కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఏ కూరగాయ ధర చూసినా ధర ఆకాన్నంటుతున్నది. పట్టణాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లో జరిగే వార సంతల్లో సైతం కూరగాయల ధరలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ధరలు పెరిగాయి.
రూ. 100 తీసుకెళ్తే నాలుగైదు కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు రూ. 500 తీసుకెళ్లినా సంచి నిండడం లేదు. ఆషాఢ మాసంలో పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు తక్కువగా ఉంటాయి. ఈ కాలంలో కూరగాయల ధరలు బాగా తగ్గిపోతాయి.
కానీ, ఈ ఏడాది మాత్రం కూరగాయలు పేద, సామాన్య ప్రజలకు పెనుభారంగా మారాయి. ఏ కూరగాయ, అకుకూరలు చూసినా ధర షాక్ కొడుతున్నది. పొయ్యి మీద వేయకుండానే అంగట్లోనే ఉడికిపోతున్నాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న ధరలు సామాన్యులను బెంబెలేత్తిస్తున్నాయి.
కూరగాయలు కొనేందుకు పట్టణాల్లోని మార్కెట్, గ్రామీణ ప్రాంతాల్లోని వారపు సంతలకు వెళ్లాలంటేనే వినియోగదారులు వణికి పోతున్నారు. టమాట కిలో రూ.15 నుంచి 30లకు లభ్యమయ్యేవి. శనివారం ఎక్కడ చూసినా ధర రూ. 100 నుంచి రూ.120 పైనే ధర పలికింది. పచ్చిమిర్చి, మెంతికూర కూడా కిలో రూ.120 చేరాయి.
అల్లం ఎలిగడ్డ కిలో రూ. 200లకు చేరింది. ఫలితంగా ప్రజలకు ధరాఘాతం తప్పడం లేదు. టమాట, పచ్చిమిర్చితో పాటు ప్రతి కూరగాయ ధర ఆకాశాన్నంటాయి. సాధారణ రోజుల్లో కిలో రూ. 20ల లోపు లభించే క్యారెట్, వంకాయ, బీన్స్, క్యాప్సికం, చిక్కుడు తదితర కూరగాయలు ప్రస్తుతం రూ. 50 నుంచి 80 చేరాయి. కూరగాయలు ధరలే అనుకుంటే కోడిగుడ్డు కూడా ఒకటి రూ. 7కు చేరింది. మార్కెట్, వారాంతపు సంతల్లో ఏ కూరగాయలు కొనాలంటే వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.
డిమాండ్ సరిపడా లోకల్ కూరగాయల అందుబాటులో లేకపోవడం, ఇతర ప్రాంతాల్లో వర్షాలు, కొన్నిచోట్ల ఎండలకు పంటలు దెబ్బతిని ధరలు పెరిగినట్లు తెలిపారు. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో పాటు ఇతర రాష్ర్టాల్లో తుఫాను ప్రభావం కూరగాయల పంటలపై పడింది. ఇతర రాష్ర్టాల నుంచే కాకుండా రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచి కూరగాయల దిగుమతి చేసుకోకపోవడం రవాణా చార్జీలు సైతం ధరల పెరుగుదలకు కారణమంటున్నారు వ్యాపారులు.
మరో నెలరోజుల పాటు కూరగాయల ధరలు తగ్గే అవకాశం లేదంటున్నారు వ్యాపారులు. ధరలు పెరగడంతో ప్రజలు పొదుపు పాటించాల్సి వస్తున్నది. కిలో కొనేవారు పావుకిలో, అరకిలో కొని సరిపెట్టుకుంటున్నారు.