Suryaa.co.in

Andhra Pradesh

జగన్, విజయసాయిలు డబ్బుల్లేని జీవితం నుంచి ఎలా ఎదిగారు?

– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య

మంగళగిరి: సినిమా టికెట్ కొనడానికి డబ్బుల్లేని జీవితం గడిపిన జగన్, విజయసాయిలు నేడు యూరప్ కు వెళ్లగలిగేలా ఎలా ఎదిగారని వర్ల రామయ్య ప్రశ్నించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

జగన్, విజయసాయిరెడ్డిలాంటి వారికి కోర్టులు వెసలుబాటు కల్పించడం కరెక్టు కాదు. ఏ1 ముద్దాయి జగన్, ఏ2 ముద్దాయి విజయసాయికి యూరప్ లో ఏమున్నాయని పర్యటనలకు అనుమతి కోరుతున్నారు? వీరిపై విచారణ ఎందుకు జరగడంలేదు, వీరు కోర్టులకు ఎందుకు హాజరు కావడంలేదు? సీఎం కేజ్రీవాల్ సీఎం అయినా జైలులో ఉన్నారు… మరి జగన్ సీఎంగా ఉన్నప్పుడు కేసులున్నప్పటికి ఎందుకు బయట ఉన్నాడు?. 12 ఏళ్ళపాటు జగన్, విజయసాయిలపై విచారణ జరపకపోవడంలో అర్థమేంటి? కోర్టుల మీద నమ్మకం సన్నగిల్లే ప్రమాదాల నుంచి కాపాడాలని జస్టీస్ చంద్రచూడ్‌ని కోరుతున్నాను.

జగన్ కేసులో రోజువారి విచారణ జరగాలి, జగన్ తప్పు చేశాడా లేదా అని త్వరితగతిన కోర్టు తేల్చాలి. యూరప్ పర్యటకు జగన్ కు పర్మిషన్ ఇస్తే ఇతర ముద్దాయిలు కూడా పర్మిషన్ అడగగలరు. అవినీతిపరులు, నేర చరిత్రగల జగన్, విజయసాయిలు బాహ్య ప్రపంచంలో తిరుగుతుంటే బాధేస్తోంది. జగన్ విదేశాలకు వెళితే ఏం జరుగగలదో కోర్టు పునఃపరిశీలన చేయాలి. కేసుల విచారణ పూర్తయ్యేవరకు జగన్ విదేశాలకు వెళ్లకుండా చూడాలి.

జగన్‌ సీఎం హోదా పోయి నేడు శాసనసభ్యుడిగా మిగిలారు. ఇక విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. మంచి రికార్డులున్నవారు, పెద్దలు మాత్రమే రాజ్యసభలో ఉంటే తులసివనంలో గంజాయి మొక్కలా విజయసాయి ఎంపీగా ఉన్నారు. లోక్ సభలో పాస్ అయిన బిల్లులను రాజ్యసభకు పంపిస్తారు. రాజ్య సభలో ఆమోదం పొందాక ఆ బిల్లులు అమలులోకి వస్తాయి. అలాంటి అత్యున్నత సభలో విజయసాయి ఉండడం బాధాకరం.

ఎన్నో కేసుల్లో ఏ1గా ఉన్న వ్యక్తి ఇప్పుడు విదేశాలకు వెళ్ళడానికి అనుమతిస్తే ఆయన తిరిగి భారతదేశానికి వస్తారన్న నమ్మకం లేదు. ఏ2 గా ప్రతీ కేసులో ఏ1 కు తోడు నీడగా ఉన్న విజయసాయిరెడ్డి కూడా ఈ పరిస్థితుల్లో విదేశాలకు పోవడానికి కోర్టు అనుమతి ఇవ్వకూడదు. ఇస్తే తిరిగి రారు. 12 ఏళ్ళ కిందట వీరిద్దరి మీద సీబీఐ చార్జ్ షీట్‌లు వేస్తే ఇంతవరకు విచారణ మొదలుపెట్టలేదు.. ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. ఈ కేసుల్లో విచారణ పూర్తయ్యేంతవరకు ముద్దాయిలకు విదేశీ యాత్రలకు అనుమతి ఇవ్వకూడదని టీడీపీ పొలిట్ బ్యూరో వర్ల రామయ్య కోరారు.

LEAVE A RESPONSE