– ఆత్మహత్యలకు పాల్పడొద్దంటూ ‘వాసిరెడ్డి పద్మ’ పిలుపు
– రాజమండ్రిలో సూసైడ్ దంపతుల పిల్లలకు ప్రభుత్వ సాయం అందజేత
రాజమండ్రి: లోన్ యాప్ నిర్వాకాలపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని, వేధింపులకు భయపడి ఆత్మహత్యలకు పాల్పడొద్దని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. రాజమండ్రిలో లోన్ యాప్ వేధింపులకు దంపతులు బలైన ఘటనపై ఆమె తీవ్రంగా స్పందించారు. గురువారం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ అనాధలైన ఇద్దరు చిన్నారులను అక్కునజేర్చుకున్నారు. ఈ ఘటనపై చలించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనాధలైన ఇద్దరు చిన్నారులకు రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించగా.. కలెక్టర్ మాధవి లత, ఎంపీ మార్గాని భరత్ తో కలిసి వాసిరెడ్డి పద్మ చెక్కులను బాధిత కుటుంబానికి అందజేశారు. చిన్నారుల సంరక్షణకు ఏర్పాట్లు చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆమె ఆదేశించారు.
ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ లోన్ యాప్ ఆగడాలపై ఏపీ సర్కార్ సీరియస్ ఉందని, రాజమండ్రి దంపతుల ఆత్మహత్య ఘటనపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చలించిపోయారని చెప్పారు. గతంలోనూ లోన్ యాప్ వేధింపులకు తట్టుకోలేక వరుసగా చోటుచేసుకున్న రెండు ఘటనలపై రాష్ట్ర హోంశాఖ, హోం మంత్రి, డీజీపీ సైతం తీవ్రంగా స్పందించారని గుర్తు చేశారు. పార్లమెంటు స్థాయిలో తీవ్రమైన చర్చకు దారితీసిన ఈ లోన్ యాప్ ల ఆగడాలపై గతంలో వైఎస్ఆర్ సీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, మార్గాని భరత్ కూడా మాట్లాడారని చెప్పారు. మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫొటోలు బయట పెటతామంటూ.. బ్లాక్ మెయిలింగ్ తో భయపడిన కుటుంబాలు తీవ్రమైన అవమానభారంతో ఆత్మహత్యలే శరణ్యమనుకుంటున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. లోన్ పేరిట ఎవరైనా తిట్టినా వేధించినా మానసికంగా కుంగిపోరాదని, సకాలంలో దిశ యాప్ వంటి వ్యవస్థలను ఉపయోగించాలని ఆమె సూచించారు. అవమానభారంతో క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోరాదని.. అలాంటి వారికి మహిళా కమిషన్ తో పాటు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలబడుతుందన్నారు.