– పుకార్లకు చెక్ పెట్టిన వంగవీటి
– లోకేష్‌తో కలసి పాదయాత్ర
– జనసేనలో చేరతారంటూ పుకార్లు
– రాధాను సాదరంగా ఆహ్వానించిన లోకేష్
( మార్తి సుబ్రహ్మణ్యం)
కాపు నేత, దివంగత వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ, తనపై వస్తున్న ఊహాగానాలకు ఎట్టకేలకూ తెరదించారు. ఆయన టీడీపీకి గుడ్‌బై చెప్పి, జనసేనలో చేరుతున్నారంటూ ఇటీవల వస్తున్న
పుకార్ల షికార్లకు స్వయంగా ఆయనే తెరదించారు. అన్నమయ్య జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న టీడీపీ యువనేత లోకేష్‌ను కలసి, తన సంఘీభావం ప్రకటించారు. దీనితో వంగవీటి రాధా జనసేనలో చేరుతున్నారంటూ వస్తున్న పుకార్లకు చెక్ పెట్టినట్టయింది.
ఇటీవలి కాలంలో రాధా టీడీపీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించకపోవడం.. ఆ మధ్య గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కలసి కనిపించడంతో, పుకార్లు షికార్లు చేశాయి. రాధా మిత్రులయిన వంశీ, కొడాలి నాని ఆయనను టీడీపీకి దూరం చేసే ప్రయత్నాలకు తెరలేపారన్న చర్చ జరిగింది. అందులో భాగంగా రాధాను జనసేనలో చేరమని, సలహా ఇచ్చారన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపించింది. అదే సమయంలో గన్నవరం-గుడివాడ నియోజకవర్గాల్లోని కాపుల ఓట్ల కోసమే వంశీ-నాని కాపునేత వంగవీటి రాధాతో స్నేహం కొనసాగిస్తున్నారంటూ.. సోషల్‌మీడియాలో టీడీపీ-జనసేన కాపు కార్యకర్తలు కామెంట్లు పెట్టడం చర్చనీయాంశమయింది.
రాధాకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గౌరవం ఇస్తున్నప్పటికీ.. రాధా ఇంకా క్రియాశీల
రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించకపోవడంపై, సహజంగానే అనుమానాలు తలెత్తాయి. దానికితోడు రాధా పోటీ చేసే నియోజకవర్గంపై కూడా, టీడీపీ నాయకత్వం స్పష్టత ఇవ్వలేదన్న చర్చ జరిగింది. పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా చురుకుగా కనిపించని రాధా.. తన తండ్రి దివంగత రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు మాత్రం హాజరవుతున్నారు.
ఈలోగా ఇటీవలి కాలంలో రాధా లక్ష్యంగా, సోషల్ మీడియా వేదికగా పుకార్లు షికార్లు చేశాయి. ఆయన టీడీపీలో అసంతృప్తిగా ఉన్నారని, త్వరలో జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారన్నది ఆ పుకార్ల సారాంశం.
ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన, పాదయాత్ర చేస్తున్న టీడీపీ యువనేత లోకేష్‌ను అన్నమయ్య
జిల్లాకు వెళ్లి కలిశారు. ఆయనతో పాటు పాదయాత్ర చేశారు. లోకేష్ కూడా రాధాను సాదరంగా ఆహ్వానించి, స్థానిక టీడీపీ నేతలను ఆయనకు పరిచయం చేశారు. తాజా పరిణామాలతో వంగవీటి రాధా టీడీపీని వీడటం లేదని స్పష్టమయింది.