జన్మభూమిని, కన్నతల్లిని, ఎదుగుదలలో వెన్నంటిన వారిని ఎప్పుడూ మరవొద్దు… ఇది ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తరచూ చెప్పేమాట. అలా చెప్పటమే కాదు చేసి చూపించారాయన. గుంటూరు పర్యటనకు వచ్చిన వెంకయ్య నాయుడు రైలుపేటలోని బిజెపి సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు.. సీనియర్ నాయకురాలు లేటు జూపూడి యజ్ఞ నారాయణ సతీమణి జూపూడి హైమావతి ఇంటికి వెళ్లారు.
జనసంఘ్ వ్యవస్థాపకుల్లో జూపూడి యజ్ఞనారాయణ ఒకరు. ఆయన భార్యే హైమావతి. వెంకయ్యనాయుడు విద్యార్థి నాయకునిగా ఉన్నప్పటి నుంచే యజ్ఞనారాయణ ఇంటికి వచ్చేవారు. అప్పట్లో హైమావతి
ఆయనకు వండిపెట్టేవారు. వెంకయ్యనాయుడుని తన పెద్దకుమారుడిలా చూసుకునేవారు. వివిధ హోదాల్లో వారి ఇంటికి వచ్చారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి హోదాలో వారి ఇంటికి మొదటి సారి వచ్చారు.
మాజీ ఎమ్మెల్సీ జూపూడి యజ్ఞనారాయణ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. జూపూడి హైమావతితో పాటు ఆమె కుమారుడు, తన మిత్రుడైన రంగరాజుతో ఆప్యాయంగా మాట్లాడారు. పాత విషయాలన్నింటినీ గుర్తు చేసుకున్నారు.
తన పెద్దకుమారుడి వంటి వెంకయ్యనాయుడు ఈ స్థాయికి రావటంపట్ల హైమవతి సంతోషం వ్యక్తం చేశారు. ఆయన గురించి మాట్లాడుతూ ఆనందభాష్పాలు కార్చారు. చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చి
ఈ స్థాయికి ఎదిగారని… క్రమశిక్షణతో పాటు మంచి వాగ్దాటే దీనికి కారణమన్నారు. జై ఆంధ్రా ఉద్యమంలో కలిసి పనిచేశామని ఆమె గుర్తు చేసుకున్నారు. అలాగే నెల్లూరు జిల్లాలో తన మీటింగులకు వచ్చి జైకొట్టిన యువకుడు… ఇప్పుడు ఉపరాష్ట్రపతి అయ్యారన్నారు.
వెంకయ్యనాయుడి రాజకీయ ప్రస్తానంలో తన తండ్రి యజ్ఞనారాయణ పాత్ర ఉందని జూపూడి రంగరాజు తెలిపారు. ఆయనకు మొదటగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది యజ్ఞనారాయణేనన్నారు. ఉపరాష్ట్రపతిగా రాజ్యసభను సమర్థంగా నిర్వహిస్తున్న వెంకయ్యనాయుడు… రాష్ట్రపతి కావాలని అభిలషించారు.
ఈకార్యక్రమంలో రంగరాజు కుమారుడు జూపూడి యజ్ఞదత్తు రంగరాజు సతీమణి జూపూడి పద్మావతి కుమార్తెలు అల్లుళ్లు మనవళ్ళు మనవరాళ్లు ఇతర కుటుంబ సభ్యులు మరియు డాక్టర్ మన్నవ రాధాకృష్ణ మూర్తి,మాజేటి ముత్యాలు,వనమా పూర్ణచంద్రరావు,డాక్టర్ మద్ది నాగభూషణం,డాక్టర్ కొండ రవికుమార్,డాక్టర్ గోవిందరాజన్, శివరాం,డాక్టర్ విజయ భాస్కర్,రంగావజ్జుల లక్ష్మీపతి,జమ్ముల శ్యామ్ కిషోర్,పాలపాటి రవికుమార్,ఉయ్యాల శ్యాంవరప్రసాద్,వెలగలేటి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.