Suryaa.co.in

Andhra Pradesh

ఈనాడువి రాతలా.. రోతలా..?

– అమరావతి ఒక బ్రహ్మ పదార్థం
– ఆ 29 గ్రామాల్లో కూడా అమరావతి లేదు
– అమరావతిలో మీరు చేసిందేమిటి.. మేము పాడుచేసిందేమిటి..?
– మీరంతా హైదరాబాద్ లో కాపురం.. అమరావతిలో పెత్తనమా..?
– అమరావతికేనా ఆత్మ గౌరవం..?, ఉత్తరాంధ్రకు, రాయలసీమకు ఆత్మ గౌరవం ఉండదా..?
– అరసవెల్లి వచ్చి ఉత్తరాంధ్ర నాశనం కావాలని దేవుడ్ని కోరతారా..?
– మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు

కన్నబాబు మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
అమరావతి ఒక బ్రహ్మ పదార్థం
తెలుగుదేశం పార్టీ తన రాజకీయ లబ్ది కోసం రాష్ట్రాన్ని ఒక అయోమయంలోకి నెట్టేసి ప్రజల్ని భ్రమల్లోకి తోసేయాలని ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు నాయుడు దర్శకత్వంలో అమరావతి రాజధాని కోసం అమరావతి నుంచి అసరవల్లికి పాదయాత్ర అంటూ పెద్ద డ్రామా నడుస్తోంది. సాధారణంగా గుడికి వెళ్లాలంటే, ఎవరైనా దగ్గర దారిలో యాత్ర చేస్తారు. అయితే అమరావతి పాదయాత్రికులు మాత్రం తెలుగుదేశం పార్టీకి మద్దతు ఉన్న గ్రామాలు వెతుక్కుని మరీ, రూట్ మ్యాప్ ను మెలికలు, మెలికలు తిప్పి, నచ్చిన రూట్లలో అరసవెల్లి వెళుతున్నారు. ఎలా వెళ్ళాలన్నది వారి ఇష్టమేకానీ… వారిది రాజకీయ, రియల్‌ ఎస్టేట్‌ ప్రయోజనాల కోసం చేస్తున్న యాత్ర కాబట్టే చంద్రబాబు ఇచ్చిన లైన్‌లో వెళుతున్నారు. అసలు అమరావతి అనేది లేకపోతే భూమి బద్దలైపోతుందనేలా ఎల్లో మీడియాలో రాతలు గానీ, వారి చేష్టలు గానీ ఉన్నాయి. అమరావతి లేకుంటే ప్రపంచమే తల్లక్రిందులు అయిపోతుందనేలా ప్రచారం చేస్తున్నారు.

అమరావతి అనేది బ్రహ్మ పదార్ధం అవునా కాదా? రాజధాని అని పేరు పెట్టిన ఆ 29 గ్రామాల్లో కూడా అమరావతి లేదు. ఇవాళ్టికీ విజయవాడలోగానీ, గుంటూరులోగానీ అమరావతి లేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికీ కేవలం నాలుగు తాత్కాలిక భవనాలు తప్ప, ఆ 29 గ్రామాల్లో కనీసం రోడ్లు, డ్రైయినేజ్‌ వ్యవస్థ కూడా లేదు. ఆ తాత్కాలిక భవనాలకు కూడా చ. అడుగుకు 12వేలు చొప్పున చంద్రబాబు ప్రభుత్వం చెల్లించింది. గ్రాఫిక్స్‌, కన్సల్టెంట్‌లకు వందలకోట్లు చెల్లించాడు. ఇదే కదా టీడీపీ సర్కార్‌ చేసింది.

మీరేదో అక్కడ మహా నగరాన్ని నిర్మిస్తే.. జగన్‌ మోహన్‌ రెడ్డిగారు అధికారంలోకి వచ్చాక దాన్ని డైనమెట్లతో నేలమట్టం చేస్తున్నట్లు టీడీపీ, ఎల్లో మీడియాలో బిల్డప్‌ ఇస్తూ ప్రచారం చేస్తున్నారు. అసలు అక్కడ అమరావతి అనేది ఉందా? ఎవరైనా బయట రాష్ట్రాలవాళ్లు విన్నా, చూసినా అక్కడో మహానగరాన్ని చంద్రబాబు నిర్మించేసినట్లు… దాన్ని మేము కూల్చేస్తున్నట్లు భ్రమ కల్పిస్తున్నారు. అసలు అక్కడ ఏముందని అడుగుతున్నాను. మీరు చేసిందేంటి? మా ప్రభుత్వం పాడు చేసిందేంటని సూటిగా ప్రశ్నిస్తున్నాను. సిగ్గు, శరం అనేది మీకు లేవు. ఈనాడువి రాతలా? రోతలా?

మేము మాటలు మార్చామా? చంద్రబాబు నాయుడులా యూటర్న్‌ తీసుకుని మాటలు మార్చే నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారేమో చెప్పమనండి. ప్రత్యేక హోదా అవసరం లేదు ప్యాకేజీ చాలని చంద్రబాబు స్వీట్లు పంచిన రోజున, మీరు కళ్లకు గంతలు కట్టుకున్నారా?. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కేంద్రం ఇస్తే.. ఓటుకు కోట్ల కేసుకు తట్టా బుట్టా సర్ధుకుని గావుకేకలు పెట్టుకుని విజయవాడలో వాలిపోయాడు చంద్రబాబు. ఉమ్మడి రాజధానిలో మన హక్కులన్నీ కాలరాసి, హైదరాబాద్‌లో మనల్ని రెండేళ్లకే పరాయి వాళ్లను చేస్తే ఆరోజు వీళ్లంతా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో పాటు మిగతా ఎల్లో మీడియా.. ఏమైపోయింది?

ఎవరైతే అమరావతి కృత్రిమ ఉద్యమాన్ని నడుపుతున్నారో, దాని వెనుక ఎవరైతే ఉన్నారో, అమరావతి ఉద్యమానికి రూపశిల్పులుగా ఎవరైతే భావిస్తున్నారో, వారిలో ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్‌లో కాపురం ఉండరు. వీళ్ళంతా.. హైదరాబాద్‌లో కాపురం ఉంటూ ఆంధ్రప్రదేశ్‌లో పెత్తనం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్‌, రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5నాయుడు, సుజనా చౌదరి, సీఎం రమేష్‌… ఇలా వీరెవరూ కూడా ఏపీలో కాపురం ఉండటం లేదు. వీళ్లంతా హైదరాబాద్‌లో కూర్చోని ఏపీకి రాజధాని ఎక్కడ ఉండాలో, ఎక్కడ రోడ్డు వెయ్యాలో, ఏ పధకం పెట్టాలో వాళ్లు నిర్దేశిస్తే ప్రభుత్వం అమలు చేయాలా?. ఇన్నాళ్లూ, వీరి ఆటలు సాగినట్టుగా, ఇప్పుడు వీరి పప్పులు ఉడకటం లేదు కాబట్టే, జగన్‌ మోహన్‌ రెడ్డిగారి మీద ప్రతిరోజూ, మీ రోదనలు, వేదనలు. ఇప్పటికీ జగన్‌గారికి మాత్రమే తాడేపల్లిలో ఇల్లు ఉంది. ఇప్పటికీ చంద్రబాబు, చంద్రబాబు కొడుకు, రామోజీ, రాధాకృష్ణ, టీవీ–5… వీరెవ్వరూ అమరావతిలో ఇల్లు కట్టుకునేందుకు రెడీగా లేరు. చంద్రబాబు ఇప్పటికీ తాను ఆక్రమించుకున్న ఇంటిలోనే ఎందుకు ఉంటున్నాడు?

కమ్మ కమ్మగా ఈనాడు రోటి పచ్చడి
ఈనాడు దినపత్రికలో ఈనాడు బ్యానర్ పక్కనే రోటి పచ్చడి కలిపారంటే, అది కూడా కమ్మ కమ్మగా ఉంటుందని, ఇవాళ దొండకాయ పచ్చడి చేస్తున్నామంటూ.. వారి రాతలకు తగ్గట్టుగానే వాటిని అచ్చేసుకున్నారు. ఈరోజు దొండకాయ… రేపేదో కాయ వెతుక్కుని అది చేస్తారు. ఈనాడు రోటిపచ్చడి కమ్మకమ్మగా ఉంటుందని ఆ పత్రికవాళ్లే రాశారు కాబట్టి.. మనం కూడా నమ్మకుండా ఎలా ఉంటాం. కమ్మకమ్మటి రోటి పచ్చడి కింద.. “రాజధానిపై జగన్నాటకం” అని ఏడు తలకాయలు వేసి ముఖ్యమంత్రిగారిపై పెద్ద కథనం రాశారు. జగన్‌ మోహన్‌ రెడ్డికి నాటకాలు ఆడటం తెలియదు. ఉన్నది ఉన్నట్లు మనసులో మాటను కుండబద్దలు కొట్టేలా చెప్పే నాయకుడు ఏపీలో ఎవరైనా ఉన్నారంటే.. మొట్టమొదటి పేరు జగన్‌గారి పేరు చెప్పాలి. కరోనా సమయంలో కూడా ముఖ్యమంత్రిగారు ఒకటే చెప్పారు. కరోనాతో సహవాసం చేయాల్సిందేనని. కరోనా గురించి చెప్పినా, కరోడా లాంటి చంద్రబాబు నాయుడు గురించి చెప్పినా జగన్‌గారు కుండబద్దలు కొట్టినట్లే చెబుతారు. ఎందుకంటే, ముఖ్యమంత్రిగారికి నాటకాలు ఆడటం చేతకాదు కాబట్టి, ఉన్నమాట ఉన్నట్లు చెప్పడమే ఆయన మార్క్‌. నాటకాలు ఆడే బ్యాచ్‌ ఎవరనేది అందరికీ తెలుసు. కమ్మకమ్మటి రోటి పచ్చడి ఈనాడు బాగానే కలిపింది. అలాగే కింద ఇంకో పచ్చడి కలపడానికి బాగానే ప్రయత్నం చేశారు.

పేజీలకు పేజీలు ఇష్టం వచ్చినట్టు కట్టుకథలు రాయడం.. ఆ విధంగా జనాల బుర్రల్లో విషాన్ని ఎక్కించే ప్రయత్నం చేయడం. ఈనాడు, ఎల్లో మీడియాకు పరిపాటిగా మారింది. ఏపీలో కాపురం ఉండేవాడు చెప్పే అభిప్రాయానికి ఒక విలువ ఉంటుంది. హైదరాబాద్‌లో కాపురం ఉండే మీరు ఏపీకి రాజధాని ఎక్కడ ఉండాలని తీర్పులిస్తుంటే అమలు చేయాలా? మేమంతా దద్దమ్మలమా? మీరు చెప్పినట్లు మేము ఆడాలా? టీడీపీ పెట్టినప్పటి నుంచి 40 ఏళ్లలో ఎవరు బాగుపడ్డారో చెప్పాలంటే అది పెద్ద డిబేట్‌ అవుతుంది. రాజధానులు వికేంద్రీకరణ చేయాలి, అమరావతిలో శాసన రాజధాని ఉంటుందని ముఖ్యమంత్రిగారు అసెంబ్లీలో బల్లగుద్ది మరీ చెప్పారు. విశాఖలో పరిపాలనా రాజధాని పెడతామని, కర్నూలు న్యాయ రాజధాని పెట్టి హైకోర్టు ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలకు సమ న్యాయం చేస్తామంటే మీరు సూర్యభగవానుడు కొలువైన అరసవెల్లి వచ్చి .. మేము మాత్రమే బాగుండాలి, మా రాజధాని బాగుండాలి, మా అమరావతి బాగుండాలి, మా రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం బాగుండాలి. మీ ఉత్తరాంధ్ర నాశనం అయిపోవాలని శాపనార్థాలు పెడుతుంటే.. అది మీకు తియ్యతియ్యగా కనిపిస్తుందా? అని రామోజీరావుని, ఎల్లో మీడియాను ప్రశ్నిస్తున్నా.

ఏదైనా పత్రిక లక్ష్యం, లక్షణం ఏంటి? జర్నలిజానికి పట్టిన గతి ఇది. ఏడు తలల బొమ్మలు వేసి ఇష్టానుసారంగా రాతలు రాస్తారా? అదే చంద్రబాబు గురించి రాస్తే పేపర్లు సరిపోవు… ఏకంగా పుస్తకాలే అయిపోతాయి. కుటిల మనస్తత్వం ఉన్న చంద్రబాబుకు మద్దతు ఇస్తూ, మీరు నీతులు చెబుతారా..?. చివరికి, చంద్రబాబు నాయుడును ఆరాధించే స్థాయిలో ఉన్న మీరు ఇంకా ఎందుకు దిగజారిపోతున్నారనేది మీడియా ప్రతినిధులు ఒక్కసారి అయినా ఆలోచించుకున్నారా?. శక్తిలేనివాడిని, సామర్థ్యం లేనివాడిని మీరు జాకీలు వేసి లేపడం కోసం, జగన్‌ గారిమీద ఇష్టానుసారంగా బురద చల్లుతున్నారు. చంద్రబాబు నుంచి అధికారం లాక్కున్నారని, మరోసారి ఆయన అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని తెలిసే, జగన్‌ మోహన్‌ రెడ్డి మీద అక్కసు, కసి, కోపం, బాధ. జనాల్లో రోజురోజుకి చులకన అవుతున్న చంద్రబాబును ఏదో రకంగా జాకీలేసి లేపేందుకే ఇలాంటి వార్తలు రాస్తున్నారు.శ్రీశ్రీ గారు పత్రికల గురించి రాస్తూ.. పెట్టుబడిదారులకు పుట్టిన విష పత్రికలు అని అ‍న్నారు. అది ఎవరికి వర్తిస్తుందనేది మీరే తెలుసుకోండి.

అమరావతిపై ఆరోజూ, ఈరోజూ జగన్ది అదే మాట
అమరావతి మాత్రమే ఉండాలి, మిగతావాళ్లంతా నాశనం అయిపోవాలనేలా.. ఈనాడు అమరావతి యాత్రను ఎందుకింతగా భూజాన కెత్తుకుని మోస్తుందో.. అర్థం చేసుకోలేనంత అమాయకులు కారు ప్రజలు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియదనుకుంటున్నారా రామోజీరావు..?. అమరావతిని మొత్తం ముంచేసినట్లుగా, అమరావతిని ఎత్తేసినట్లుగా వారి రాతలు ఉన్నాయి. అమరావతి విషయంలో ఆరోజు జగన్‌ ఏం చెప్పారో, ఈరోజుకీ అదేమాట మీద.. అమరావతి రాజధానిగా కొనసాగుతుందా, లేదా? అని సూటిగా ప్రశ్నిస్తున్నా. అయితే, మీరు కోరుకున్నట్టుగా స్కాం రాజధాని ఉండటం లేదనే మీ బాధ అంతా. మీ స్కామ్‌ వల్ల, షేర్‌ మార్కెట్‌ షేర్లు పెరిగినట్లు, రాత్రికి రాత్రే మీ భూముల విలువ అమాంతం కోట్లల్లోకి పెరిగిపోయేలా మీ కలలు నెరవేరడం లేదనే మీ బాధంతా. అమరావతిలో రాజధాని ఉంటుందనేది నిజం. ముఖ్యమంత్రి జగన్ వికేంద్రీకరణనే ప్రభుత్వ విధానంగా తీసుకుని మూడు రాజధానులు చేస్తామన్నారు. అమరావతిని అభివృద్ధి చేయాలంటే, లక్షా 9వేల కోట్లతో అక్కడ రోడ్లు, డ్రైయిన్లు, ఇతర మౌలిక సదుపాయాలుకు కావాలనే గత ప్రభుత్వమే అంచనా వేసింది. అభివృద్ధి అంతా ఒకేచోట కుప్పలా పెట్టకూడదని, అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ఉత్తరాంధ్ర , రాయలసీమ అభివృద్ధికి కూడా కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి జగన్ గారు ప్రకటించారు. అమరావతిలో కూడా శాసన రాజధాని ఉంటుందని చెప్పారు. మీరు మాత్రం అమరావతిలో రాజధాని తీసేశారని చెబుతున్నారు. ఎక్కడ తీసేస్తున్నామో చెప్పాలి.

అలానే, విజయవాడలో రాజధానిని ఆహ్వానిస్తున్నామంటూ జగన్‌ గతంలో అన్నారని, ఇవాళ కాదంటున్నారంటూ ఈనాడులో రాశారు. మరి విజయవాడలో రాజధాని పెట్టారా? అంటే లేదు కదా..?. రాజధానికి 30వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాలని జగన్‌గారు చెప్పారని రాశారు. మరి చంద్రబాబు ప్రభుత్వ భూమిని తీసుకున్నారా, అది కాకుండా, 33వేల ఎకరాల ప్రయివేట్‌ భూమిని సేకరించారు. రాజధాని ప్రకటనకు ముందే మీరు, మీ బినామీలు, మీ అనుచరులంతా రైతుల దగ్గర నుంచి చౌకగా పప్పు బెల్లాలకు భూములు కొనేసి, ఆ తర్వాత రాజధానిని ప్రకటించారు. అమరావతి, కేవలం శాసన రాజధానిగా ఉంటే.. మీ భూముల విలువ పడిపోతుందనే భయంతో కొత్త కథలల్లి, దుష్ప్రచారం చేస్తున్నారు. అమరావతి మాత్రమే బాగుండాలని మీరనుకుంటున్నప్పుడు.. మా ప్రాంతం బాగుండాలని ఇతర ప్రాంతాల వాళ్లు ఎందుకు అనుకోకూడదు?. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం లాంటి ఉత్తరాంధ్ర జిల్లాలవారికి, అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల వాళ్లు రాజధానిని కోరుకునే హక్కులేదా?. మీకు మాత్రమే రాజ్యాంగం ప్రత్యేక హక్కులు ఇచ్చిందా? మీరు ఏది రాస్తే అదే నిజం అనుకుని చప్పట్లు కొట్టాలా?. మా పార్టీ అధినేత నుంచీ, మా పార్టీలో చాలామంది నాయకులు ఆరోజు-ఈరోజు ఏమన్నారంటూ రాసుకొచ్చారు. నా గురించి కూడా రాశారు. ఆరోజు రాజధాని అమరావతిలోనే ఉంది, ఉంటుందని అన్నానని రాశారు. అమరావతిలో రాజధానిలో ఉంటుంది, ఉంది అన్నది నిజమే కదా? శాసన రాజధానికి అమరావతిలోనే ఉంది కదా?.

రాజకీయాల్లో పది తలల రావణాసురుడు చంద్రబాబు
వికేంద్రీకరణను ముఖ్యమంత్రి జగన్ మాటల్లో కాదు .. చేతల్లో చేసి చూపిస్తున్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని, గ్రామాల్లో సచివాలయాలు పెట్టి ఏ పని ఉన్నా అక్కడకు మా సిబ్బంది వస్తారని, ఆ పనులు చేయించుకోవాలని చెప్పడం వికేంద్రీకరణ కాదా?. చంద్రబాబు నాయుడుకు పది తలలు ఉన్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చాక, తన 40ఏళ్ల రాజకీయాల్లో పది తలల రావణాసురుడులా అడ్డంగా సంపాదించారు. ఒక్కో వ్యవస్థను ఒక్కో తలలా పెట్టుకుని చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు.
చంద్రబాబు పది తలలు చూస్తే…

1) చంద్రబాబు – టీడీపీ ఒకటో తల.
2) ఈనాడు – రామోజీ రెండో తల
3) పెద్ద పెద్ద పదవుల్లో, అధికార వ్యవస్థల్లో, రాజ్యాంగ పదవుల్లో ఉండి తమవారి కోసం పని చేసే మనుషులు మూడో తల
4) బీజేపీలో ఉన్న సుజనా–పురంధేశ్వరి–సత్య వంటివారి టీడీపీ విభాగం నాలుగో తల
5) కాంగ్రెస్‌లో ఉన్న రేవంత్‌రెడ్డి అండ్‌కో అయిదో తల
6) మొత్తంగా జనసేన పార్టీ, పవన్‌–మనోహర్‌ ఆరో తల
7) చంద్రబాబు పార్టీ ఆఫ్‌ ఇండియా(సీపీఐ) నారాయణ అండ్‌కో, కమ్యూనిస్టు– ఇతర పార్టీల్లో ఉన్న బాబు కోవర్టులు ఏడో తల
8) ఏబీఎన్‌–ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎనిమిదో తల
9) టీవీ–5, ఇతర ఎల్లో మీడియా తొమ్మిదో తల
10) జేఏసీలు, మేధావులు, స్వతంత్ర విశ్లేషకులు పేరిట నడిపే స్పెషల్‌ పర్పస్‌ వెహికల్స్‌… అంటే ప్రత్యేకంగా ఒక లక్ష్యం కోసం, పని కోసం పెట్టుకున్న విభాగాలు పదో తల.
ఇలా రాజకీయాల్లో పది తలల రావణాసురుడు చంద్రబాబు. వీటి గురించి ఈనాడు రామోజీ ఏనాడూ రాయరు. ఇంత మంది క్రేన్‌లు, జాకీలు వేసి లేపినా, ప్రజా నాయకుడు జగన్ ముందు చంద్రబాబు నాయుడు నిలబడలేకపోతున్నాడు.

వికేంద్రీకరణ అనేది మా పార్టీ, మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి నినాదమే కాదు విధానం. అందుకే 26 జిల్లాలు వచ్చాయి. గిరిజనలు కోసం ప్రత్యేక జిల్లాలు వస్తాయని చంద్రబాబు ఎన్నడైనా కలగన్నాడా? ఆయనకు ఎందుకు ఇలాంటి ఆలోచన రాలేదు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు ఆత్మగౌరవం ఉండదా? కేవలం అమరావతి రైతులకు మాత్రమే ఆత్మగౌరవమా?

రాసేటప్పుడు కనీసం ఆలోచించాలి కదా
ఎంతసేపూ, చంద్రబాబును ఎత్తులో చూపించడమే తప్ప, జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక చేసిన మంచి పనుల్లో నాలుగైనా చూపించలేరా మీరు?. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే డబ్బులన్నీ పేదలకు పంచేస్తున్నారని ఏడుపు. చంద్రబాబులా పెద్దలకు పంచాలా?. ఇంటికి తీసుకువెళ్లి పెన్షన్‌ ఇస్తుంటే వాళ్లు వచ్చి తీసుకోలేరా? ఇంటికి వెళ్లి ఇవ్వాలా అని విమర్శలు చేస్తున్నారు. ఇంటి ముందుకే రేషన్‌ తీసుకువెళ్లి ఇస్తుంటే డబ్బులు వృథా అంటూ రాతలా. అది వాళ్ల మైండ్‌ సెట్‌. గడప గడపకు కార్యక్రమంలో మేము ఇంటింటికి వెళుతుంటే లబ్ధిదారులు తమకు అన్ని పథకాలు గడప ముందుకే వస్తున్నాయంటూ మాకు స్వాగతం పలుకుతున్నారు. ఇది మా ముఖ్యమంత్రి విజయం కాదా అని సూటిగా అడుగుతున్నా. దేశంలోనే వ్యవసాయరంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత జగన్‌ మోహన్‌ రెడ్డిగారిది.

బాబు ఆస్తులు లక్ష్మీపార్వతివి అవుతాయా?
విశాఖలో దసపల్లా భూముల గురించి కూడా మాట్లాడుతున్నారు. మా ఎంపీ విజయసాయిరెడ్డి మీద ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తున్నారు. అల్లుడు ఆస్తులు సాయిరెడ్డిగారివే అయితే.. మరి చంద్రబాబు ఆస్తులు లక్ష్మీపార్వతివి అయిపోతాయా?. అల్లుడు ఆస్తులు మామగారివి అయితే గీతం కాలేజీ ఆస్తులు బాలకృష్ణవి అయిపోవాలి. దసపల్లా భూములు ప్రైవేట్ వ్యవహారం. వాటిపై హైకోర్టు, సుప్రీంకోర్టులు తీర్పు ఇచ్చినా కూడా ప్రయివేట్‌ వ్యవహారాన్ని పట్టుకుని, ప్రభుత్వానికి లింక్‌ చేసే కార్యక్రమం చేస్తున్నారు. తీర్పులను కూడా డైల్యూట్‌ చేసేలా ప్రయత్నం చేస్తున్నారు.

ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే అజెండా తప్ప ఈనాడుకు మరొకటి లేదు. యాత్రల పేరుతో, ఉత్తరాంధ్ర వెళ్లి అక్కడవారితోనే ఉత్తరాంధ్ర కళ్లు పొడిపించే యత్నం. టీడీపీ నుంచి అధికారం లాక్కున్నారని జగన్‌ గారి మీద ఉక్రోషంతో రాస్తున్న రాతలివి. తెలుగు మీడియాలో తెలుగుదేశం మీడియాగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 తయారయ్యాయి. మీ టార్గెట్‌ ఏంటో చెప్పండి. మేము స్టేట్‌ గురించి మాట్లాడితే.. మీరు రియల్‌ ఎస్టేట్‌ గురించి మాట్లాడతారా…?. రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి గురించి మేము మాట్లాడితే మీరు కేవలం అమరావతి భూముల గురించే మాట్లాడతారు. ఇదెక్కడి న్యాయం..?

పది శాతం అయినా నిజాలు నిజాలుగా మాట్లాడాలి. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబాటు తనం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఆ కోణంలో చూసి ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఎప్పుడైనా చెప్పారా ?. రాజధాని కోసం, కేంద్రం శివరామకృష్ణన్‌ కమిటీ వేస్తే.. ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాకపోయినా, రాష్ట్రానికి వికేంద్రీకరణే శరణ్యం అని చెప్పింది. అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ కార్యాలయాలు పెట్టాలని సూచించింది. జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ కూడా వికేంద్రీకరణే చేసుకోవాలని, లేకుంటే ఎప్పటికైనా ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పింది. ఇవన్నీ వాస్తవం కాదా? వాటి గురించి ఎప్పుడైనా ప్రస్తావించారా? ఒక సింగిల్ కాలం వార్త అయినా రాశారా?. నిజాల్ని నిర్బయంగా చెప్పలేకపోతే, వాస్తవాల్నివాస్తవాలుగా ఒప్పుకోలేకపోతే, కేవలం బురదచల్లడమే మీ అజెండా అయితే మీకు ప్రజల్లో విశ్వసనీయత ఏముంటుంది.

బాబు ఒక్క ప్రాజెక్టు అయినా కట్టాడా..?
ఇరిగేషన్‌ గురించి చూస్తే… మా ప్రభుత్వం ఇరిగేషన్‌ ను నిర్లక్ష్యం చేసిందని, చంద్రబాబు నాయుడు తెగ ప్రాజెక్ట్‌లు కట్టాడని ఈనాడు పత్రికలో తప్పుడు రాతలు రాస్తున్నారు. చంద్రబాబు పట్టిసీమ ఎత్తిపోతల తప్ప, ఏ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశాడని సూటిగా అడుగుతున్నాను. ఉత్తరాంధ్రకు మీరు చేసిన ప్రాజెక్ట్‌లు ఏంటి? ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల సమస్యను పరిష్కరించడానికి చంద్రబాబు తన హయాంలో ఒక్క రూపాయి అయినా కేటాయించాడా?. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ముఖ్యమంత్రి ఉద్దానంలో మంచినీటి ప్రాజెక్ట్‌ కోసం రూ.700కోట్లు కేటాయించారు. కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటుతో పాటు, ఆస్పత్రి నిర్మాణానికి వందల కోట్లు ఖర్చు పెట్టడం మీ కళ్లకు కనిపించడం లేదా?
ఎల్లో పత్రికలు కళ్లకు గంతలు కట్టుకున్నాయా?. ఉద్ధానం ప్రాంత అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టకపోవడం చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్‌ కాదా?. శ్రీకాకుళానికి జీవనాడి అయిన వంశధార ప్రాజెక్ట్‌కు టీడీపీ హయాంలో ఒక్క రూపాయి ఖర్చుపెట్టారా?. వైయస్సార్‌ ప్రారంభించిన ప్రాజెక్ట్‌లను కనీసం ముందుకు తీసుకువెళ్లలేకపోయారు. వంశధారపై ఒడిశాతో ఉన్నవివాదాన్ని ముఖ్యమంత్రి జగన్ గారు స్వయంగా వెళ్లి పరిష్కరించుకోవడం వాస్తవం కాదా?

వెన్నుపోటుపై అడగాల్సింది బాలకృష్ణను కాదు, ప్రజల్ని..
బావా, బామ్మర్ది ఒక టీవీ షోలో కూర్చుని ఎన్టీఆర్‌కు వెన్నుపోటుపై.. అదేదో గొప్ప కార్యం చేసినట్టు ప్రచారం చేస్తున్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు మీద బాలకృష్ణను కాదు ప్రజలను అడిగితే చెబుతారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ ప్రజా నాయకుడు. అటువంటి నాయకుడ్ని వెన్నుపోటు పొడవడం తప్పు కాదంటారా?. అసలు దేనికోసం వెన్నుపోటు పొడిచావో ఎందుకు చెప్పవు బాబూ.?. వెన్నుపోటు పొడిచిన మీరే..ఒక టీవీ షోలో కూర్చుని మాట్లాడుకుంటూ మీకు మీరే కితాబులు ఇచ్చుకుంటుంటే అది నిజం అని నమ్మేసి, జనం చప్పట్లు కొట్టే రోజులు పోయాయి. మీరు ఒకరికొకరు పొగుడుకున్నంత మాత్రాన, చంద్రబాబు వెన్నుపోటు దారుడు కాకుండా పోతాడా..?.

ఎన్టీఆర్‌ను గద్దెనెక్కించి, మీకు అనుకూలంగా లేకపోయేసరికి, చంద్రబాబును ఎగదోసి, ప్రభుత్వాన్ని పడగొట్టించి, వెన్నుపోటు పొడిచిందే ఈనాడు చరిత్ర. చివరిగా, ఈనాడు, ఇతర ఎల్లో మీడియాలో రాస్తున్నట్టు, చూపిస్తున్నట్టు, అమరావతిని మీ డ్రామాలు, డ్యాన్సులేకాపాడతాయనుకుంటున్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే మా లక్ష్యమనేలా ముఖ్యమంత్రిగారు ముందుకు వెళుతున్నారు. రాష్ట్ర ప్రజలు విజ్ఞులు. మీరనుకున్నంత అమాయకులు కారు. చంద్రబాబుకు ఎన్ని తలలు, ఎన్ని జాకీలు ఉన్నాయో ప్రజలకు తెలియదనుకోవద్దు.

LEAVE A RESPONSE