Suryaa.co.in

Andhra Pradesh

దళితులను దారుణంగా మోసగిస్తున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి వర్ల రామయ్య బహిరంగ లేఖ…..

మహారాజశ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారికి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, దళిత వర్గానికి చెందిన వర్ల రామయ్య వ్రాయు బహిరంగ లేఖ.

ఆర్యా..
మీరు అధికారంలోకి రాకముందు పాదయాత్ర చేస్తున్న సందర్భాల్లో పదేపదే దళితులు మా బంధువులని, మీదు మిక్కిలి మా మేనమామలని, నేను అధికారంలోకి వస్తే ఈ వర్గాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పిన అబద్దపు మాటలు, అసత్య వాగ్ధానాలు నమ్మి ఈ వర్గాలు మీకు ఓట్లు వేసి గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తే, ఈ వర్గాలపై మీరు ఇనుపపాదం మోపి అణచివేయడం న్యాయమా ముఖ్యమంత్రిగారు?

శాసనసభలో, బయట, అధికారిక సభల్లో నా ఎస్సీలు..నా ఎస్సీలు.. అని మీరు పదేపదే ఉటంకిస్తుంటే ఇది నిజమే కాబోలు అని దళిత వర్గాలు సంబరపడి మా ముఖ్యమంత్రి..మా ముఖ్యమంత్రి.. అని ఆదిలో మిమ్మల్ని పొగిడింది నిజమేకదా ముఖ్యమంత్రి గారు? మరేమి ముఖ్యమంత్రి గారూ? మీరు అధికారాన్ని చేపట్టిన తర్వాత 30-05-2019 నాటి నుండి ఈ వర్గాల సంక్షేమాన్ని విస్మరించి, ఈ వర్గాలను అణగదొక్కడానికి పూనుకోవడం ఎంతవరకు సమంజసం ముఖ్యమంత్రి గారు?

ఆనాడు నర్శిపట్నంలో ప్రభుత్వ డాక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ కరోనా సమయంలో ప్రభుత్వం మాస్కులు ఇవ్వాలి, లేకపోతే వైద్యులకు కూడా ప్రమాదమేనని వ్యాఖ్యానిస్తే, మీ ప్రభుత్వం అతన్ని పిచ్చివాడిగా సృష్టించి అతని ప్రాణాలు హరించింది నిజం కాదా ముఖ్యమంత్రిగారు? ఈ చర్యతో రాష్ట్రంలోని దళిత వర్గాలన్నీ ఉలిక్కిపడింది నిజం కాదా సార్?

ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది, దళిత బిడ్డలు ప్రమాదాలకు గురవుతున్నారు అని గగ్గోలు పెట్టిన వరప్రసాద్ ను మీ ఇసుక మాఫియా పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఆ దళిత యువకుడిని పోలీస్ స్టేషన్ లోనే శిరోముండనం చేయిస్తే ఇంత వరకు అసలు నేరస్తుడిని అరెస్టు చేయలేదు. ఇదేనా ముఖ్యమంత్రి గారు దళితుల పట్ల మీకున్న బంధుప్రీతి? రాజమండ్రి దగ్గర ఒక దళిత యువతిని నలుగురు దుండగులు మానభంగం చేసి, పోలీస్ స్టేషన్ ముందు పడేస్తే, ఇంత వరకు ఆ కేసు గతేమిటో తెలియని పరిస్థితికి మీ సమాధానం ఏమిటి ముఖ్యమంత్రిగారు? కృష్ణాజిల్లాలో ముదినేపల్లి దగ్గర తనను ప్రేమించిన రెడ్డి యువకుడిని పెళ్లాడమని కోరిన దళిత యువతి ఇల్లు తగులబెడితే మీరు, మీ పోలీసులు చోద్యం చూడడం కూడా దళితుల పట్ల ఉన్న మీ బంధుప్రీతేనా ముఖ్యమంత్రి గారు?

చీరాలలో కిరణ్ కుమార్ అనే దళిత యువకుడు మాస్కు పెట్టుకోలేదని పోలీసులు కొట్టి కొట్టి చంపితే అదేమని మీరు గాని, మీ ప్రభుత్వం గాని ప్రశ్నించలేదు. ఇదేనా దళితుల పట్ల మీకున్న బంధుప్రీతి ముఖ్యమంత్రిగారు? త్రాగిన మైకంలో ఎమ్మార్పీ రేటుకే మద్యంను అమ్మాలని గగ్గోలు పెట్టిన దళిత యువకుడు ఓంప్రతాప్ చావు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలి ఉంది. అతని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అదేమైందో ఇప్పటికీ చెప్పలేదు. ఇదేనా దళితుల పట్ల మీకున్న బంధుప్రీతి? మీ నియోజకవర్గం పులివెందులలో అడవిలో పశువులను మేపుకుంటున్న దళిత యువతిని మానభంగం చేసి, కొట్టి చంపితే ఇంతవరకు ఆ కేసు అతీగతీ లేదు. ఇదేనా దళితుల పట్ల మీ బంధుప్రీతి ముఖ్యమంత్రిగారు? దళిత యువతి హత్య, మానభంగంపై చర్యలు తీసుకోండని ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన దళిత సంఘాలు, దళితులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి వాళ్లను కోర్టు చుట్టూ తిప్పుతున్న మీ దళిత ప్రేమ అపారం, అనితరసాధ్యం ముఖ్యమంత్రి గారు.

అమరావతే రాజధానిగా ఉండాలని ఎలుగెత్తి నినదించిన దళిత రైతులను అరెస్టు చేసి, వాళ్ల చేతులకు బేడీలు వేసి, వారిపైనే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి హింసించిన మీ దళిత ప్రేమ వచింపనలవికానిది ముఖ్యమంత్రిగారు. పొన్నూరు నియోజకవర్గం చింతలపూడి గ్రామానికి చెందిన దళితుడు బర్నబాసును స్థానిక బియ్యం మాఫియా హత్య చేస్తే ఇంతవరకు ఆ కేసు అతీగతి లేదు. నిన్నగాక మొన్న ఆకేసులో ప్రథమ ముద్దాయి మీ ఎమ్మెల్యే వెంటే పొన్నూరులో తిరుగుతున్నారట. అతను మాత్రం పోలీసులకు కనిపించడు. ఇదేనా దళితుల పట్ల మీకున్న బంధుప్రీతి ముఖ్యమంత్రిగారు?

తాజాగా మీకు అత్యంత ఆప్తుడైన ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ దళితుడైన సుబ్రహ్మణ్యం(కారణాలు అతనికి, అతని కుటుంబ సభ్యులకు, బంధువులకు బాగా తెలుసు)ను కొట్టి కొట్టి చంపి, ఆ శవాన్ని అతని ఇంటికే కారులో తీసుకొచ్చి ఇంటి ముందు పడేస్తే ఆ కేసును మీ పోలీసులు దర్యాప్తు చేసిన తీరు ముఖ్యమంత్రిగా మీకు దళిత వర్గాల పట్ల ఉన్న ప్రేమ, బంధుప్రీతిని ప్రస్ఫుటంగా ద్యోదకపరుస్తున్నవి.

ఆ కేసును మొట్టమొదటి నుండి జిల్లా పోలీసులు అయిష్టంగానే దర్యాప్తు చేశారు. సాక్ష్యాలు సేకరించడంలో ఎంతో నిర్లక్ష్యం వహించారు. బొటాబొటి సాక్ష్యాలతో తూతూమంత్రంగా అనంతబాబును అరెస్టు చేసి, రిమాండ్ కు పంపారు. కోర్టు ఇతని నేర చరిత్రగురించి ప్రశ్నిస్తే పోలీసులు అనంతబాబు సచ్ఛీలుడని సర్టిఫికెట్ ఇచ్చారు. మరలా కోర్టు తప్పుబడితే అతనిపై ఎన్నో కేసులున్నాయని ఎట్టకేలకు పోలీసులు ఒప్పుకున్నారు. మీకు అనంతబాబుపట్ల ఉన్న ప్రేమ గమనించి, ఒక దళితుడి హత్య కేసు అయినప్పటికీ పోలీసులు ఎప్పుడెప్పుడు అతనిని బెయిల్ పై విడుదల చేయించాలని పడిన ఆరాటం వర్ణనాతీతం. మీరు ముఖ్యమంత్రిగా అంత ప్రేమ అతనిపై చూపకపోతే పోలీసులు అతని విడుదలకు ఇంత ఆరాటపడేవారు కాదు. మరి, దళితులు నా బంధువులు అన్న మీకు హంతకుడైన అనంతబాబు వీరికంటే ఎక్కువ ప్రేమపాత్రుడు ఎలా అయ్యాడో అర్థంకావడం లేదు. సెషన్స్ కోర్టులో అనంతబాబు బెయిల్ కోసం మీ పోలీసులు పడిన తపన, తదుపరి హైకోర్టులో మీ ప్రభుత్వం అతని బెయిల్ కోసం పడిన ఆరాటం తర్వాత సుప్రీంకోర్టులో కూడా మీ ప్రభుత్వం అతని బెయిల్ కోసం అతనిని జైలునుండి బయటకు తీసుకురావడం కోసం చూపించిన శ్రద్ధ, భక్తులు వర్ణనాతీతం ముఖ్యమంత్రిగారు. రోజుకు లక్షల్లో ఫీజు తీసుకునే న్యాయవాదులు అనంతబాబు తరపున నియమించబడినారట…మీ ఆశీస్సులతోనేనా ముఖ్యమంత్రిగారు?

చనిపోయిన దళితుడు సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు అనంతబాబు జైలునుండి విడుదలవుతున్నారంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. జిల్లాలో అనంతబాబు తరపున పనిచేసిన దళితవర్గాల నాయకులు, బంధువులు ఏ క్షణంలో అనంతబాబు చేతిలో బలవుతామోనని భయభ్రాంతులకు గురవుతున్నారు. అనంతబాబు విడుదల కోసం అక్కడ కొత్తగా నిర్మింపబడిన సచివాలయాలు కూడా ఇతని అమృత హస్తాల మీద ప్రారంభం జరగాలని ఆశగా ఎదురుచూస్తున్నాయట. హత్యచేసి ఇంతకాలం జైలులో ఉన్న అనంతబాబును ముఖ్యమంత్రిగా, వైకాపా అధ్యక్షుడిగా మీరు మాత్రం మీ పార్టీ నుండి సస్పెండ్ చేయరు…మీ పార్టీ అతనిపై ఏ చర్యలూ తీసుకోదు. ఆహా…దళిత వర్గాల పట్ల మీకెంత బంధుప్రీతి ముఖ్యమంత్రిగారు?

అనంతబాబు సుబ్రహ్మణ్యంను చంపి 210 రోజులు గడిచాయి. ఇప్పటికీ ఆ కుటుంబానికి చట్ట ప్రకారం రావాల్సిన రాయితీలు ఏమీ ఇంత వరకు ఇవ్వలేదు. మీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఇప్పటికైనా బాధిత కుటుంబానికి ఇవ్వాల్సిన రాయితీలు అందించాలి. అనంతబాబు బెయిల్ పై వస్తుండడంతో ఆ ప్రాంతంలి దళితులు భయభ్రాంతులకు గురవుతున్నారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం రివిజన్ పిటిషన్ వేసి అనంతబాబు బెయిల్ పిటిషన్ ను రద్దు చేయించాలి. సుబ్రహ్మణ్యం హత్య కేసులో సీబీఐ విచారణ వేయడానికి ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోంది. దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ప్రభుత్వం సీబీఐతో సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణ చేయించాలి.

నా లేఖను సుదీర్ఘంగా, ఒక దళిత వర్గానికి చెందిన వాడిగా బాధతప్త హృదయంతో వ్రాస్తున్నాను. మీరు ఈ లేఖాంతం వరకు చదవాలని నా కోరిక. మీరు ముఖ్యమంత్రి అయ్యాక దళితుల మీద జరిగిన ఏ దాడి కేసులోనూ మీ ప్రభుత్వ యంత్రాంగం(పోలీసులు) సంతృప్తికరంగా దర్యాప్తు చేయలేదు. మీరు ముఖ్యమంత్రి అయ్యాక ఏ ఒక్క దళితుడి కేసులోనూ కోర్టులో ముద్దాయిలకు శిక్షపడిన దాఖలాలు లేవు. మీ హయాంలోనే ఎస్సీ, ఎస్టీ చట్టం దారుణంగా దుర్వినియోగానికి గురైంది. గత ప్రభుత్వం(చంద్రబాబు ప్రభుత్వం) దళితులకు ప్రవేశపెట్టిన దాదాపు 28 సంక్షేమ పథకాలు మీరు వచ్చిన తర్వాత తొలగించి దళితుల పట్ల మీకున్న బంధుప్రీతిని చాటుకున్నారు. చంద్రబాబు హయాంలో వేలమంది దళిత విద్యార్థులు అంబేద్కర్ విదేశీ విద్య పథకం సాయంతో విదేశాల్లో చదువుకుంటే, మీరు ముఖ్యమంత్రి అయిన నాటి నుండి నేటి వరకు ఒక్క దళిత విద్యార్థినైనా విదేశీ చదువుకు పంపారా? పైగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరు తొలగించి జగనన్న అని మీ పేరు పెట్టుకుంటారా? మీరేమైనా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కంటే గొప్పవారా? విద్యావంతులా? సంఘసంస్కర్తలా? ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు తొలగించి మీ పేరు పెట్టుకోవడం దళితవర్గాల పట్ల మీకున్న ప్రేమ, బంధుప్రీతికి నిదర్శనమా ముఖ్యమంత్రిగారు?

ఇప్పటికైనా మీ ముఖ్యమంత్రిత్వంలో రాష్ట్రంలో దళితుల ఇబ్బందులు గుర్తించి మీకు మిగిలిన ఈ కొద్ది సమయంలోనైనా దళితవర్గాల అభ్యున్నతికి, సంక్షేమానికి కృషి చేయాలని, వారిలో ధైర్యాన్ని నింపాలని, వారి పై అఘాయిత్యాలను అరికట్టాలని, ఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగాన్ని ఆపాలని కోరుకుంటున్నాను.

ఇట్లు,
వర్ల.రామయ్య,
పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ ప్రధానకార్యదర్శి,
తెలుగుదేశంపార్టీ.
Varla-Ramaiah-LR-to-CM-14-12-2022

LEAVE A RESPONSE