– ముందస్తు బెయిలూ కావాలట
– వాసుదేవరెడ్డిఅప్రూవర్ అయితే లాభమెవరికి?
– ఒక వైపు తాను అప్రూవర్ అవుతానంటూ సొంత పిటిషన్
– పోలీసుల పని కూడా తానే చేసిన అత్యుత్సాహం
– ఇంకోవైపు ముందస్తు బెయిల్ కోసం మరో పిటిషన్
– జగన్ పేరు చెప్పకుండా అప్రూవర్‌కు ఎలా అనుమతి ఇస్తారంటున్న టీడీపీ న్యాయవాదులు
– లిక్కర్ సొమ్మును సర్కారుకు స్వాధీనం చేయరేం?
– ప్రాథమిక చార్జిషీట్ బలంగా ఉంటే ఇక అప్రూవర్‌గా మార్చడం ఎందుకు?
– ఆయనను ఎందుకు అరెస్టు చేయడం లేదంటున్న టీడీపీ సీనియర్ లాయర్లు
– ముందస్తు బెయిలిస్తే, మిగిలిన వారికి అది దారి చూపించినట్లేనని స్పష్టీకరణ
– వాసుదేవరెడ్డి పక్షాన నాగార్జునరెడ్డి బంధువు పిటిషన్ వేశారంటున్న టీడీపీ సీనియర్ న్యాయవాదులు
-వాసుదేవరెడ్డిని రక్షించేందుకు ఓ పెద్ద తల ప్రయత్నిస్తోందంటూ అనుమానాలు
-సీఎంను తప్పుదోవపట్టిస్తున్నారని టీడీపీ సీనియర్ లాయర్ల ఆరోపణలు
– ఇప్పటికే చెవిరెడ్డి సహా వైసీపీ నేతలతో ఆ పెద్దతల తెరచాటు బంధాలపై సీఎంకు ఫిర్యాదుల వెల్లువ
– గాలి జనార్దన్‌రెడ్డి తరఫునా వాదనలు వినిపించిన వైనం
– దానిపై ఇంటలిజన్స్తో సర్కారు విచారణ
– సర్కారును గందరగోళంలోకి నెట్టేసిన వాసుదేవరెడ్డి పిటిషన్‌పై న్యాయవాద వర్గాల్లో చర్చ
– వాసుదేవరెడ్డి సాక్షినా? ముద్దాయినా?
– ఇంప్లీడ్ కానున్న టీడీపీ సీనియర్ లాయర్లు?
( మార్తి సుబ్రహ్మణ్యం)
జగన్ హయాంలో లిక్కర్ కిక్కుతో జగనన్నకు వేలకోట్లు సంపాదించిపెట్టి.. తానూ సంపాదించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నాటి ఎండి వాసుదేవరెడ్డి.. తనంతటతాను అప్రూవర్ పిటిషన్ వేయడంపై న్యాయవాద వర్గాలు, టీడీపీ సీనియర్ లాయర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చేయాల్సిన పనిచేయాల్సిన పని కూడా తానే చేయడంపై నోరెళ్ల బెడుతున్నారు.
అదే సమయంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ వేసిన మరో పిటిషన్‌పై టీడీపీ సీనియర్ అడ్వకేట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు వాసుదేవరెడ్డి కేసు నీరుగార్చేందుకు ప్రభుత్వంలోని ఓ న్యాయపెద్ద, తెరచాటు సాయం చేస్తున్నారన్న అనుమానాలకు టీడీపీ న్యాయవాదవర్గాల్లోనే తెరలేవడం విశేషం.
దీనితో వాసుదేవరెడ్డి వేసిన అప్రూవర్ పిటిషన్‌ను కోర్టు అంగీకరిస్తుందా? విచారణ సంస్థ దగ్గర అన్ని ఆధారాలూ ఉన్నందున అప్రూవర్ అవసరం లేదని పిటిషన్‌ను తోసిపుచ్చుతుందా? అసలు వాసుదేవరెడ్డి అప్రూవర్ పిటిషన్‌ను ‘మంచి ప్రభుత్వ’ లాయర్లు వ్యతిరేకిస్తారా? వ్యతిరేకించకుండా స్వాగతిస్తారా? మరెవరైనా ఈ కేసులో ఇంప్లీడ్ అవుతారా? అన్న ఉత్కంఠకు తెరలేచింది. ఈ కేసులో వాసుదేవరెడ్డి అప్రూవర్ పిటిషన్‌పై ప్రభుత్వ లాయర్ల వైఖరిపైనే.. ఇదే కేసులో మిగిలిన వారందరి బెయిల్ వ్యవహారం ఆధారపడి ఉందంటున్నారు.
జగన్ జమానాలో రాష్ట్రాన్ని కుదిపేసిన లిక్కర్ అమ్మకాల వ్యవహారంలో కర్త, కర్మ,క్రియ అయి తన కనుసన్నలలో లిక్కర్ వ్యాపారం నడిపించి జగనన్న పెదవులపై ‘షిక్కటి షిరునువ్వులు’ కురిపించిన వాసుదేవరెడ్డి అప్రూవర్ కమ్ ముందస్తు బెయిల్ జమిలి పిటిషన్లు చర్చనీయాంశంగా మారాయి.
సహజంగా పోలీసులు తమ వద్ద ముద్దాయి నేరానికి సంబంధించిన పూర్తి స్థాయి బలమైన ఆధారాలు లేనప్పుడు, అతనిని ప్రూవర్‌గా మార్చి, దానిని కోర్టుకు నివేదిస్తారు. కోర్టు కూడా సదరు నిందితుడు అప్రూవర్‌గా మారితే, కేసుకు బలం చేకూరుతుందని భావిస్తే.. పోలీసుల పిటిషన్‌ను అంగీకరిస్తుంది.
ఒకవేళ పోలీసు విచారణలో అన్ని ఆధారాలు ఉన్నప్పుడు, ప్రాధమిక చార్జిషీట్, ఎఫ్ఐఆర్ బలంగా ఉన్నప్పుడు నిందితుడిని అప్రూవర్‌గా మార్చేందుకు అంగీకరించదు. ఇది కోర్టులో ప్రభుత్వ న్యాయవాది చేసే వాదనలు, పోలీసులు కేసును బలంగా బిగించే ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. మొత్తంగా.. నిందితుడిని అప్రూవర్‌గా మార్చాలా?వద్దా? అని పోలీసులు నిర్ణయించిన తర్వాతనే కోర్టుకు నివేదిస్తారు.
కానీ లిక్కర్ కేసులో విచిత్రంగా, నిందితుడిగా ఉన్న వాసుదేవరెడ్డి.. తనంతట తాను అప్రూవర్‌గా మారతానని, కోర్టులో పిటిషన్ వేయడంపై టీడీపీ న్యాయవాద వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. అసలు లిక్కర్ స్కాం జరిగిన సమయంలో కీలకపాత్ర పోషించిన వాసుదేవరెడ్డి, ఈ కేసులో నాటి సీఎం జగన్ కీలకపాత్రధారి అని చెప్పకుండానే అప్రూవర్ అవడం వల్ల ఈ కేసుకు లాభమేమిటన్నది టీడీపీ న్యాయవాదుల ప్రశ్న.
నిందితుడిగా ఉన్న వాసుదేవరెడ్డి ఆ స్కామ్‌లో సంపాదించిన సొమ్మును ప్రభుత్వానికి స్వాధీనం చేయకుండా, మూలసూత్రధారిగా ఉన్న జగన్ పేరు విచారణ సంస్థకు గానీ, కోర్టుకు గానీ చెప్పకుండా.. వాసుదేవరెడ్డిని అప్రూవర్‌గా మారిస్తే ప్రభుత్వానికి వచ్చే లాభమేమిటన్న వారి ప్రశ్నలు, అటు న్యాయవాద వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.
అదే సమయంలో.. అదే వాసుదేవరెడ్డి మళ్లీ ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడం ఏమిటన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అసలు లిక్కర్ స్కామ్ ప్రాథమిక చార్జిషీట్‌ను విచారణ సంస్థ అధికారులు ఒత్తిళ్లకు లొంగకుండా బలంగా బిగించారని, దానిలో నిజాయితీ కనిపించిందని టీడీపీ న్యాయవాద వర్గాలే అభినందిస్తున్నారు. సిట్ అధికారులు అన్ని ఆధారాలూ సేకరించారని, వాసుదేవరెడ్డి నిందితుడని తేల్చేందుకు అన్ని ఆధారాలూ బలంగా ఉన్నప్పుడు.. ఆయనను ఇప్పటివరకూ అరెస్టు చేయకుండా తాత్సారం చేయడమే తప్పని, టీడీపీ న్యాయవాదవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో కేసు నీరుగారిపోకుండా ఉండేందుకు కొందరు టీడీపీ సీనియర్ లాయర్లు ఇంప్లీడ్ పిటిషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇంతకూ వాసుదేవరెడ్డి ముద్దాయా? సాక్షినా?
‘‘బెయిల్ పిటిషన్లో సాక్షి కింద 161,164 స్టేట్మెంట్ తీసుకున్నారు. చార్జిషీట్లో వాసుదేవరెడ్డి పాత్రపై స్పష్టమైన ఆరోపణలు చేస్తూనే మరోవైపు ఆయనను సాక్షిగా ఎలా తీసుకుంటారు? అప్రూవర్‌గా ఎలా మారుస్తారు? చార్జిషీట్ వేయకుండా అప్రూవర్‌గా మారిస్తే ఏం ఉపయోగం? దీనిని కోర్టు అంగీ రిస్తుందా? అసలు ఇప్పుడు వాసుదేవరెడ్డి ముద్దాయా? సాక్షినా అర్ధం కావడం లేదు. ఈ కేసును ఇంత గందరగోళంగా మార్చడం అవసరమా?’’ అని ఓ సీనియర్ న్యాయవాది వ్యాఖ్యానించారు.
అసలు ఇది వైసీపీ గుర్తింపును ఎన్నికల సంఘం రద్దుచేసేంత సీరియస్ కేసు అని, ఆ కోణంలో ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదో అర్ధం కావడం లేదని టీడీపీ సీనియర్ లాయర్లు ఆశ్చర్యం చేస్తున్నారు. ‘అప్రూవర్‌గా మారతానంటున్న అప్పటి ఎండి వాసుదేవరెడ్డి అసలు ఈ కేసులో అంతిమ లబ్ధిదారు జగనేనని చెప్పాలి. ఆయన ఆదేశాల ప్రకారమే తాము వ్యవహరించామని, డబ్బు ఎవరికి ఎవరి ద్వారా ఇచ్చిందో లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ ఇవ్వాలి. ఆ డబ్బును ఎన్నికల్లో ఓటర్లకు పంచిపెట్టారని సిట్ ఇప్పటికే చెవిరెడ్డి లాంటి వారిపై అభియోగం మోపింది. అంటే ఎన్నికల సంఘం నిబంధన ప్రకారం, ఓటర్లను డబ్బుతో ప్రలోభపెట్టడం నేరం కాబట్టి.. వైసీపీ గుర్తింపు రద్దు కోరే మహత్తర అవకాశాన్ని ప్రభుత్వం ఎందుకు వదులుకుంటోందో అర్ధం కావడం లేదు. ఆ మేరకు ప్రభుత్వానికి న్యాయపెద్ద ఎందుకు సలహా ఇవ్వడం లేదో అర్ధం కావడం లేదు’’ అని మరో టీడీపీ సీనియర్ న్యాయవాది ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
కాగా ఈ కేసులో వారెంట్లు జారీ చేస్తున్న వైనంపైనా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. సహజంగా అందుబాటులో లేని వారిపైనే వారెంట్లు-లుక్ అవుట్ నోటీసులు జారీ చేస్తుంటారు. కానీ అందుబాటులో ఉన్న వారికీ వారెంట్లు జారీ చేయడం ఏమిటన్న ఆశ్చర్యం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఈ కేసులో ముందస్తు పిటిషన్ దాఖలు చేస్తున్న వాసుదేవరెడ్డి పిటిషన్‌ను కోర్టు అంగీకరిస్తే..ఇదే కేసులో మిగిలిన ముద్దాయిలు కూడా, బెయిల్ పిటిషన్ వేసుకునేందుకు ఒక దారి చూపించినట్లవుతుందన్న ఆందోళన టీడీపీ న్యాయవాద వర్గాల్లో వ్యక్తమవుతోంది. దానికంటే ముందు ఆయనను అరెస్టు చేయడమే ఉత్తమమన్న వ్యాఖ్యలు వ్యక్తమవుతున్నాయి.
అందరి చూపు.. ప్రభుత్వ న్యాయవాదుల వైపే
ఇదిలాఉండగా..వాసుదేవరెడ్డి వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్- అప్రూవర్ బెయిల్ పిటిషన్‌పై ప్రభుత్వ న్యాయవాదులు ఎలా వాదిస్తారన్న అంశంపై, టీడీపీ న్యాయవాద వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇప్పటివరకూ జరిగిన అనేక వ్యవహారాల్లో, నిందితులు స్వేచ్ఛగా తప్పించుకునే వెసులుబాటును.. సొంత పార్టీ ప్రభుత్వ న్యాయపెద్ద వర్గం కల్పిస్తూ వస్తోందని వారు గుర్తు చేస్తున్నారు. అందువల్ల ఈ కేసుపైనా అనుమానం ఉండటం సహజమేనంటున్నారు.
దానికి సంబంధించి జగన్ సర్కారుపై ఐదేళ్లూ అలుపెరగని- అవిశ్రాంత న్యాయపోరాటం చేసిన ఓ సీనియర్ న్యాయవాది, ఇప్పటికే తన వద్ద ఉన్న ఆధారాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలసి అందించారు. దానిపై ఇంటలిజన్స్ విచారణ కూడా జరిగింది. వైసీపీ ప్రభుత్వం నియమించిన పీపీ, ఏజీపీ, జీపీ, స్టాండింగ్ కౌన్సిల్‌ను ఎంతమందిని కొనసాగిస్తున్నారు? గత ప్రభుత్వంలో పనిచేసిన వారికి మళ్లీ ఎంతమందికి.. ఎవరెవరికి పదవులిచ్చారన్న 76 పేజీల నివేదిక, ఇప్పటికే ప్రభుత్వ-హైకోర్టు వర్గాల్లో కలకలం రేపుతోంది. దీనిని తొలుత ‘మహానాడు’ బయటపెట్టిన విషయం తెలిసిందే.
ప్రధానంగా ఓ పెద్దతల పక్కన ఉండే ఓ న్యాయవాది చెవిరెడ్డి, ఇతర నిందితులతో కలుస్తున్నారని, గాలి జనార్దన్‌రెడ్డి ే సులోనూ ఉడత సాయం చేశారన్న చర్చ ఇప్పటికే టీడీపీ న్యాయవాద వర్గాల్లో కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో.. తాజాగా వాసుదేవరెడ్డి వేసిన రెండు పిటిషన్లు విచారణకు వచ్చిన సందర్భంలో ప్రభుత్వ న్యాయవాదులు, వాటిని వ్యతిరేకించి.. తమ వద్ద బలమైన ఆధారాలున్నందున, వాసుదేవరెడ్డి అప్రూవర్‌గా మారాల్సిన పనిలేదంటారా? లేక వాసుదేవరెడ్డి లాయర్ల వాదనను సవాల్ చేయకుండా మౌనంగా ఉంటారా? అన్నదే ఇప్పుడు టీడీపీ న్యాయవాద వర్గాలను ఉత్కంఠకు గురిచేస్తున్న ప్రశ్నలు.
కాగా వాసుదేవరెడ్డిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్న న్యాయవాదులు నాగార్జునరెడ్డి బంధువులేనని, హైదరాబాద్‌లోని పీఎల్ఆర్ ఆఫీసులోనే చాంబరు కూడా ఉందన్న సమాచారం తమ వద్ద ఉందని, టీడీపీ న్యాయవాద వర్గాలు చెప్పడం మరో విశేషం.
ఇదిలాఉండగా లిక్కర్ కేసులో సుప్రీంకోర్టుకు చెందిన ఓ సీనియర్ అడ్వకేట్ పేరు చెప్పి.. ఇక్కడి ప్రభుత్వ పెద్దతలలు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారన్న చర్చ, టీడీపీ న్యాయవాద వర్గాల్లో జరుగుతుండటం విశేషం.
‘ఢిల్లీలో సీనియర్ కౌన్సిల్‌కు ఇది సీఎం చంద్రబాబు పొలిటికల్ డెసిషన్ అని చెబుతున్నారు. ఇక్కడ సీఎంగారికేమో ఢిల్లీ సీనియర్ లాయర్ అలా చెప్పారంటున్నారు. సీఎం గారు ఇవన్నీ నేరుగా మానటరింగ్ చేయరు. మళ్లీ డిల్లీ సీనియర్ కౌన్సిల్‌ను అడగరన్న విషయం తెలుసుకాబట్టే.. చాలాకాలం నుంచి ఓ పెద్దతల సొంత నిర్ణయాలు తీసుకుంటున్నార’’ని టీడీపీకి చెందిన ఓ సీనియర్ న్యాయవాది అసలు గుట్టు విప్పారు. అసలు కోర్టులో లాయర్ కేసు వాదనకు, పోలీసుల దర్యాప్తుకు సంబంధం ఉండదు. లాయర్లు కేసు మాత్రమే వాదించగలరు. కానీ నేరాన్ని నిరూపించేది దర్యాప్తు సంస్థలే. ఇప్పుడు వారినే ఢిల్లీ లాయర్ పేరు చెప్పి ప్రభావితం చేస్తున్నారు. దానితో దర్యాప్తు సంస్థ అధికారులు ముందుకు వెళ్లలేకపోతున్నారని ఆ సీనియర్ న్యాయవాది విశ్లేంచారు.
హైకోర్టు బార్ అసోసియేషన్ ఆఫీసులో లో కమ్మ వర్సెస్ దళిత పంచాయితీ
– సుబ్బారావు సీఎం న్యాయ సలహాదారు అవునా? కాదా? అన్నది తేల్చాలి
వైసీపీ ప్రభుత్వం మారి 13 నెలలవుతున్నప్పటికీ.. ఇప్పటికీ ఆ ప్రభుత్వం నియమించిన పీపీ, ఏజీపీ, జీపీ, స్టాండింగ్ కౌన్సిల్స్నే కొనసాగిస్తున్న ఓ ప్రభుత్వ న్యాయపెద్ద వ్యవహారం, ఇప్పటికే హైకోర్టు న్యాయవాద వర్గాల్లో రచ్చ అవుతోంది. పార్టీకి కాలంలో పనిచేసిన లాయర్లను కాదని, తమను సంతృప్తి పరిచిన వారికి, సీఎంఓ-ఆయన చుట్టూ ఉన్న వారి బంధువులకు స్టాండింగ్ కౌన్సివ్ పదవులిస్తున్న వైనం విమర్శలకు గురవుతోంది.
అదిచాలదన్నట్లు.. సదా ప్రభుత్వ న్యాయపెద్ద కనిపించే ఓ స్టాండింగ్ కౌన్సిల్, తాజాగా బార్ అసోసియేషన్ ఆఫీసులో దళిత లాయర్లను కులం పేరుతో దూషించడం అగ్నికి ఆజ్యం తోడయినట్లయింది. కొద్దిరోజుల క్రితం హైకోర్టు బార్ అసోసియేషన్ ఆఫీసులో దళిత న్యాయవాదులు దుర్గారావు, రవి కుర్చీలో కాలుమీద కాలేసుకుని మాట్లాడుకుంటున్నారు.
అది చూసిన కమ్మ సామాజికవర్గానికి చెందిన స్టాండింగ్ కౌన్సిల్ గుంజుపల్లి సుబ్బారావు హుటాహుటిన వారి వద్దకు వచ్చి, నా ముందే కాలుమీద కాలేసుకుని కూర్చుంటారా అని కులం పేరుతో దూషించి, దాడికి ప్రయత్నించడం.. దానితో వారిద్దరు తోటి దళిత న్యాయవాదులకు ఫోన్ చేస్తే, వారంతా అక్కడకు పెద్ద సంఖ్యలో హాజరుకావడం.. ఈలోగా సుబ్బారావు కూడా సహచర స్టాండింగ్ కౌన్సిల్స్‌ను పిలటంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
సుబ్బారావు కులహంకారానికి నిరసనగా, దళిత న్యాయవాదులు హైకోర్టు ఆవరణలో ధర్నా చేశారు. సుబ్బారావుపై తక్షణం కేసు నమోదు చేసి, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైకోర్టులో కులవివక్ష సమంజసం కాదని, ఒక ప్రభుత్వ పెద్దను చూసుకునే సుబ్బారావు చాలకాలం నుంచి రెచ్చిపోతున్నారని వారు మండిపడ్డారు. హైకోర్టు ప్రాంగణంలోనే ఈ వివాదం జరగడం, టీడీపీ సానుభూతిపరులైన న్యాయవాదులకే రక్షణ లేని పరిస్థితిలో, ఇక భవిష్యత్తులో ఆ పార్టీకి తాను అనుకూలంగా ఎందుకు వ్యవహరిస్తామని ప్రశ్నిస్తున్నారు.
‘‘ ఎప్పుడూ కోర్టుకు రాని, వాయిదాల న్యాయవాదిగా పేరున్న వారిని న్యాయపెద్దలుగా నియమించుకున్న ప్రభుత్వ నిర్ణయం ఎంత తెలివితక్కువన్నది జడ్జిలను అడిగి తెలుసుకోండి. గౌతం సవాంగ్, పీఎస్సార్ ఆంజనేయులును ఇరికించేందుకు అన్ని అవకాశాలున్న ఏపీపీఎస్సీ కేసు విచారణకు సదరు పెద్దమనిషి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఎందుకు హాజరుకావడం లేదో కనుక్కోమనండి. ఇది ఆ కేసులో ఉన్న నిందితులకు పరోక్షంగా సాయం చేసినట్లే కదా?
కేసులకు హాజరుకాకపోతే ఇక ప్రభుత్వం ఆయనకు జీతం ఇచ్చేదెందుకు?ఇప్పుడు హైకోర్టులో ఆయన చుట్టూ ఉన్న ఇలాంటి వాళ్లే మాపై దాడులు చేస్తున్నారు. వాళ్లకు ఎలాంటి ప్రతిభ లేకపోయినా పదవులిస్తున్నారు. అసలు గత ఐదేళ్లలో టీడీపీకి పనిచేసిన న్యాయవాదులకు ఇప్పటివరకూ ఎంతమందికి పదవులిచ్చారు? ఇప్పుడు పదవులిస్తున్న వారిలో గత ఐదేళ్లలో ఎంతమంది పార్టీకి పనిచేశారన్న జాబితా తెప్పించుంటే, ఆ పెద్దమనికి పార్టీకి మేలుచేస్తున్నారా? కీడు చేస్తున్నారా అని ప్రభుత్వానికే అర్ధమవుతుంది. హైకోర్టు చరిత్రలో ఇలా ఎప్పుడూ కులహంకారం ప్రదర్శించలేదు. జగన్ హయాంలో కూడా జరగలేదు. దీనివల్ల టీడీపీకి భవిష్యత్తులో ఎంత నష్టమో వారికి తర్వాత అర్ధమవుతుంద’’ని ఓ దళిత న్యాయవాది స్పష్టం చేశారు.
ఇదిలాఉండగా, తమపై దాడి చేసిన సుబ్బారావు.. తాను సీఎం చంద్రబాబునాయుడుకు న్యాయసలహాదారుడినని ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో, తమకు ఆయన నుంచి రక్షణ కల్పించాలని దళిత న్యాయవాదులు ధర్నాకు దిగారు. సుబ్బారావు సీఎంగారి న్యాయసలహాదారు అవునా? కాదా? అన్నది తేల్చాలని డిమాండ్ చేశారు.
కాగా దళిత న్యాయవాదులపై సుబ్బారావు దాడిని కమ్మ సామాజికవర్గానికి చెందిన లాయర్లు కూడా ఖండిస్తుండటం ప్రస్తావనార్హం. ఇప్పటికే బార్ అసోసియేషన్‌లో ఇలాంటి బేధాలు లేవని, అంతా కలసి ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమంటున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ దీనిపై విచారణ జరిపించి, సుబ్బారావుపై తగిన చర్యలు తీసుకుని, బార్ అసోసియేషన్‌లో దళిత న్యాయవాదులకు రక్షణ కల్పించాలని దళిత న్యాయవాద సంఘం చీఫ్ జస్టిస్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడికి రాసిన లేఖలో పేర్కొంది.