Suryaa.co.in

Andhra Pradesh

వివేకా హత్యకేసు విచారణలో నిందితులకు కొమ్ముకాయడం సిగ్గుచేటు

– వివేకాహత్యకేసు విచారణలో రాష్ట్ర పోలీస్ వ్యవస్థ, సీబీఐకి సహకరించకుండా, నిందితులకు కొమ్ముకాయడం సిగ్గుచేటు
– దస్తగిరికి జరగరానిది జరిగితే కడప ఎస్పీనే బాధ్యుడు
• సొంతబాబాయ్ హత్యకేసు విచారణలో ముఖ్యమంత్రి ఆదినుంచీ వేసిన తప్పటడుగులు, ఇప్పుడు తప్పుడు అడుగులుగా మారాయి
• సీబీఐకి అడ్డంకులు కల్పించకుండా, ఏపీ పోలీస్ వ్యవస్థ విచారణకు సహకరించాలని ఆదేశించాల్సిన బాధ్యత హైకోర్ట్ దే
• అప్రూవర్ దస్తగిరిని జాగ్రత్తగా కాపాడు కోవాల్సిన కడపపోలీస్, అతని రక్షణ గాలికొదిలేయడం చాలాదుర్మార్గం. ఇలాచేయడం ముద్దాయిలకు అనుకూలంగా వ్యవహరించడమే
• దస్తగిరి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి మౌనం దేనికి సంకేతం? మౌనం అర్థాంగీకారమనే భావించాలి
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

తన తల్లిదండ్రులకు అత్యంతప్రియమైన వ్యక్తి, ముఖ్యమంత్రికి సొంత బాబాయ్ అయిన వివేకాహత్యకేసు విచారణలో అప్రవూవర్ గా మారిన దస్తగిరి ప్రాణాలకు రక్షణకల్పించలేని దుస్థితిలో కడపపోలీస్ విభాగం, ముఖ్యమంత్రి ఉండటం సిగ్గుచేటని టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు.

శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన వివరాలు ఆయనమాటల్లోనే …“రాష్ట్రంలో పరిపాలన చూస్తుంటే, జమీందారులు, రాజులు, చక్రవర్తుల పాలన గుర్తుకొస్తోంది. జమీందారీ పాలనాపోకడలు, పెత్తందారీ వ్యవస్థపొడ జగన్ రెడ్డి పరిపాలనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఒక వ్యవస్థ మరో వ్యవస్థపై దాడిచేయడం, ప్రభుత్వ వ్యవస్థలు పోటీతత్వంతో వ్యవహరించడమనేది ఈ రాష్ట్రంలోనే చూస్తున్నాం. ఇలాంటి పోకడలు చాలాచాలా బాధాకరం. పోలీస్ v/s సీబీఐ, సీబీఐ v/s పోలీస్ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. తన తల్లిదండ్రులకు అత్యంత ప్రియమైన వ్యక్తి, సొంత బాబాయ్ హత్యకేసులో జగన్ రెడ్డి ఆదినుంచీ వేసిన తప్పటడుగులు, తరువాత తప్పుడు అడుగులుగా మారాయి. బాబాయ్ ని చంపిన వారిని పట్టుకోలేని జగన్ రెడ్డి అసమర్థపాలనకు నాయకుడు కాడా? రాష్ట్ర డీజీపీ ఏనాడైనా వివేకాహత్య కేసువిచారణ ఏదశలో ఉందని సమీక్షచేశారా? సీబీఐ అధికారుల్ని భయపెట్టేస్థాయికి రాష్ట్ర పోలీస్ విభాగం వెళ్లడం ముద్దాయిలపై ముఖ్యమంత్రికి ఉన్న అపారప్రేమ, ఆప్యాతానురాగాలకు నిదర్శనంకాదా? స్థానిక పోలీస్ విభాగంనుంచి తమను కాపాడాలంటూ సీబీఐ హైకోర్ట్ నిఆశ్రయించే పరిస్థితి వచ్చిందంటే, అది జగన్ రెడ్డికి, ఆయనపాలనకు సిగ్గుచేటుకాదా?

అప్రూవర్ గా మారిన దస్తగిరిని కొత్తపెళ్లికొడుకులా చూడాల్సిన పోలీస్ విభాగం, అతనిప్రాణాలను గాలికివదిలేయడం బాధాకరం. వివేకా హత్యకేసులో ఏ4గా ఉన్న దస్తగిరి అప్రూవర్ గా మారాడు. అప్రూవర్ అంటే స్టేట్ గెస్ట్, అలాంటి వ్యక్తిని స్థానిక పోలీస్ కోడి తనపిల్లలను కాపాడుకున్నట్టు రక్షించాలి కదా? అప్రూవర్ ని కొత్త పెళ్లికొడుకులా చూడాల్సిన పోలీస్ వ్యవస్థపై నమ్మకంలేక తనకు ప్రాణరక్షణ కావాలని దస్తగిరి మొత్తుకునేపరిస్థితి ఎందుకు వచ్చింది? లబోదిబోమంటూ తలబాదుకోవాల్సిన అగత్యం ఎందుకొచ్చింది. దస్తగిరికి రక్షణ కల్పించలేని ఏపీ పోలీస్ వ్యవస్థ నిజంగా సిగ్గుపడాలి. సీబీఐకి అడ్డంకులు లేకుండా ఏపీ పోలీస్ వ్యవస్థ విచారణకు సహకరించాలని ఆదేశించాల్సిన బాధ్యత హైకోర్ట్ కు లేదా? పోలీస్ వ్యవస్థ సీబీఐ వ్యవస్థకు సహకరించకుండా, కేసువిచారణకు అడ్డుతగులుతున్న ప్రస్తుతపరిస్థితుల్లో కచ్చితంగా న్యాయస్థానం జోక్యంచేసుకోవాలి. దస్తగిరి ఐస్ ఫ్యాక్టరీ కి పవర్ కట్ చేయడం, దస్తగిరి తమ్ముడిని కొట్టి, అతనిపైనేకేసు పెట్టడం కక్షసాధించడంకాదా?

ఆ విధమైన చర్యలతో అతన్ని మరింత భయభ్రాంతులకు గురిచేయాలని ప్రభుత్వం చూస్తోందా?
ఎస్పీ అన్బురాజన్ ఎవరి పక్షాన ఉండాలి? అప్రూవర్ కి రక్షణ కల్పించాలా..లేక హత్యకేసు నిందితులకు కొమ్ముకాయాలా? దస్తగిరి తనకుతాను భయపడి కనిపించకుండా పారిపోయేలా చేయడానికే అతనికి గన్ మెన్లను ప్రభుత్వం తొలగించిందా? దస్తగిరిపై ఈగవాలకుండా చూడాల్సిన బాధ్యత కడపఎస్పీపైనే ఉంది. అప్రూవర్ కి ఏదైనా జరగరానిది జరిగితే అన్బురాజన్ బాధ్యతవహించాల్సిందే. ఎస్పీ వ్యవహారశైలిపై డీవోపీటీకి కూడా ఫిర్యాదు చేస్తాం. దస్తగిరిని ఏకాకిని చేసి, అతను ప్రాణభయంతో పారిపోయేలా చేస్తున్నారు.

వివేకాహత్యకేసువిచారణ అనంతరం భవిష్యత్ లో కోర్టు ఏదైనా శిక్షవేస్తే, కడప పోలీస్ విభాగం దాన్ని అమలుచేస్తుందన్న నమ్మకంకూడాలేదు. ఎందుకంటే అక్కడి పోలీస్ వ్యవహరిస్తున్న తీరు అలాఉంది. ప్రభుత్వకేసుల్లో వాదనలు వినిపించే న్యాయవాదిని వివేకాహత్యకేసులో ముద్దాయిగా ఉన్న శివశంకర్ రెడ్డి లాయర్ గా పెట్టడమేంటి? ఎవరుపెట్టారో ప్రజలకు తెలియదనుకుంటున్నారా? దానివెనుక ప్రభుత్వం ఉన్నట్లు కాదా? శివశంకర్ రెడ్డి, తనతరుపు వాదించే న్యాయవాదికి రూ.50లక్షలు ఇచ్చేంత స్థితిమంతుడా?

దస్తగిరి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఎందుకు మౌనంవహిస్తున్నాడు? మౌనం అర్థాంగీకారమనే భావించాలా? వివేకాహత్యకేసు విచారణలో జాప్యానికి కారణం ముఖ్యమంత్రి కాదా? విచారణలో అన్నీబయటకు తీస్తున్న సీబీఐని కార్నర్ చేసి, ఇబ్బందులకు గురిచేస్తారా? అప్రూవర్ కి పూర్తిస్థాయి రక్షణకల్పించి, కేసువిచారణను త్వరితగతిన పూర్తిచేసి, నిందితు లను కఠినంగా శిక్షించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. స్థానిక పోలీస్ కూడా సీబీఐకి సహకరించి, అప్రూవర్ ను కాపాడాలని కోరుతున్నాం. గతంలో వీళ్లను వ్యతిరేకించిన వారికి జైళ్లలో ఏం గతి పట్టిందో చూశాం. అదే గతి దస్తగిరికి పట్టకుండా చూడాలని ఏపీ పోలీస్ శాఖకు సూచిస్తున్నాం” అని వర్ల తెలిపారు.

LEAVE A RESPONSE