– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి: పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలోని రోగులకు అందుతున్న సేవలపై తెలుగుదేశం పార్టీ దర్శి ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆరా తీశారు. ఈ మేరకు ఆమె గురువారం ఉదయం ఆసుపత్రిలోని రోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఇన్ పేషెంట్లు, ఔట్ పేషెంట్ల వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ వైద్యశాల సూపరెంటెండెంట్, డాక్టర్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారా లేదా అని ఆరా తీశారు. ఆస్పత్రిలో వైద్య సేవలపై లక్ష్మి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మీడియాతో మాట్లాడారు. అకాల వర్షాలు పడుతున్న ఈ సీజన్లో జ్వరాలు అధికంగా ఉన్నాయని ఆమె తెలిపారు. జ్వరాలను నిర్లక్ష్యం చేయకుండా దర్శి లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వైద్య సేవలు వినియోగించుకోవాలని కోరారు. జ్వరం ఒక్కోసారి చాలా ఇబ్బందులు కొనితెస్తుందని హెచ్చరించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, జ్వరం రాగానే ఆసుపత్రులకు వెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీఐ రామారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు, తదితరులు ఉన్నారు.