వాషింగ్టన్ డీసీ(అమెరికా): అమెరికా వ్యాప్తంగా ఏడాదిపాటు ఘనంగా నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలపై రూపొందించిన సావనీర్ ను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవిష్కరించారు. ఎన్ఆర్ఐ టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి, గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ఈ సావనీర్ ను రూపొందించారు.
ఈ ఉత్సవాలు భారతదేశానికే పరిమితం కాకుండా అమెరికా వ్యాప్తంగా అత్యంత వైభవోపేతంగా జరిగాయి. బోస్టన్ మహానగరం వేదికగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు 2022 మే 21వ తేదీన ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. 23వ తానా మహాసభల వేదికగా అంగరంగ వైభవంగా జరిగాయి. అమెరికాలో అనేక నగరాల్లో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల మధురానుభూతులను నిక్షిప్తం చేస్తూ ఈ సావనీర్ ను తీసుకురావడాన్ని అభినందించారు.వంశీ కోట, భాను మాగులూరి రూపొందించిన ఎన్టీఆర్ ప్రసంగాలు- పాటల సీడీని కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
తెలుగు జాతికి, భాషకు వన్నె తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్, తెలుగు ప్రజలతో మమేకమై విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకుని తెలుగుజాతి చరిత్రను సుసంపన్నం చేశారని ఈ సందర్భంగా వారు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఏఎస్ రామకృష్ణ, గోరంట్ల పున్నయ్య చౌదరి, సామినేని కోటేశ్వరరావు, ఘంటా పున్నారావు, క్రాంతి ఆలపాటి, రామ్ ప్రకాష్ కోట, కిషోర్ కంచర్ల, కార్తీక్ కోమటి తదితరులు పాల్గొన్నారు.