల చేయనున్నారు.
ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా అదే విధంగా విద్యా సంవత్సరం నష్టపోకుండా ఆగస్టు మూడో తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి, త్వరితగతిన ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయ్యే వరకు డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యేలా లేదు. దీంతో సెప్టెంబర్ నెలలోకానీ డిగ్రీ తరగతులు ప్రారంభం కాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపు రెండు నెలలు ఆలస్యంగా డిగ్రీ విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. అయితే వచ్చే ఏడాది నుంచి షెడ్యూల్ ప్రకారమే నిర్వహించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ నిర్వహించాలని దాదాపు పది వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల పరీక్షల జవాబు పత్రా పరిశీలన దాదాపుగా పూర్తయింది. వచ్చే వారంలో రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు సంబంధించిన ఫలితాలు వెల్లడి కానున్నట్లు సమాచారం.
