-మూడు రాజధానులకు మద్దతుగా మరో ముగ్గురు నలుగురి ఎమ్మెల్యేల చేత రాజీనామాలు
-ఆ తరువాత మూకుమ్మడిగా రాజీనామాలు…అసెంబ్లీ రద్దు
-ఏప్రిల్, మే లో ముందస్తు ఎన్నికలు వచ్చే ఛాన్స్
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
రాష్ట్రంలో త్వరలోనే ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నదని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా గవర్నర్ తో భేటీ కావడం పరిశీలిస్తే, రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయని చెప్పారు. మూడు రాజధానులకు మద్దతుగా మరో ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేల చేత రాజీనామాలు ఇప్పించి, అయ్యా… బాబోయ్ ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేసే విధంగా ఉన్నారనే భావనను ప్రజలలో కల్పించి, ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లి అవకాశం ఉందని ఆయన అన్నారు. ఏప్రిల్, మే నెలలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందనితెలిపారు. శుక్రవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ అయిందని, ప్రస్తుతం ప్రభుత్వం వద్ద డబ్బులు లేవనిఅన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సంవత్సరానికి ఇచ్చిన రుణ పరిమితికి మించి అదనంగానే 1000, రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారన్నారు. వీరు మరిన్ని తమ శక్తి యుక్తులను, కుయుక్తులను ఉపయోగించి మరిన్ని అప్పులు తెచ్చినా రెండు, మూడు నెలలకు మించి ప్రభుత్వాన్ని నడపడం కష్టమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందన్న విషయం ప్రజలందరికీ అర్థమయ్యే లోపే మూడు రాజధానుల పేరిట ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని రఘురామకృష్ణంరాజు తెలిపారు.
ఏపీ పోలీస్ విక్టిమ్ ఫోరం ఏర్పాటు
ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ విక్టిమ్ ఫోరం ఏర్పాటు చేస్తానని, తనలాగే పోలీసు బాధితులకు అండగా ఉండేందుకు ఈ ఫోరం ద్వారా మద్దతుగా నిలుస్తానని రఘురామకృష్ణం రాజు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ, 26 జిల్లాలలో తమ పార్టీ కార్యకర్తలకు మద్దతుగా నిలిచేందుకు లీగల్ సెల్ ను బలోపేతం చేస్తుండడం స్వాగతించాల్సిన విషయమని పేర్కొన్నారు. రాజకీయాలకతీతంగా పోలీసు బాధితులకు టిడిపి న్యాయ విభాగం అండగా ఉండాలని సూచించారు. అలాగే ఏపీ పోలీస్ విక్టిమ్ ఫోరం తరఫున తాము కూడా మద్దతుగా ఉంటానని చెప్పారు. టిడిపి మీడియా కోఆర్డినేటర్ నరేంద్రను సిఐడి పోలీసులు, ఒక వాట్సాప్ గ్రూపులలో వచ్చిన సందేశాన్ని మరొక గ్రూపులోకి ఫార్వర్డ్ చేసినందుకు అరెస్టు చేయడం అత్యంత దారుణమని మండిపడ్డారు.
సీఎం కార్యాలయంలో పనిచేసే ఒక అధికారి భార్య బంగారాన్ని స్మగ్లింగ్ చేసిందనే ఆరోపణలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయన్నారు. ఈ సంఘటనలో, గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లుగా సిఐడి పోలీసుల వ్యవహార శైలి ఉన్నదని ఆయన మండిపడ్డారు. ముగ్గురు, నలుగురిని తీసుకువచ్చి స్టేషన్లో బాదితే జనం భయపడతారని సిఐడి పోలీసులు భావిస్తున్నట్లుగా తెలుస్తోందన్నారు. ఇదే కేసులో సీనియర్ జర్నలిస్టు అంకబాబును అరెస్టు చేశారని, ఇప్పుడు నరేంద్ర వంతు వచ్చిందన్నారు. నరేంద్రను సిఐడి పోలీసులు బట్టలు విప్పించి, మర్మాంగాలను లాఠీతో తాకుతూ, కాళ్ళను నీటిలో తడిపించి, కాళ్లపై లాఠీలతో కొట్టినట్లుగా బాధితుడు చెప్పుకొచ్చారని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.
ఇక సిఐడి పోలీసులు ఎంతటి అసభ్య పదజాలంతో బూతులు తిడతారో తనకంటే బాగా మరెవరికి తెలియదని అన్నారు. సిఐడి పోలీస్ విభాగంలో అత్యంత దుర్మార్గులు ఉన్నారన్న ఆయన, ఈ విభాగంలో దరిద్రులు ఉన్నప్పటికీ, కొంతమంది మంచివారు కూడా లేకపోలేదన్నారు. అసలు సిఐడి పోలీసులకు, సోషల్ మీడియా పోస్టింగులకు సంబంధం ఏమిటనిరఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.
అంతకంటే లఫంగి ట్వీట్లు ఏముంటాయి?
సిఐడి పోలీసుల అరాచకానికి పరాకాష్ట ఐపిసి సెక్షన్ 153a కింద బాధితులపై కేసులు నమోదు చేయడమని రఘురామకృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐడి పోలీసుల బాధితులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల వల్ల రెండు వర్గాల మధ్య వైషమ్యాలు ఎక్కడ చెలరేగాయో చెప్పాలని ప్రశ్నించారు. రెండు వర్గాలను రెచ్చగొట్టే విధంగా, తమ పార్టీకి చెందిన ఓ పొట్టివాడు పెట్టే ట్వీట్ల కంటే లఫంగి ట్వీట్లు ఏముంటాయన్నారు. అటువంటి వారిపై మాత్రం సిఐడి కేసులను నమోదు చేయదని అన్నారు. రంగనాయకమ్మ తో పాటు ఇతరులు పెట్టిన ట్వీట్లు మాత్రమే రెండు వర్గాల మధ్య వైషమ్యాలను సృష్టిస్తున్నాయా? అంటూ ప్రశ్నించారు.
సిఐడి చీఫ్ గా వ్యవహరిస్తున్న అడిషనల్ డీజీ వికృత చేష్టల వల్లే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఒక మతాన్ని ప్రోత్సహిస్తూ, దొంగ సర్టిఫికెట్ల ద్వారా ఐపీఎస్ అధికారి అయిన సదరు వ్యక్తి గురించి తాను సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. అయినా అతనిపై ఎటువంటి చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది నిజాయితీపరులైన అధికారులు ఉండగా, వారిని వీఆర్ లో పెట్టి, తనని సిఐడి కస్టడీలో తీవ్రంగా హింసించిన విజయ్ పాల్ కు రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు పదవీ కాలాన్ని పొడిగించడం కాకుండా, ఓ ఎస్ డీ గా పదోన్నతి కల్పించిందని వండిపడ్డారు.
సిఐడి బాధితుల నుంచి సదరు అధికారి జి టాక్స్ మాదిరిగానే సిమెట్రీ టాక్స్ వేస్తున్నట్లుగా తెలిసిందని, ఈ విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, సునీల్ కుమార్ కే తెలియాలన్నారు. సిఐడి పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన వారిని కోర్టులో ప్రవేశపెట్టడం… కోర్టులో ప్రవేశపెట్టిన వెంటనే 41 ఏ నోటీసులు ఇవ్వకుండా, ఎలా అదుపులోకి తీసుకున్నారని ప్రశ్నించడం సర్వసాధారణమైపోయిందని అసంతృప్తిని వ్యక్తం చేశారు.
అక్రమంగా అమాయకులను అరెస్ట్ చేస్తున్న సిఐడి పోలీసులపై మాత్రం ఎటువంటి చర్యలు ఉండడం లేదని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. ఇక గుంటూరు ఆసుపత్రి సూపరిండెంట్ ప్రభావతమ్మ అబద్దాలకు అంతే లేదని, తాను వేలు ఎముక విరిగి ఆసుపత్రిలో చేరితే, అంతా బాగానే ఉన్నదని నివేదిక ఇచ్చిన మహానుభావురాలు అంటూ ఎద్దేవా చేశారు. మిలిటరీ ఆసుపత్రి నివేదిక ఆధారంగా తనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిందని చెప్పారు. తనని సిఐడి కస్టడీలో హింసించినప్పుడు చిత్రీకరించిన వీడియోను తిలకించిన తాడేపల్లిలో ఉన్న ఒక వ్యక్తి ” ఫినిష్ హిమ్ ” అని సదరు అధికారిని ఆదేశించినట్లుగా తెలిసిందన్నారు.
తనని సిఐడి కస్టడీలోనే హత్య చేయాలని చూశారని, గుండె ఆపరేషన్ జరిగిన తాను ఒకవేళ సిఐడి కస్టడీలోని మరణించి ఉంటే… ఆ వ్యక్తే ముందుగా వచ్చి తనకు దండ వేసి ఉండేవాడేమోనని అన్నారు. ఆ వెంకటేశ్వర స్వామి దయవల్ల, ప్రజల ఆశీర్వాదంతో తాను బతికి బయటపడ్డానని, ఇది తనకు నిజంగానే పునర్జన్మ అంటూ రఘురామ కృష్ణంరాజు భావోద్వేగానికి గురయ్యారు.
డీజీపీగా సునీల్ కుమార్?
ప్రస్తుత డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి ని ఎన్నికలకు ఆరు నెలల ముందే తప్పించి, తాను చెప్పినట్లల్లా చేస్తున్న అడిషనల్ డీజీ సునీల్ కుమార్ కు పదోన్నతిని కల్పిస్తారేమోనని రఘురామకృష్ణం రాజు అనుమానం వ్యక్తం చేశారు. రాజేంద్రనాథ్ రెడ్డి మంచి మనిషని, ఆయన ప్రభుత్వ పెద్దలు చెబుతున్నట్లుగా అకృత్యాలను చేయలేరన్నారు. తాము కొట్టమన్న వాళ్ళని కొట్టాలని… చంపమన్న వారిని చంపేయాలని, ఆ లక్షణాలు అధికంగా ఉన్న సునీల్ కుమార్ ను డీజీపీ గా నియమిస్తారనే సమాచారం తనకు ఉందని, ఆ నమ్మకం ఆయన కూడా ఉందన్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే సిఐడి పోలీసులు ఇళ్లల్లోకి వెళ్తున్నారని, ఇదే విషయము మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కోడలు న్యాయస్థానాన్ని ఆశ్రయించిందని గుర్తు చేశారు.
న్యాయస్థానాలలో రిజిస్ట్రార్ ఆఫీసులను మేనేజ్ చేస్తున్నారు
న్యాయస్థానాలలో రిజిస్ట్రార్ కార్యాలయాలను మేనేజ్ చేస్తూ, కేసులు వాదనలకు రాకుండా ప్రభుత్వ పెద్దలు అడ్డుకుంటున్నారని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. తాను రిజిస్ట్రా ర్ ఆఫీసులను మేనేజ్ చేస్తున్నారని నేరుగానే ఆరోపణలు చేస్తున్నానని తెలిపారు . సిబిఐ అధికారి రాంసింగ్ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పిటిషన్ స్కాష్ చేయమని అడిగితే, ఇప్పటికే పదిసార్లు వాయిదాలు వేస్తూ వస్తున్నారని, ఎఫ్ఐఆర్ స్వాష్ చేయడానికి మాత్రం ముందుకు రావడం లేదన్నారు . న్యాయస్థానాలలో జరుగుతున్న ప్రొసీడింగ్స్ ని ప్రజలంతా గమనిస్తున్నారని, సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నిసార్లు అయినా వాయిదా వేసే అధికారం, న్యాయమూర్తులకు ఉందని పేర్కొన్నారు.
ఇవాళ కాకపోతే రేపైనా న్యాయం జరుగుతుంది
న్యాయస్థానాలలో ఇవాళ కాకపోతే రేపైనా న్యాయం జరుగుతుందని ఆశాభావంతో ఉన్నామని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఒక ఎంపీగా తాను తన నియోజకవర్గానికి వెళ్లలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసిన రఘురామకృష్ణం రాజు, తనని సిఐడి పోలీసులు చిత్రహింసలకు గురిచేసిన సంఘటనను పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. అయితే, ప్రివిలేజ్ కమిటీ కనీసం నోటీసులు ఇచ్చి తనని చిత్ర హింసలకు గురిచేసిన అధికారులను పిలిచి విచారించకపోవడం విస్మయాన్ని కలిగించిందన్నారు. రఘురామకృష్ణం రాజును హింసించింది నిజమేనా అని సదరు పోలీసు అధికారులను అడిగితే… లేదండి అని సమాధానం చెప్పగానే, ప్రివిలేజ్ కమిటీ తన పని అయిపోయిందన్నట్లుగా చేతులు దులుపుకోవడం ఏమిటంటూ ప్రశ్నించారు.
సంబంధిత అధికారులను పిలిచి, క్రాస్ ఎగ్జామిన్ చేయాలి కదా? అంటూ నిలదీశారు. ఇక తనపై అనర్హతవేయాలని తమ పార్టీ పిటిషన్ ఇవ్వగానే, తక్షణమే స్పందించి, ఎందుకు మిమ్మల్ని డిస్ క్వాలిఫై చేయకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేశారన్నారు. తాను సమాధానం చెప్పానని తెలిపారు. హైకోర్టు రిజిస్టార్ సమక్షంలోనే తనకు వైద్య పరీక్షలు జరిగాయని, అయినా కూడా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ద్వారా ప్రజలకు చెప్పుకోవడం మినహా, ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆందోళన వ్యక్తం చేశారు. మనం దుర్మార్గుల మధ్య బతుకుతున్నామని, ఇటువంటి పరిస్థితి మరొకరికి రాకూడదని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఎన్నికలలో ఓటు అనే ఆయుధం ఈ దుర్మార్గులకు బుద్ధి చెప్పాలని, వాళ్లు ఇచ్చే చిల్లర డబ్బులకు ఆశపడితే మీతో పాటు మీ పిల్లలు , భవిష్యత్ తరాలను కూడా తాకట్టు పెట్టిన వారవుతారు మీ ఇష్టం అంటూ రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు.
మా పార్టీలో ఉన్నది మెజారిటీ దొంగలే
తమ పార్టీలో ఉన్నది మెజారిటీ దొంగలేనని రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం తను చదువుకునే రోజుల్లోనే ఎంతో అభివృద్ధి చెందిందని, ఇప్పుడు కొత్తగా అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదన్నారు. విశాఖ ప్రజలు ఎంతో శాంతి కాముకులను పేర్కొన్న ఆయన, రాయలసీమ, నెల్లూరు నుంచి వచ్చి పడిన దొంగలు విశాఖను దోచుకుంటున్నారని విమర్శించారు. మా అమ్మాయి పెళ్లి చేసుకున్న వాడికి డబ్బులు ఉన్నాయని, అందుకే భూములు కొనుగోలు చేస్తున్నాడని చెబుతున్న విజయ్ సాయి రెడ్డికి, విశాఖ నగరానికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. విజయవాడ రైతులు మాత్రం, అరసవల్లి సూర్య నారాయణుడిని దర్శించుకోవద్దని మంత్రులు ధర్మాన, బొత్స అంటారా?అంటూ నిలదీశారు. విజయ సాయి కాదు… విశాఖ కసాయి అని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఒక్కసారి పరిశీలిస్తే, ఎంతో బాధ ఉంటే కానీ, అటువంటి వ్యాఖ్యలు చేయరన్నారు.
విశాఖను కాపాడుకుందాం… దొంగలను తరిమికొడదాం
విశాఖ నగరాన్ని కాపాడుకుందాం… దొంగలను తరిమికొడదాం అన్న నినాదాన్ని విశాఖ నగర ప్రజలు అందుకోవలసిన అవసరం ఉందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. సేవ్ ఉత్తరాంధ్ర కాదు అని, సేవ్ విశాఖ అనాల్సిన అవసరం వచ్చిందన్నారు. విశాఖ నగరం వివక్షకు గురైందని ప్రొఫెసర్ లజపతిరాయ్, ప్రసాద్ రెడ్డిలు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో వీరంతా ఏమయ్యారని ఆయన ప్రశ్నించారు. విశాఖ నగర భూములను అడ్డంగా దోచుకున్న వారు ఇప్పుడు వాటి ధరలను పెంచుకునేందుకు రాజధానిగా విశాఖను ప్రకటించాలని చూస్తున్నారన్నారు. విశాఖ రాజధానిగా ఏర్పాటు చేయడం అసాధ్యమని వారికి కూడా తెలుసునని అన్నారు. కబ్జాలు, రౌడీయిజం అంటే తెలియని విశాఖ నగరాన్ని వీరు కలుషితం చేశారని మండిపడ్డారు.
విశాఖ నగరంలోని దస పల్లా భూములు కొనుగోలు చేసింది ఎక్కువ కమ్మవారేనని పేర్కొన్న విజయసాయిరెడ్డి, కమ్మవారికి భూములు ఉన్నాయనే కారణంగానే అమరావతి నుంచి రాజధానిని ఎత్తేసి విశాఖ నగరాన్ని కార్యనిర్వాక రాజధానిగా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు కదా, మరి అటువంటి కమ్మ వారికే ఎక్కువ భూములు ఉన్నా విశాఖ నగరాన్ని ఎలా కార్యనిర్వాహక రాజధానిగా చేస్తారని ప్రశ్నించారు. కమ్మవారు ఎక్కడైనా భూములను కబ్జా చేశారా? అంటూ ప్రశ్నించిన ఆయన, కమ్మవారు ఎక్కడ ఉన్నా కష్టపడి పని చేస్తారని, అది వారి స్వభావం అంటూ కితాబునిచ్చారు.
రైల్వే శాఖ అనుమతి లేకుండా రాజమండ్రి బ్రిడ్జ్ ను మూసివేయడమేమిటి?
రాజమండ్రి బ్రిడ్జి పైన మరమ్మత్తులు చేపడుతున్నామని చెప్పి, బ్రిడ్జిని మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. గతంలో రాజమండ్రి బ్రిడ్జి పైనుంచి పాదయాత్ర చేసిన వైయస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో సఫలీకృతులయ్యారని, అందుకే రైతు పాదయాత్రను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే బ్రిడ్జిని మరమ్మత్తుల పేరిట మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు అర్థమవుతుందన్నారు.
రైల్వే శాఖ అనుమతి లేకుండా, మరమ్మత్తు పనులను చేపట్టడం నిబంధనలను విరుద్ధమన్న ఆయన, ఇదే విషయమై ఇప్పటికే రైల్వే శాఖ అధికారులకు లేఖ రాశానని తెలిపారు. రైల్వే శాఖ మంత్రి ని కూడా కలిసి ఈ విషయాన్ని తెలియజేస్తానని చెప్పారు. బ్రిడ్జి మరమ్మత్తు పనుల కోసం మూసివేస్తున్నట్లుగా కలెక్టర్ మాధవీలతారెడ్డి ఆదేశాలు జారీ చేసి, ఎందుకనీ అధికారంలో ఉన్నవారికి సహకరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ఇటువంటి చీప్ ట్రిక్స్ పక్కన పెట్టి అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు సహకరించాలని సూచించారు. లేకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
ఇంప్లీడ్ పిటిషన్ స్వీకరించని హై కోర్ట్
ఋషికొండ ప్రకృతి విధ్వంసం పై హైకోర్టులో కొనసాగుతున్న కేసులో తనని ఇంప్లిడ్ కమ్మని సుప్రీంకోర్టు సూచించిందని, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తాను దాఖలు చేసిన ఇంప్లిడ్ పిటీషన్ హైకోర్టు పరిగణలోకి తీసుకొని స్వీకరించలేదని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఇదే విషయాన్ని తాను సుప్రీంకోర్టుకు నివేదించేందుకు, శుక్రవారం పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. ఋషికొండ ప్రకృతి విధ్వంసం పై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లే కనిపించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేస్తానని పేర్కొనగా, రాష్ట్ర ప్రభుత్వం వద్దని వారించగానే… వారెందుకని కమిటీని ఏర్పాటు చేయలేదో అర్థం కావడం లేదన్నారు. ఋషికొండపై హైకోర్టులో వాదనలు వచ్చే నెల మూడో తేదీకి వాయిదా వేశారని, ఈ లోపుగా నిర్మాణ పనులు జరుగుతూనే ఉంటాయన్నారు. గతంలో ఉన్న నిర్మాణాల స్థానంలోనే, నిర్మాణాన్ని చేపట్టడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
వి ఆర్ విత్ యూ సునీతారెడ్డి
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి, కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డికి మీ అన్నయ్య మీ కు మద్దతుగా నిలుస్తారో… లేదో తెలియదు కానీ, రాష్ట్ర మొత్తం మీకు మద్దతుగా ఉంటుందని రఘురామకృష్ణం రాజు అన్నారు. వైయస్ వివేకానంద రెడ్డి కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరిపై హత్యాయత్నానికి కుట్ర జరిగినట్టుగా అనుమానాన్ని వ్యక్తం చేస్తూ, తనకి ఏదైనా జరిగితే దానికి ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి బాధ్యులని పేర్కొనడం జరిగిందన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు ముందు ఆయన కుక్కను తొలుత చంపినట్లుగానే, ప్రస్తుతం దస్తగిరి కుక్కను కూడా చంపడం… ఎస్పీ అన్బురాజ్ తరచూ సెక్యూరిటీ గా నియమించిన పోలీస్ కానిస్టేబుల్ ను మార్చడం వంటి సంఘటనలను పరిశీలించిన దస్తగిరి తన హత్యాయత్నానికి కుట్ర జరుగుతుందని అనుమానిస్తున్నట్లుగా మీడియాకు తెలియజేయడం జరిగిందన్నారు .