2014 , 2019 , 2024 ఎన్నికలకు ముందు గుర్తుకురాని వందేమాతరం మోడీ కి ఇప్పుడెందుకు గుర్తుకు వచ్చింది ?! బెంగాల్ ఎన్నికల కోసం గుర్తుకు వచ్చిందని ప్రియాంక వాధ్రా ఆరోపించారు . దేశంలో ఉన్న పలు సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఈ ఎత్తుగడ అని సామాన్య ప్రజలు అంటున్నారు . ఇదో పార్శ్వం .
నెహ్రూ లేదా కాంగ్రెస్ ఎందుకు కొన్ని పేరాలను వదిలేశారు ? కేవలం ముస్లింలను సంతృప్తి పరిచేందుకు , జిన్నాకు భయపడి అని మోడీ ఆరోపించారు .వందేళ్ళ కింద కాంగ్రెస్ నాయకత్వం ధ్యాస అంతా స్వాతంత్య్రం మీదనే . ముస్లిం లీగ్ , హిందూ మహాసభలకు స్వాతంత్య్రం కన్నా వారి వారి మతాల ప్రయోజనాలే ముఖ్యం . స్వాతంత్రయాన్ని సాధించుకోవటానికి దేశంలో ఉన్న అన్ని మతాల వారిని ఏకం చేయాలి . లేకపోతే స్వాతంత్ర్యం సిధ్ధించటం సాధ్యం కాదు .
1931 జనాభా లెక్కల ప్రకారం హిందువుల జనాబా 68% , ముస్లింలు 22% , క్రైస్తవులు 1.8% . అన్ని మతాల వారి సహకారం , పార్టిసిపేషన్ లేకుండా స్వాతంత్య్రం సాధ్యమా !? మోడీ చెప్పారు . వందేమాతరం ప్రజలలో స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపిందని .
ముస్లింలకు , క్రైస్తవులకు ఆమోదయోగ్యం కాని గీతాన్ని రుద్దితే అందరిలో స్వాతంత్ర్య స్ఫూర్తి కలిగేదా ! ఈ సున్నితమైన విషయం మోడీ కో , భాజపా కో , ఆరెస్సెస్ కో , ఆనాటి హిందూ మహాసభ కో తెలియనిది కాదు . అయినా ఎందుకు ఈ రగడ ?! హిందూ దేవతల పేర్లను తొలగించి ముస్లిం , క్రైస్తవులను సంతృప్తి పరచటానికే అని బురద చల్లే ఉద్దేశమే అని ఆలోచనపరులకు ఎవరికయినా అర్థం అవుతుంది . నిజంగా ఆ తొలగించిన పేరాల మీద ప్రేమ , మమకారం ఉంటే గత 11 ఏళ్ళలో ఎప్పుడో మార్చి ఉండేవారు .
వందేమాతరం గీతం అప్పుడయినా ఇప్పుడయినా దేశాన్ని కలిపేదే . విడదీయటానికి ఉపయోగించుకోవచ్చు అని ఎవరయినా భావిస్తే వాళ్ళకు భారత జాతి సంస్కృతి తెలియదనే జాలిపడాలి . భారత జాతి అంటే ఒక్క భాజపా , ఆరెస్సెస్ హిందువులే కాదు . ఈ రెండు సంస్థలతో సంబంధం లేని హిందువులు , ఇతర మతస్తులు కూడా ఉన్నారు , ఉంటారు . భారత జాతి అంటే అందరూ .
– ప్రొఫెసర్ దోగిపర్తి సుబ్రమణ్యం