– వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెంనాయుడు
అమరావతి: రాష్ట్రంలో యూరియా సరఫరా, అమ్మకం తదితర అంశాలు క్రమంగా కుదుట పడుతున్నాయని, రైతులలో మరింత అవగాహన పెంచేలా ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న కృషి చేస్తోందని దీంతో వారిలో అభత్రతా క్రమంగా తగ్గుతూ వస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెంనాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కలెక్టర్, ఎస్ పి, విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులతో ఏర్పరిచిన బృందాలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ, తనిఖీలను చేబట్టడం ద్వారా, రైతులతో కలిసి చర్చించటం ద్వారా, రైతులలో యూరియా లభ్యత పై మరింత అవగాహన పెరిగిందని తెలిపారు. తద్వారా ముందస్తు కొనుగోళ్లు జరపకుండా, తక్షణ అవసరాలకు అనుగుణంగా మాత్రమే కొనుగోళ్లు జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. కొన్ని పత్రికలలో ‘ముందే మల్లించేశారు’ అనే శీర్షికన ప్రచురితమైన వార్తను దృష్టిలో ఉంచుకుని వివరాలను తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోని వ్యవసాయ వాతవరణ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని ప్రాంతాలలో కూరగాయల పంటలు, మరికొన్ని చోట్ల దీర్ఘ కాల పండ్ల తోటలు,ఉద్యాన పంటలకు ఏప్రిల్ నుండి జూన్ వరకూ మధ్య మధ్యలో కురిసే చిన్న పాటి వర్షాలకు పాటు అంతర కృషి చేసుకుంటూ పంటలకు ఎరువులను అందిస్తారని వివరించారు. అదే సమయంలో చాలా చోట్ల జూన్ చివరలో నారు మడులు వేయడం అనాదిగా వస్తున్న విషయం అని తెలిపారు. కొంత మంది ఆర్థిక స్తోమత కలిగి వుండి పెద్ద సంఖ్యలో భూకమతాలు వున్న రైతులు ముందస్తు గానే ఎరువులను కొనుగోలు చేస్తుంటారని తెలిపారు.
దీంతో ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో సరాసరి రాష్ట్ర మొత్తమ్మీద కేవలం 35,000 నుండి 40,000 మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే వినియోగించారని తెలిపారు. జూలై లో నెల్లూరు, తిరుపతి జిల్లాలలో అనాదిగా యడగారు పంటగా వరి నాట్లు ముమ్మరంగా జరుగుతాయన్నారు. ఈ కారణంగా ఆ నెలలో 90,000 మెట్రిక్ టన్నుల యూరియా వినియోగిస్తారన్నారు. నెలవారీ రాష్ట్ర స్థాయిలో జిల్లాల వారీగా యూరియా అమ్మకాలను పరిశీలిస్తే ,అవగాహన కలుగుతుందని తెలిపారు.