Suryaa.co.in

Andhra Pradesh

వకుళా మాతా మన్నించు తల్లీ…

– బీజేపీ నాయకులు టెంకాయలు కొట్టి వేడుకోలు

చంద్రగిరి: ఇక్కడి బైపాస్ రోడ్డు లోని పేరూరు వద్దగల వకుళా మాత ఆలయం వద్ద భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, నవీన్ కుమార్ రెడ్డి, పురుషోత్తం నాయుడు, విష్ణువర్ధన్ రెడ్డి, నరేష్ కుమార్ నాయుడు, జీఎస్‌ ప్రేమ్, చిన్నా, రమేష్, ప్రసన్న, మహేష్ లతో పాటు స్థానిక నాయకులు భక్తులతో కలిసి టెంకాయలు కొట్టి శ్రీవారి లడ్డుని అపవిత్రం చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని అమ్మ వారిని వేడుకున్నారు.

ఈ సందర్భంగా రమేష్ నాయుడు, నవీన్ కుమార్ రెడ్డి, పురుషోత్తం నాయుడులు మాట్లాడుతూ… తిరుమల శ్రీవారికి తల్లిగా కొండపైన ఆలయంలో ఉన్న వకుళా మాత ప్రతినిత్యం “అన్న ప్రసాదాల పోటు” సంరక్షకురాలుగా శ్రీ వెంకటేశ్వర స్వామికి తయారు చేసే నైవేద్యాలను అన్నప్రసాదాలను నిరంతరం పర్యవేక్షిస్తుందని చరిత్ర చెబుతుందన్నారు. అలాంటి అమ్మవారి కళ్ళు కప్పి అపవిత్రమైన నెయ్యి ను వినియోగించి స్వామివారికి నైవేద్యంగా శ్రీవారి భక్తులకు ప్రసాదంగా అందించిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని వేడుకొంటున్నామని తెలిపారు.

వైసీపీ పాలనలో కమిషన్లకు కక్కుర్తి పడి కోట్లాది మంది భక్తుల మనోభావాలను ఆలయ పవిత్రతను భ్రష్టు పట్టించిన దుర్మార్గులను వదిలే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం సైతం తిరుమలలో జరిగిన అపవిత్రంపై అందుకు బాధ్యులైన వారిపై త్వరలో కఠిన చర్యలు తీసుకోబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ప్రధాని సైతం తిరుమలలో జరిగిన అపవిత్రతపై ఆవేదన వ్యక్తం చేశారని దోషులను శిక్షించేందుకు త్వరలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వబోతున్నదన్నారు.

దుర్మార్గపు అవినీతి అధికారులు, పాలక మండలి చైర్మన్ లు శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రీకృష్ణ దేవరాయల కాలంనాటి నుంచి నేటి వరకు ఎంతో మంది దాతలు రాజులు మహంతులు ఇచ్చిన కానుకలు వజ్ర వైడూర్యాలతో పాటు కోట్లాది రూపాయల బ్యాంకు డిపాజిట్లను కూడా మాయం చేశారా? అన్న అనుమానాలు భక్తులలో కలుగుతున్నాయన్నారు.

తిరుమల శ్రీవారికి వెలకట్టలేని నగలు, బ్యాంకులోని వేలకోట్ల డిపాజిట్లపై దుర్మార్గులు కన్నేశారా, స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకున్నారా? అనే పలు అనుమానాలు కోట్లాది మంది భక్తులకు కలుగుతున్నాయని వెంటనే(సీఏజీ) సెంట్రల్ ఆడిట్ జనరల్ ద్వారా సమగ్రమైన దర్యాప్తునకు ఆదేశించేలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. వకుళా మాతా మన్నించు తల్లీ… తిరుమల పవిత్రతను అపవిత్రం చేసిన దుర్మార్గులను శిక్షించాలి. తిరుమల ఆలయ పవిత్రతను కాపాడాలి అంటూ నినాదాలు చేసి పాపపరిహారార్థం టెంకాయలు కొట్టి అమ్మవారిని వేడుకున్నారు.

LEAVE A RESPONSE