– అర్ధరాత్రి యువకులను దారి మళ్లించి ఏడిపించిన వింత ఆకారం
– భయంతో బేజారైన యువకులు
– మచిలీపట్నం రూరల్ ప్రాంతంలో వైరల్ అవుతున్న వీడియో
(ఎన్. జాన్సన్ జాకబ్, మచిలీపట్నం)
సరిగ్గా మూడు రోజుల క్రితం.. సరిగ్గా అమావాస్య రోజున మచిలీపట్నానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామానికి చెందిన నల్గురు కుర్రోళ్ళు రెండు బైక్ ల మీద బందరు వెళ్లారు. తమ మిత్రుల వద్ద ఐ పి ఎల్ క్రికెట్ మ్యాచ్ పొద్దు పోయేవరకు చూశారు.
తాము పందెం కట్టిన క్రికెట్ జట్టు మ్యాచ్ గెలవడంతో తామే ఆ మ్యాచ్ గెలిచినట్లు ఎంతో సంబరపడ్డారు.. ఆ విజయంతో సమీప రెస్టారెంట్లో గొంతువరకు బిర్యానీలు తిని, ఆపై బీర్లు తాగి కేరింతలు కొట్టారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ నలుగురు తమ ఊరికి మోటార్ సైకిళ్ళ మీద తిరుగు ప్రయాణమయ్యారు.
కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక యువతీ రోడ్డు పక్కన నుంచొని ఉంది. తాను ఇంటికి వెళ్లడం ఆలస్యమైందని, ఆటోలు బస్సులు దొరకపోవడంతో ఇలా రోడ్డుపై నిలిచిపోయినట్లు తెలిపింది. తనను బండిమీద లిఫ్ట్ ఇవ్వాల్సిందిగా కోరింది. ఆపదలో ఉన్న అమ్మాయిని రక్షించి హీరోఇజం ప్రదర్శించాలని ఆలోచన పుట్టుకొచ్చింది.
తాను చెప్పిన చోటు దించాలని ఆ ఆ యువతి గోముగా అభ్యర్ధించింది. దీంతో ఒక బైక్ పై ఎక్కించుకొని ఆమె చెప్పిన దారిలో దించేందుకు రెండు బైకులపై ఐదుగురు ప్రయాణించారు. వారు వెళుతున్న దారిలో వింత శబ్దాలతో చెట్ల
కొమ్మలు ఊగటం, ఎండిపోయిన ఆకులు నలిగిపోయినట్లు గలగల శబ్దాలు వింత వింత చప్పుళ్ళు రావటం వంటివి ఆ యువకులు గమనించారు.
ఆ రోజు అమావాస్య అన్న సంగతి మరిచిన యువకులు.. నిర్భీతిగా తాము ఎరగని ప్రాంతానికి వెళ్ళిపోతూనే ఉన్నారు.. ఒక్కసారిగా తమ బైకు వెనుక కూర్చొని యువతీ ఆకస్మికంగా అదృశ్యమైంది. ఆ సంగతి గ్రహించిన యువకులు భయంతో గజ గజ వణికిపోతూ, తమ ఊరికి ఎటు వెళ్ళాలో తెలియక తికమకపడుతున్నవారికి ..సరిగ్గా తమ ముందు 20 మీటర్ల దూరంలో తెల్లని దుస్తులతో జుట్టు విరబోసుకొని తమతో ప్రయాణించిన అమ్మాయి ఎదురుగ నుంచొని ఎటువెళ్ళాలో చేతితో దారి చూపిస్తూ సైగ చేయడం గమనించారు.
ఆ నల్గురు యువకులు ఆమె చూపిన దారిలో జిల్లెడు చెట్లు దట్టంగా పెరిగిన డొంక దారిలో ద్విచక్రవాహనాలను ఎటు తీసుకువెళుతున్నామో తెలియని పరిస్థితిలో ఆ దారిలో వేగంగా పరుగులు పెట్టించారు. కొద్ది దూరం వెళ్లేసరికి తమ ఎదురుగా అదే యువతీ ఆకారం మళ్ళీ ఒక్కసారిగా కనబడింది. ఆ రూపాన్ని చూసి కుర్రోళ్ళు విపరీతమైన భయబ్రాంతులకు గురయ్యారు. ఆ తెల్లని ఆకారం చేసే వింత చేష్టలను కంగారు పడుతూనే ఒక యువకుడు దైర్యం చేసి తన మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేయడం ప్రారంభించాడు.కనీసం జరిగింది ఏమిటో తమపెద్దవారికి తెలియచేయాలని ఆ నిర్ణయం తీసుకొన్నాడు.
బైకులను ఎంత వేగంగా నడుపుతున్నప్పటికీ తమ గ్రామానికి వెళ్లే దారి కనబడలేదు. ఒక చెట్లతోపు కనబడటంతో తమ బండ్లు దిగారు. వెనువెంటనే మళ్ళీ తెల్లని దుస్తులు ధరించిన యువతీ ప్రత్యక్షం కావడంతో నల్గురు కుర్రోళ్ళు బీతిల్లిపోయారు. తమ ముందు ఆ ఆకారం చెట్ల కొమ్మలపై ఎక్కి కిందకు దూకుతూ వింత విన్యాసాలు చేయసాగింది. ఒకరిద్దరు యువకులు దైర్యం చేసి ఆ యువతి ముందుకు వెళ్లబోయారు, ఆ యు ఆకారం ఏదో వింత శబ్దాలు చేస్తూ, విపరీతంగా భయపెట్టే యత్నం చేయసాగింది.
దీంతో తెగించిన ఆ యువకులు తమ బైకులు ఎక్కి ఎటువెళుతున్నామో తెలియకుండా కొద్ది దూరం వేగంగా ప్రయాణించేసరికి ఒక తారు రోడ్డు కనబడింది. బతుకుజీవుడా అనుకొంటూ వేగంగా బైకులను పరుగులు పెట్టించారు..
మళ్ళీ ఓ వింత ఆకారం వెనక్కి తిరిగి పరుగెడుతూ.. బైకు ల ముందు మళ్ళీ కనబడటంతో ఆ యువకులు ఒక్కసారిగా భయంతో హడలిపోయారు. ఇంతకు ముందు వీడియో తీసిన యువకుడు..తమను చంపేసి పరిస్థితుల్లో తాము ఎలా చనిపోయామో అనే ఆధారం తమ వాళ్లకు కనీసం దొరకాలని ఉద్దేశ్యంతో మళ్ళీ మొబైల్ ఫోన్ తీసి రికార్డింగ్ మొదలుపెట్టాడు.. కీచు శబ్దంతో ఆ ఆకారం ఏదో తమకు చెప్పాలని ప్రయత్నిస్తుందని వారు అంతా గ్రహించారు.
తమతో కొద్ది దూరం వచ్చి మాయమైంది ఆ ఆకారం. సరిగ్గా అప్పుడు సమయం 3 గంటలు అయ్యింది. బ్రహ్మ సమయం ప్రవేశించడంతో ఆ వింత ఆకారం కనబడలేదని గ్రహించారు. ఎలాగోలా వూర్లోకి వచ్చి ఎవరి ఇంటికి వెళ్లిపోయారు. మధ్యాహ్నం మళ్ళీ కలుసుకున్న ఆ నలుగురు మిత్రులు గత రాత్రికి తమకు జరిగిన భయంకర అనుభవం గుర్తు చేసుకొన్నారు.
గత రాత్రి తమకు జరిగిన అనుభవాన్ని వీడియో తీసిన యువకుడి మొబైల్ లో ఆ వీడియోలు చూసి షాక్ కు గురయ్యారు. గతరాత్రి చివరిగా తమ బైకు ముందు వెనక్కి తిరిగి పరుగెడుతూ చెప్పిన మాటలు ఆ యువకులు శ్రద్దగా విన్నారు ” చదువుకొనే వయస్సులో చదువుకొండ్రా..క్రికెట్ బెట్టింగులు.. సినిమా పిచ్చితో జీవితాలను నాశనం చేసుకోమాకండిరా..దెయ్యాలుగా మారుతారురా… చచ్చిపోయిన తర్వాత దెయ్యాలుగా మారుతారురా..మా లాగా ” అంటూ ఆ వింత ఆకారం చెప్పిన సందేశం విని ఆశ్చర్యపోయారు.
గత రాత్రి తాము ఎటువైపు వెళ్ళామో తెలుసుకొనే ప్రయత్నం చేద్దామని కొందరు అంటే..ఏదో మన మీద జాలిపడి ఆ దెయ్యం వదిలిపెట్టింది మరోసారి అటువైపు వెళితే ఖచ్చితంగా ప్రాణాలు పోతాయంటూ మరో ఇద్దరు గట్టిగా వాదించారు. మార్చి 31 వ తేదీ సాయంత్రం గ్రామంలో కొందరికి అంతకు ముందు రోజు జరిగిన అనుభవాన్ని చెప్పారు అంతే, మంగళవారం ఉదయం తమ గ్రామమే కాదు మొత్తం మచిలీపట్నం మండలం మొత్తం గుప్పుమంది.
ఎక్కడ చూసినా నల్గురు యువకులకు ఎదురైనా వింత అనుభవాన్ని చర్చించుకొంటున్నారు. యువకులు దైర్యం చేసి తీసిన వీడియో క్షణాల్లో వందల షేర్లు అయ్యాయి.పని పాట లేకుండా మచిలీపట్నం వెళ్లి గాలి వేషాలు వేసి అర్ధరాత్రి ఇంటికి చేరుకొనే పలువురిని వారి పెద్దలు ఆ వీడియో చూపి నిలువరించే ప్రయత్నం మొదలుపెట్టారు. నీతి చెప్పే దెయ్యం నిండు ప్రాణాలను ఎలా తీస్తుందిలే అంటూ కొందరు మొండి దైర్యంతో కూడిన వాదన మొదలుపెట్టారు.
సరిగ్గా ఒక గంట గడిచేసరికి గ్రామంలో కలకలం మొదలైంది. నల్గురు కుర్రోళ్ళు గ్రామంలో ఒక్కసారిగా ” ఏప్రిల్ ఫూల్స్ ..ఏప్రిల్ ఫూల్స్ ” అంటూ బిగ్గరగా కేకలు పెడుతుంటే.. ఆ గ్రామస్తులకు నవ్వాలో ఏడవాలో తెలియని అయోమయ పరిస్థితీ ఏర్పడింది. అలాగే దెయ్యాలుగా తమ ఫ్రెండ్స్ బాగా నటించారు కదా అని పలువురి వద్ద ఆ నలుగురు కుర్రాళ్ళు అనడంతో గ్రామస్తుల కోపం కట్టలు తెంచుకొంది.
నిజంగా వీళ్ళకి ఏదైనా ఆపద వచ్చినా పట్టించుకోకూడదు అని కసురుకొన్నారు.ఈ తరం కుర్రోళ్ళు మహా వెర్రోళ్ళు అని నిర్ణయించుకొని చేసేదేమీ లేక సరిపెట్టుకున్నారు.