నేడు ఉపరాష్ట్రపతి ఎన్నిక. రాష్ట్రపతి తర్వాత స్థానం ఉపరాష్ట్రపతి. కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలకు తన వ్యవహార శైలి రుచించలేదన్న సంకేతం అందగానే జగదీప్ ధంకర్ స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఉపఎన్నిక జరుగుతున్నది. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ) ప్రతిపాదించిన సి.పి. రాధాకృష్ణన్, ప్రతిపక్ష పార్టీలు ప్రతిపాదించిన జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిల మధ్య ఎన్నికకు రంగం సిద్ధమయ్యింది. ఈ ఎన్నికల్లో లోక్ సభ, రాజ్యసభ సభ్యులకే ఓటు హక్కు ఉన్నది. వారిని ఆకర్షించడానికి మాత్రమే ఎన్నికల ప్రచారం పరిమితం కాలేదు. అభ్యర్థులు, వారి మద్దతుదారులు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో స్పష్టమైన తేడా కనిపించింది.
ఎన్డీఏ తన అభ్యర్థిగా ఆర్.ఎస్.ఎస్., బీజేపీ మూలాలున్న తమిళనాడుకు చెందిన, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సి.పి. రాధాకృష్ణన్ ని ఎన్నికల బరిలో నిలిపింది. దక్షిణాదిలో బలహీనంగా ఉన్న బీజేపీ తన బలాన్ని పెంచుకోవాలన్న అభిలాషతో రాధాకృష్ణన్ ని అభ్యర్థిగా ఎంపిక చేసుకున్నదనడంలో నిస్సందేహం. సల్వా జుడుంకు వ్యతిరేకంగా 2011లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉద్దేశపూర్వకంగానే వక్రీకరించి, జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి నక్షలైట్స్ అనుకూలురన్న భావన ధ్వనించేలా వ్యాఖ్య చేశారు. తద్వారా రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంకుచిత రాజకీయ, భావజాల రంగు పులిమారు. అభ్యర్థిగా ఉన్న రాధాకృష్ణన్ మాత్రం ఎన్నికల ప్రచారంలో ఎక్కడా ఒక్క మాట మాట్లాడినట్లు లేదు.
జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి చురుకుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. భారత రాజ్యాంగం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతాంశంగా దేశం ముందు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా చర్చకు పెట్టారు. కానీ, ప్రత్యర్థి వైపు నుండి స్పందన కరువైయ్యింది. అలా విభిన్న రాజకీయ దృక్పథాలు, తాత్విక చింతనల నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. పార్టీల అనుబంధాలకు అతీతంగా ఎంపీలు మనస్సాక్షితో ఓటు వేయాలని జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి పార్లమెంటు సభ్యులు సానుకూలంగా స్పందించే ప్రజాస్వామిక వాతావరణం లేదు.
లోక్సభ, రాజ్యసభ సభ్యుల మొత్తం సంఖ్యలో ఎన్డీఏ కూటమికి ఆధిక్యత ఉన్నది. రాధాకృష్ణన్ విజయం నల్లేరు మీద నడకే కావచ్చు. కానీ, దేశ ప్రజలు మాత్రం జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచార వేదికల్లో ప్రస్తావించిన అంశాలపై దృష్టిసారించి, అప్రమత్తంగా వ్యవహరిస్తూ, రాజ్యాంగ విలువలను పరిరక్షించుకోకపోతే దేశ భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతుంది.
– టి. లక్ష్మీనారాయణ.