– రిటైరయిన అధికారికి ఐదు జిల్లాల బాధ్యతలట
– ఇక అర్హులైన సర్వీసు అధికారులకు దిక్కెవరు?
– అయిన వారికి ఆకుల్లో.. కానివారికి కంచాల్లోనా?
-13 జిల్లాల్లో 8 జిల్లాల విజిలెన్స్ అధికారులు వెలమలేనట
– శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, అనకాపల్లి, రాజమండ్రి జిల్లాలకు మంత్రి అచ్చెన్న సోదరుడు ఇన్చార్జి
– ఏలూరు,ప్రకాశం, నెల్లూరు జిల్లాలకూ వెలమ అధికారులే ఇనార్జులట
– ఉత్తరాంధ్రలో కీలక హోదాల్లో వెలమల హవా
– ఉత్తరాంధ్రలో కింజరాపు కుటుంబ హవా
– ఉత్తరాంధ్రలో ఉడుకుతున్న తూర్పు కాపు, కళింగ, గవరలు
– త్వర లో కులాల వారీ వివరాలతో కూడిన జాబితా విడుదలకు సిద్దమవుతున్న వైనం
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీ విజిలెన్స్‌లో అయిన వారికి ఆకుల్లో.. కానివారికి కంచాల్లో అన్న సూత్రం విజయవంతంగా నడుస్తోంది. ఒకే కులానికి చెందిన వారిని అందలమెక్కిస్తున్న వైనం మిగిలిన బీసీ కులాల వ్యతిరేకతకు కారణమవుతోంది.
అవినీతిపరులు-అక్రమార్కుల భరతం పట్టే విజిలెన్స్ విభాగం.. ఇప్పుడు వసూళ్లరాజ్యంగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత పదిహేనేళ్ల కాలంలో తొలిసారిగా వెల్లువెత్తుతున్న ఇలాంటి ఆరోపణలకు.. ఇటీవల జరిగిన ఓ బంగారం దందా ఘటన పరాకాష్ఠగా నిలిచింది.‘ పై వారి’ ఆశీస్సులతో మూడు పువ్వులు -ఆరు కాయలుగా వర్దిల్లుతున్న విజిలె న్సు అవినీతి, జడలు విచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది.
తాజాగా రాజమండ్రి జిల్లా విజిలెన్స్ ఇన్చార్జి (ఎఫ్ఏసీ)గా కింజరాపు ప్రభాకర్‌ను నియమిస్తూ విజిలెన్సు డీజీ 29-3-2026న ఉత్తర్వులు జారీ చేశారు. మామూలుగా అయితే ఇది పెద్ద వార్తేమీ కాదు. అందులో పెద్ద వింత కూడా కాదు. కానీ ఇప్పటికే రిటైరయిన సదరు అధికారికి ఇది ఐదవ అదనపు బాధ్యత! అందుకే ఈ వివాదాలు, విమర్శలూ!
మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడు, కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు బాబాయ్ అయిన కె.ప్రభాకర్ కూటమి ప్రభుత్వంలో డీఎస్పీగా రిటైరయ్యారు. అయితే రిటైర్మెంట్కు ముందురోజే ఆయనకు సర్కారు వెసులుబాటు కల్పించింది. దానితోపాటు అలా రిటైరయ్యారో లేదో వెంటనే విజిలెన్సులో నియమించింది. అది కూడా ఫర్వాలేదు.
కానీ మరెవరూ లేనట్లు.. శ్రీకాకుళం-విజయనగరం, విశాఖ-అనకాపల్లి జిల్లాలకు ఇన్చార్జి (ఫుల్ అడిషనల్ చార్జి)గా నియమించారు. అవి సరిపోనట్లు.. మళ్లీ తాజాగా అదే సారుకు రాజమహేంద్రవరం జిల్లా విజిలెన్స్ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం విమర్శలకు గురవుతోంది.
దీనివల్ల సర్వీసులో ఉన్న అర్హులైన అధికారులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. విజిలెన్స్‌లో అడిగేవాడు లేకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాల్లో అయితే విజిలెన్సు అధికారుల అవినీతికి అడ్డూ అదుపు లేకుండా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా రాజధాని జిల్లాలో విజిలెన్సు అధికారుల దందా, హద్దులు దాటుతోందన్న ఆరోపణలు పోలీసు శాఖలోనే ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా వెలమ సామాజికవర్గానికి చెందిన అధికారులకు పెద్దపీట వేయడాన్ని తూర్పు కాపు-కాళింగ-గవర-మత్స్యకార-యాదవ కులాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఉత్తరాంధ్రలో ఒక్క విజిలెన్సు విభాగంలోనే కాకుండా, మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి పోస్టింగులన్నీ వెలమ వర్గానికే కట్టబెడుతున్నారన్న అసంతృప్తి మిగిలిన బీసీ కులాల్లో భగ్గుమంటోంది.
ఏలూరు, ప్రకాశం-నెల్లూరు జిల్లా విజిలెన్స్ అధికారులను కూడా వెలమలనే నియమించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో 8 జిల్లాలు వెలమ అధికారులకే అప్పగించడం ఏమిటన్న ప్రశ్నలు ఇతర బీసీ కులాల నుంచి వినిపిస్తున్నాయి.
ప్రధానంగా ఎక్కువ సంఖ్యాబలం-ప్రభావం ఉన్న తూర్పు కాపులు గత రెండేళ్ల నుంచి జరుగుతున్న ఈ ఒంటెత్తు పోకడలపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆ మేర కు జరుగుతున్న కుల సమావేశాల్లో పాల్గొంటున్న కాపు ఎమ్మెల్యేలు-ఇతర ప్రజాప్రతినిధులను ఈ పక్షపాతంపై నిలదీస్తున్నారు. ఫలితంగా వారికి జవాబు చెప్పలేని నిస్సహాయ పరిస్థితిలో ఉంటున్నారు. ఇప్పడికే రాజకీయంగా అనాధగా మారిన తమను చివరకు ప్రభుత్వ పదవుల్లో కూడా అణచివేస్తున్నారని తూర్పు కాపు-కాళింగ కుల సంఘాలు విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ-జనసేనకు గట్టి మద్దతుదారులైన తూర్పు కాపులు తాజా పరిణాలపై ఉడికిపోతున్నారు.
ముఖ్యంగా కింజరాపు కుటుంబ సిఫార్సులే ఉత్తరాంధ్రలో చెల్లుబాటవుతున్నాయని, ఎవరయినా అధికారి రిటైరయినా- బదిలీ అయినా.. వారి స్థానాలను వెలమ వర్గ అధికారులతో నింపేస్తున్నారని విరుచుకుపడుతున్నారు. బాబాయ్-అబ్బాయ్ పలుకుబడితో.. ఉత్తరాంధ్రను వెలమల మయం చేస్తున్నారని, తాజాగా ప్రభాకర్‌కు ఇచ్చిన ఉత్తర్వే ఉదాహరణ అని మిగిలిన బీసీలు తమ వాదనకు మద్దతుగా వినిపిస్తున్నారు.
ఎంతోమంది సర్వీసులో ఉన్న అధికారులు ఉండగా వారిని పక్కనపెట్టి, మంత్రి సోదరుడికే ఐదవ బాధ్యత అప్పచెప్పడం ఏమిటి? ఇలాంటి వెసులుబాటు విజిలెన్సు డీజీ గారు, మిగిలిన కులాలకు చెందిన అధికారులకూ ఇస్తారా? లేక ఈ వెసులుబాటు కేవలం వెలమలకేనా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి తూర్పు కాపు-కాళింగ కులాలకు చెందిన వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో కులపరమైన చర్చ నడుస్తుండటం గమనార్హం.
కాగా గత రెండేళ్లలో ఉత్తరాంధ్రలో ఏ కులానికి ఎన్ని పోస్టింగులు ఇచ్చారు? అందులో వెలమలకు ఎన్ని ఇచ్చారు అన్న వివరాలతో కూడిన జాబితాను, సోషల్‌మీడియాకు విడుదల చేసేందుకు మిగిలిన బీసీ కులాలు సిద్దమవుతున్నట్లు సమాచారం.
అవినీతి శేఖరుల హవా
ఇక అవినీతి-అక్రమార్కులను పట్టుకునే విజిలెన్సు యంత్రాంగం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా రాజధాని జిల్లాలో క్వారీ, మైనింగ్- రేషన్ మాఫియా నుంచి.. మాచర్ల వైపు వెళ్లే చెక్‌పోస్టుల వద్ద విజిలెన్సు అధికారులు, భారీ స్థాయిలో ముడుపులు పిండేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బిల్లులు ఉన్న లారీలను పోలీసుస్టేషన్ల వద్దకు, బిల్లులు లేని వాహనాలను సరిహద్దు దాటిస్తున్నారన్న ఆరోపణలపై బహిరంగంగానే చర్చ జరుగుతోంది.
ప్రధానంగా ఒక కీలక అధికారి ఆశీస్సులు పుష్కలంగా ఉన్న అవినీతి శేఖరులు.. జిల్లా స్థాయి అధికారులను కూడా లెక్క చేయకుండా, సొంత దుకాణం పెట్టేశారన్న చర్చ పోలీసు శాఖలో నడుస్తుండటం గమనార్హం. చివరకు ప్రజాప్రతినిధులు చెప్పినా ఖాతరు చేయకుండా, ముడుపులు చెల్లించిన వారిని మాత్రమే వదిలేస్తున్నారన్న విమర్శలు టీడీపీ వర్గాల నుంచి వెల్లువెత్తడమే ఆశ్చర్యం. ప్రధానంగా మాచర్ల వైపు మైనింగ్, ఇసుక, రేషన్ తీసుకువెళ్లే వాహనాలకు.. గత వైసీపీ సర్కారులో వసూలుచేసిన దాని ంటే ఎక్కువ మూమూళ్లు వసూలు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది.
వైసీపీ హయాంలో కీలకమైన పట్టణంలో నాటి వైసీపీ ఎమ్మెల్యే సిపార్సుతో సీఐగా చేసి, నాటి విపక్ష నేత చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా కామెంట్లు చేసిన వైనం.. అప్పట్లో సోషల్‌మీడియాలో హాట్ టాపిక్ అయిందన్న విషయం తెలిసిందే.
ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఒక సామాజికవర్గ దన్నుతో, కీలకమైన విజిలెన్సులో పోస్టింగు దక్కించుకున్నారని టీడీపీ నాయకులే చెబుతున్నారు. ముందు బెదిరింపులకు దిగే ఈ అవినీతి శేఖరులు, తర్వాత సర్దుబాటు చేసుకుంటారన్న పేరు కూడా ఉందట. ఈయనకు ఒక ఎమ్మెల్సీ మద్దతు కూడా ఉందన్న ప్రచారం జరుగుతోంది.
కొద్దిరోజుల క్రితం తెనాలిలో ఒక మార్వాడీ బిల్లులు లేకుండా బంగారం వ్యాపారం చేస్తున్నారన్న సమాచారం వచ్చింది. అయితే నిజానికి చెన్నై నుంచి తీసుకువచ్చే బంగారాన్ని ఇతర షాపులకు అమ్మి, వారి నుంచి నగదు తీసుకుంటారు. ఆ క్రమంలో తనకు డబ్బులు ఇవ్వని షాపులపై సదరు వ్యాపారి ఒక కీలక అధికారికి ఫిర్యాదు చేశారట. రి వరీ చేస్తే తృణమో ఫలమో సమర్పించుకుంటానని చెప్పారట. తర్వాత రికవరీ చేసిన దాంట్లో , 2 కిలోల బంగారాన్ని పైవారికీ ఇవ్వాలంటూ అవినీతి శేఖరులు తీసుకున్నారన్న చర్చ తెనాలి బంగారు నగర వ్యాపార వర్గాల్లో జరుగుతోంది.
కాగా ఇలాంటి వారికి ఒక కీలక అధికారి దన్ను ఉందని.. ఆయన అండ చూసుకునే సదరు కింద స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులను బేఖాతరు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా తాజాగా జరిగిన విజిలెన్సు అధికారుల బదిలీల్లో, ఇలాంటి వసూల్‌రాజాల పేర్లు లేకపోవడం ఈ విమర్శలకు మరింత బలం చేకూరుతోంది.
