Suryaa.co.in

Editorial

బీర్‌ఆర్‌ఎస్ సర్కారు కోర్టులో బదిలీల బంతి!

– ఇంకా పెండింగ్‌లో అంతర్రాష్ట్ర ఉద్యోగుల బదిలీ సమస్య
– ఇరు రాష్ట్రాలు ఎన్‌ఓసీ ఇచ్చినా ఇంకా కరుణించని కేసీఆర్
– ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను తీసుకోండని నాటి సీఎస్ సమీర్ లేఖ
– శుభం కార్డు పడని ఆంధ్రా-తెలంగాణ ఉద్యోగుల సినిమా కష్టాలు
– కేసీఆర్ ఓకే అన్నారంటూ హామీ ఇచ్చిన బీఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్
– వినోద్‌కుమార్‌కు ఆ బాధ్యత అప్పగించారని సన్మాన సభలో వెల్లడి
– సీఎస్ బదిలీ అయినా కదలని బదిలీ ఫైల్
– మరి వినోద్‌కుమార్ విఫలమయినట్లేనా?
– మంత్రి హరీష్‌రావు లేఖ రాసినా స్పందన లేని విద్యాశాఖ
– విద్యాశాఖ మంత్రి సబితను కలిసినా ఫలితం శూన్యం
– జిల్లా, జోనల్ స్థాయి ఉద్యోగుల ఎదురుచూపు
– మార్చిలోగా పూర్తయితేనే ఉద్యోగులకు ఊరట
– ఫలించని ఉద్యోగ సంఘాల పోరాటం
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఒక ఐఏఎస్.. మరో ఐపిఎస్.. ఇంకో ఐఆర్‌ఎస్. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి డెప్యుటేషన్‌పై వెళ్లే వారి ఫైల్ వాయువేగంతో కదులుతుంది. ఎందుకంటే వారికి ఉన్న పలుకుబడి అది. దానికోసం వారి బ్యాచ్‌మేట్లు.. కాకపోతే సీనియర్లు.. అదీకాకపోతే ప్రభుత్వంలో ఉన్న వారి కుల ప్రముఖులు సాయం చేస్తారు. పాలకులకు దగ్గరవారైతే, వారు పెట్టుకున్న వీఆర్‌ఎస్ పెద్ద కష్టపడకుండానే పంచకల్యాణి వేగంతో ఆమోదం పొందుతుంది. ఇప్పటివరకూ ఏపీ టు తెలంగాణ- తెలంగాణ టు ఏపీకి ఈ తరహా అధికారుల ఫైళ్లు అలాగే కదిలాయి. అందుకే వారంతా అంత సులభంగా డెప్యుటేషన్‌పై వెళ్లగలిగారు.

కానీ సాధారణ ఉద్యోగుల విషయంలో బదిలీలు అంత వీజీ కాదు. అదో కల. ఓ పెద్ద ప్రహనం. దానికి పెద్ద యుద్ధమే చేయాలి. మంత్రుల చుట్టూ ప్రదక్షణలు చేయాలి. వారికి తెలిసిన వారిని పట్టుకోవాలి. దానికోసం పైరవీలు చేయాలి. తీరా కలసి ఓ వినతిపత్రం సమర్పిస్తే, తర్వాత అది ఏమైందో చెత్తబుట్టనే అడగాలి. ఎందుకంటే దాని చిరునామా అదే కాబట్టి! మళ్లీ పైరవీలకు తెరలేపాలి. అందుకు సెలవులు పెట్టుకోవాలి. రాజధానికి బోలెడు ఖర్చులు పెట్టుకుని రావాలి. ఇంతా చేస్తే.. చూస్తాం. చేస్తాం. ఇదీ పాలకుల నుంచి వచ్చే సమాధానం.

కాకపోతే వారి విషయంలో కొద్దిగా భిన్నం. బదిలీలకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాయి. బదిలీలకు మాకు అభ్యంతరం లేదని ఎన్‌ఓసీ ఇచ్చాయి. అది అమలు జరిగితే.. ఆంధ్రా ఉద్యోగులు తెలంగాణకు , తెలంగాణలో ఉన్న ఆంధ్రా ఉద్యోగులు వారి ప్రాంతాలకు బదిలీ అయిపోతారు. సింపుల్! కానీ ఆంధ్రా సర్కారు వరమిచ్చినా, తెలంగాణ పాలనా పూజారి కరుణించడం లేదు. బీఆర్‌ఎస్ భక్తులు మాత్రం.. మీ పని అయిపోతుందని అభయమిచ్చినా, ఫైలు మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడి అన్నట్లే ఉంది.

ఫలితం.. తెలంగాణ మూలాలు ఉన్న ఉద్యోగులు ఇంకా ఆంధ్రాలో.. ఆంధ్రా మూలాలు ఉన్న ఆంధ్రా ఉద్యోగులు ఇంకా తెలంగాణలోనే, ఎప్పుడు జరుగుతుందో తెలియని బదిలీల కోసం.. చకోరపక్షుల్లా పడిగాపులు కాస్తున్నారు. ఇవీ.. ఆంధ్రా-తెలంగాణ ఉద్యోగుల బదిలీ కష్టాలు.

ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి, విభజన కొత్త కష్టాలు తెచ్చి పెట్టాయి. రాష్ట్ర విభజన జరిగి ఇన్నేళ్లయినా.. ఇప్పటికీ కొన్ని వేల మంది తెలంగాణ మూలాలున్న ఉద్యోగులు ఆంధ్రాలో ఉద్యోగం చేస్తున్నారు. అదే సమయంలో ఆంధ్రా మూలాలున్న ఉద్యోగులు, తెలంగాణలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. తమ రాష్ట్రాలకు పంపించాలని వారు ఎన్నిసార్లు డిమాండ్ చేసినా ఫలితం శూన్యం.

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, నాటి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ మంత్రి శ్రీనివాసగౌడ్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత వంటి ప్రముఖుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. నేటి ఏపీ సీఎం జగన్ విపక్ష నేతగా పాదయాత్ర చేసిన సందర్భంగా, టీచర్లు తమ సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు.

అయితే.. ఏపీ సీఎం జగన్ వారి సమస్య ఆలకించి, సానుకూలంగా స్పందించారు. ఆమేరకు ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. పనిలోపనిగా నాటి సీఎస్ సమీర్ శర్మ.. తెలంగాణ సీఎస్‌కు ఓ లేఖ రాశారు. ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను మీ రాష్ట్రానికి తీసుకోండనిap-cs-sameer-letterసూచించారు. అదేవిధంగా తెలంగాణ లో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులను ఏపీకి పంపిస్తే, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని లేఖ రాశారు. దానితో ఇరు రాష్ట్ర ఉద్యోగులు, బదిలీ అయినంత సంబరపడ్డారు.

వెంటనే ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు, తమ ‘తెలంగాణ నేటివ్ ఎంప్లాయిస్ వర్కింగ్ ఇన్ సీమాంధ్ర’( టిఎన్‌ఈడ బ్ల్యుఎస్‌ఏ) పక్షాన, హైదరాబాద్‌లో ఆర్ధికమంత్రి హరీష్‌రావును కలిశారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించి, విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డికి ఓ సిఫారుస లేఖ రాశారు. ఆ లేఖతో వెళ్లిన నేతలు, ఆమెకు ఓ వినతిపత్రం సమర్పించారు. ఇది జరిగి కొన్ని నెలలయినా సమస్యలో మార్పు లేదు.

నిజానికి ఏపీలోని వివిధ శాఖల్లో 1369 మంది తెలంగాణ మూలాలు ఉన్న ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారు తెలంగాణకు వెళ్లేందుకు, ఏపీ సర్కారు గత ఏడాది ఎన్‌ఓసీ ఇచ్చింది. ఆ విధంగా మొత్తం 1808 మందికి సెప్టెంబర్ 22, 2022న నాటి సీఎస్ ఎన్‌ఓసీ జారీ చేశారు. ఇందులో స్టేట్ క్యాడర్ ఉన్న వారి సంఖ్య 900 మంది. ఈ 900 మంది కమలనాధన్ కమిటీ రక్షణ కవచం ఉన్న ఉద్యోగులే కాబట్టి, వీరి విషయంలో పెద్ద సమస్యలుండవని ఉద్యోగులు చెబుతున్నారు.

అయితే జిల్లా, జోనల్ స్థాయి ఉద్యోగులకే ఎలాంటి రక్షణ లేనందున, వారికి ప్రభుత్వాలు ఇచ్చిన ఎన్‌ఓసీలే రక్షణ కవచం కింద లెక్క. ఆ ప్రకారం తెలంగాణలో స్టేట్ క్యాడర్ ఉన్న ఏపీ ఉద్యోగులసంఖ్య 250 మంది. మిగిలిన 1100 మంది ఉద్యోగులు జిల్లా, జోనల్ స్థాయి వారే. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాల్సిన వారిలో 900 జిల్లా, జోనల్ స్థాయి ఉద్యోగులున్నారు.

వీరిలో టీచర్ల సమస్య ఎక్కువగా ఉంది. ఏపీ నుంచి తెలంగాణకు 256 మంది బదిలీ కోసం ఎదురుచూస్తుండగా, తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేందుకు 611 మంది టీచర్లు వేచి చూస్తున్నారు. వీరంతా జోనల్,జిల్లా స్థాయి ఉద్యోగులే కాబట్టి, బదిలీ చేసినా ఎలాంటి సమస్యలు ఉండవు.

ఏపీ సీఎస్ నుంచి వచ్చిన బదిలీల ఫైల్.. తెలంగాణ సెక్రటేరియేట్‌కు చేరి ఏడాది దాటింది. ఆ ఫైలు ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఆమోదం కోసం, పెండింగ్‌లో ఉందని తెలంగాణ ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. సీఎం కేసీఆర్ ఫైలుపై ఆమోదముద్ర వేస్తే తప్ప, తమ సమస్యకు మోక్షం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దీనికోసం ఏపీలో ఉన్న తెలంగాణ మూలాలున్న ఉద్యోగులు.. తెలంగాణ పీఆర్‌టియు నేతలు కమలాకర్‌రావు, శ్రీపాల్‌రెడ్డి, యుటిఎఫ్ నేత చావా రవిని కలసి చాలాకాలం క్రితమే వినతిపత్రం సమర్పించారు. తెలంగాణలో ఉన్న నాన్ లోకల్ టీచర్స్ అసోసియేషన్ నేతలు మోహన్‌రావు, సూర్యనారాయణ, ఏపీలో ఉన్న టీఎన్‌ఈ డబ్ల్యుఎస్‌ఏ నేతలు లక్ష్మీనారాయణ, అంజయ్య.. రెండు రాష్ట్రాల్లోని మంత్రుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్న పరిస్థితి.

ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్.. బీఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందినందున, ఏపీలోని తెలంగాణ ఉద్యోగులు-తెలంగాణలోని ఏపీ ఉద్యోగులు.. ఏపీ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ను కలిశారు. తర్వాత

హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గత ఫిబ్రవరి 12న ఆయనకు ఘన సన్మానం చేశారు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జాతీయ కార్యాలయ సమన్వయకర్త రావెల కిశోర్ కూడా, ఆ సభకు హాజరయ్యారు. తమ బదిలీ బాధలు తీర్చాలని వారు, ఏపీ బీఆర్‌ఎస్ నేతలకు మొరపెట్టుకున్నారు.

దానికి స్పందించిన తోట చంద్రశేఖర్, మీ సమస్య త్వరలో పరిష్కారమవుతుందని హామీ ఇచ్చారు. తాను మీ సమస్యను కేసీఆర్‌కు చెప్పిన వెంటనే, ‘చేసేద్దాం. ఇది పెద్ద సమస్య కాదన్నారని’ ఉద్యోగులకు

చెప్పారు. అక్కడే ఉన్న సీఎస్‌కూ ఆదేశాలిచ్చారని సభాముఖంగా వెల్లడించారు. ఆ ఫైలు సంగతి చూడాలంటూ, అక్కడే ఉన్న తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌ను

ఆదేశించారని కూడా.. తోట చంద్రశేఖర్, ఉద్యోగులకు వెల్లడించారు. సీఎస్ సోమేష్‌కుమార్ స్ధానంలో, కొత్త సీఎస్ వచ్చినందున, బదిలీ సమస్య రెండు మూడు రోజుల్లో పరిష్కారమవుతుందని కూడా సెలవిచ్చినట్లు ఉద్యోగులు చెబుతున్నారు.

అయితే ఇప్పటివరకూ బదిలీ ఫైలు కేసీఆర్ నుంచి సీఎస్‌కు వచ్చిందా? రాలేదా? వస్తే ఆమె దానిని సీరియస్‌గా తీసుకున్నారా? లేదా? మరి దానిపై వినోద్‌కుమార్ ఫాలో అప్ చేశారా? లేదా? ఇవేమీ కాకపోతే.. తోట చంద్రశేఖర్ తమకు అబద్ధాలు చెప్పారా? అన్నది తమకు తెలియడం లేదని, ఆంధ్రాలో పనిచేస్తున్న ఉద్యోగులు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశించినా.. ఇప్పటివరకూ ఫైలు కదలలేదంటే.. తోట చంద్రశేఖర్ చెప్పిన ప్రకారం, ఆ విషయంలో వినోద్‌కుమార్ విఫలమయినట్లు భావించాల్సి వస్తోందని అంటున్నారు.

ఏదేమైనా మార్చి లోగా తమ బదిలీలకు మోక్షం లభిస్తేనే మంచిదని చెబుతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే లోపు.. తమ బదిలీల ప్రక్రియ పూర్తయితే, పిల్లల చదువులకు ఇబ్బంది ఉండదంటున్నారు. మరి కేసీఆర్ సారు వారిని కరుణిస్తారో లేదో చూడాలి!

LEAVE A RESPONSE