– అనకాపల్లి ఎస్పీతో మాట్లాడిన ‘వాసిరెడ్డి పద్మ’
అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో రాంబిల్లి మండలం గజిరెడ్డిపాలెం మైనర్ బాలిపై జరిగిన అఘాయిత్యంపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమేరకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అనకాపల్లి జిల్లా ఎస్పీ గౌతమీశాలితో ఫోన్ లో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. బాలికకు పెదనాన్న వరుసయ్యే చేపల చిట్టిబాబు అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందిందని, తక్షణమే విచారించి ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని ఎస్పీ చెప్పారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నామని… బాధితురాలికి వైద్యపరీక్షల నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు పంపినట్లు ఎస్పీ వివరణ ఇచ్చారు. బాధితురాలి బంధువులు నేరస్తుని పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని.. ఈ విషయంపై వేగవంతంగా దర్యాప్తును పూర్తిచేసి కేసు నిగ్గుతేల్చాలని వాసిరెడ్డి పద్మ ఎస్పీని ఆదేశించారు. నేరానికి పాల్పడిన చేపల చిట్టిబాబు టీడీపీ నేతగా తెలిసిందని.. నేరస్తులు ఎంతటి వారైనప్పటికీ తక్షణమే అరెస్టు చేయాలన్నారు. టీడీపీ నేతగా చెలామణవుతూ అభంశుభం తెలియని మైనర్ బాలికలను వేధించే ఇలాంటి నీచులకు రాజకీయపార్టీలు మద్దతుగా నిలిచి ప్రోత్సహించరాదని..పార్టీ నుంచి బహిష్కరించాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ హితవు చెప్పారు. అదేవిధంగా బాధిత బాలిక ఆరోగ్యం కుదుటపడేవరకు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. కమిషన్ చైర్ పర్సన్ ఆదేశాలతో అనకాపల్లి జిల్లా పర్యవేక్షించే మహిళా కమిషన్ సభ్యులు గెడ్డం ఉమ హుటాహుటిన బాధిత బాలిక వద్దకు చేరుకుని పరామర్శించి బాలికకు ధైర్యం చెప్పారు.