Suryaa.co.in

Entertainment

ఇద్దరికీ పదహారే!

వేటగాడు..1979..

ఈ సినిమాలో నాయికగా
శ్రీదేవిని అనుకున్నాం..
నటరత్నకు కాస్త బెదురుగా
చెప్పిన దర్శకేంద్రుడు..

గుడ్ బ్రదర్..
బడిపంతులులో పిల్లేగా..
ఎన్టీఆర్ ఓకే..
ఇంకా రాఘవేంద్రరావు
బెరకుగా అక్కడే..
ఇంకేంటి బ్రదర్..
చెప్పండి..
షూటింగ్ ఎప్పటి నుంచి..

కోవెలమూడి..తొట్రుపాటు..
సార్..ఆ అమ్మాయి శ్రీదేవికి
పదహారేళ్లు..
పెగిలిన నోరు..

అయితే ఏంటి బ్రదర్..
మనకీ పదహారేగా..
అది డాబు కాదు
పేలిన బాంబు..!

అదీ ఎన్టీఆర్ స్టామినా..
ఆయన ఎరీనా..
అది ఒక నమూనా..!

ఆ మాటనే నిలబెట్టుకుంటూ
శ్రీదేవితో సమానంగా..
కొండొకచో మరింత చలాకీగా
స్టెప్పులేసిన రామారావు..

ఆకు చాటు పిందె తడిసె..
కోక మాటు పిల్ల తడిసె..
ఆకాశ గంగొచ్చింది..
అందాలు ముంచెత్తింది..

తలపై కౌబాయ్ టోపీ..
బెల్బాటం ఫ్యాంటు..
కోటు,.అదిరిపోయిన అన్న..

తెల్ల చీరలో మెరిసిన
పదహారేళ్ళ వయసు
ఆ సొగసు..
తుళ్లిపడింది కుర్రకారు మనసు..
ఎవరిని ఎలా చూపించాలో
దర్శకేంద్రుడికే తెలుసు..!
నీటి గుంతలోకి
గుంటతో కలిసి ఓ గంతు..
వేటగాడు రాజా..
సినిమా బ్యాండ్ బాజా!!

జాబిలితో చెప్పనా..
జాము రాతిరి నిదురలోన
నీవు చేసిన అల్లరి..
పాటల వల్లరి..
శ్రీదేవితో జిమ్మిక్కులు
పుట్టింటోళ్లు తరిమేశారు
కట్టుకున్నోడు వదిలేశాడు..
జయమాలినితో తైతక్కలు..
నందమూరి జోరు..
చక్రవర్తి హోరు..
స్వరాల సెలయేరు..
సలీం స్టైల్లో సీన్ సితారు..!

జంద్యాల పదాల విన్యాసం
ప్రాసలతో రావు గోపాలరావు
వీరవిహారం..
గుక్క తిప్పుకోకుండా డైలాగులు..మాబాగులు..
ఇప్పుడైతే నిండిపోయే
మన బ్లాగులు!

ఏ రోజూ రాని రోజా ఈరోజు
వస్తుందన్న వార్త వస్తే కాజా తిన్నట్టు సంతోషించి మేజాబల్ల ఎక్కి కూర్చోక
వీపున బాజా మోగినట్టు
బాధ పడతావేమిరా మేధావి!

ఇదంతా ఓ ప్రవాహం..
సంభాషణలు కావవి
అభిభాషణలు..
పిచ్చెక్కించిన
నటభూషణులు..
రావు గోపాలరావు..
టాప్ టు బాటం మ్యాచింగ్
కైకాల మధ్య
జంధ్యాల మ్యూజింగ్స్..!

వేటగాడు..
ఓ సంచలనం..
అంతకు మునుపు
అడవిరాముడుతో
మొదలైన నటరత్న.. దర్శకేంద్రుడి కాంబినేషన్
ఓ పరంపర..
నందమూరి చివరి సినిమా
వరకు..అదే చురుకు..
సరిగంగ స్నానాలే..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE