Suryaa.co.in

Andhra Pradesh

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– నేటి యువతకు ఆయనొక రోల్ మోడల్
– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

పేద ప్రజల కోసం జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప నాయకులు వంగవీటి మోహన రంగా అని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బీసెంట్ రోడ్డులో మంగళవారం వీఎం రంగా గారి 76వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొని.. రంగా గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. నిరుపేదల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాటాలు చేసి ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచిన మహోన్నత వ్యక్తి వీఎం రంగా అని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు.

సాయం కోరి వచ్చిన వ్యక్తికి నేనున్నానంటూ భరోసా కల్పించేవారన్నారు. భారీవర్షాలు, వరదలకు నగరంలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురైన సమయంలో దగ్గరుండి బాధితులను ఆదుకున్నారన్నారు. సమాజం పట్ల బాధ్యతగా ఉండేలా విద్యార్థి సంఘాల్లో అవగాహన కల్పించిన నేతగా చెప్పుకొచ్చారు. 1980 నుంచి 1989 మధ్య దాదాపు దశాబ్ద కాలంపాటు ఆయన నాయకత్వంలో పనిచేసే అవకాశం లభించడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడానికి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, దివంగత నేత రంగా ఆశీస్సుల ఎంతగానో ఉన్నాయన్నారు.

రంగా లాంటి నేతలు ఇద్దరు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మార్చివేయవచ్చని ఆనాడు కోన ప్రభాకరరావు అన్న మాటలు అక్షర సత్యమని మల్లాది విష్ణు అన్నారు. పేదలకు అండగా నిలిచేతత్వమే ఆయనకు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించి పెట్టిందన్నారు. రంగా గూర్చి ఎంత తెలుసుకున్నా.. ఇంకా తెలుసుకోవలసింది మిగిలే ఉంటుందన్నారు. రాజకీయాలలోకి రావాలనుకునే యువతకు ఆయనొక రోల్ మోడల్ గా అభివర్ణించారు.

రంగా ని పొట్టన పెట్టుకుంది ముమ్మాటికీ టీడీపీ, చంద్రబాబే
దివంగత నేత వంగవీటి రంగా ని చంపించింది ముమ్మాటికీ ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వమని మల్లాది విష్ణు ఆరోపించారు. 1983 నుంచి 1989 వరకు నాటి తెలుగుదేశం ప్రభుత్వ నిరంకుశ విధానాలపై రంగా గారు చేసిన అలుపెరుగని పోరాటాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా రోడ్డుపై ఆమరణ నిరాహార దీక్ష చేసిన ధీశాలి వీఎం రంగా అని మల్లాది విష్ణు అన్నారు.

తనపై నాటి టీడీపీ ప్రభుత్వం ఎన్ని దాష్టీకాలకు తెగబడినా.. ఎక్కడా వెనుకంజ వేయకుండా వాటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొన్నారన్నారు. ప్రజల కష్టాలను సొంత కష్టాలుగా పోరాడి విజయవాడ నగర ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారన్నారు. శిరోముండనం, లాకప్ డెత్ లు వంటి దుశ్చర్యలకు తెగబడుతూ నాటి ఎన్టీఆర్ ప్రభుత్వం పౌరుల హక్కులను కాలరాస్తున్న తరుణంలో.. ప్రజలకు అండగా నిలిచారన్నారు.

నాడు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోలీస్ బిల్లు తీసుకొచ్చిన సమయంలో.. పేదల తరపున పోరాటాలు చేసిన ఏకైక నాయకులు రంగా ని చెప్పుకొచ్చారు. ఆయన నాయకత్వంలో విజయవాడ నగరం ఉద్యమాలకు వేదికగా మారిందన్నారు. గాంధీనగర్ సబ్ జైలులో ఉండి కూడా కృష్ణలంక డివిజన్ నుంచి కార్పొరేటర్ గా గెలుపొందిన వ్యక్తి విజయవాడ చరిత్రలో ఒక్క రంగా నని వ్యాఖ్యానించారు.

కనుకనే కులాలు, మతాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. భౌతికంగా వీఎం రంగా మన మధ్య లేకపోయినా.. కొన్ని తరాలలో ఆయన నింపిన స్ఫూర్తి బ్రతికే ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. పేదలకు అన్నదానం నిర్వహించి., పండ్లు, మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో నాయకులు దమ్మాల మల్లిఖార్జునరావు, చెన్నుపాటి శ్రీను, ఒగ్గు విక్కీ, చల్లా సుధాకర్, ఒగ్గు గణేష్, దర్శి వాసు, కొండపల్లి బుజ్జి, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE