– డిసెంబర్ నుంచి కార్యకలాపాలు?
-రాష్ట్ర సమస్యలపై గళం విప్పే ప్రణాళిక
— సామాజిక అంశాలను గుర్తించేందుకు యంత్రాంగం ఏర్పాటు
– ప్రజలను కలిసేందుకు రూట్ మ్యాప్ సిద్ధం?
– బీసీ పార్టీ అధినేతతో కలసి అడుగులు
– తర్వాత కొత్త పార్టీకి శ్రీకారం
– రెడ్డి వర్గాన్ని ఆకర్షించే వ్యూహం?
– సమర్థులైన సీనియర్లతో వరస మంతనాలు?
– ఈలోగా ఒక చానెల్, 20 యూట్యూబ్ ఛానెళ్ల ఏర్పాటు?
– మళ్లీ ప్రజాజీవితంలోకి విజయసాయిరెడ్డి?
( మార్తి సుబ్రహ్మణ్యం)
జగన్ జమానాలో చాలాకాలం నెంబర్ టూగా ఒక వెలుగు వెలిగి.. అధికారం కోల్పోయిన తర్వాత ఆయనకు దూరమై, తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎంపి విజయసాయిరెడ్డి మళ్లీ ప్రజాజీవితంలోకి రానున్నారా ? ఆ మేరకు ముందడుగుగా ఫోరం ఏర్పాటు చేయనున్నారా? ఆ తర్వాత రాజకీయ పార్టీకి ప్రాణం పోయనున్నారా?.. తాజాగా ఆయన వ్యవహారశైలి, సీనియర్లతో ఆయన చర్చల తీరు ఈ అనుమానాలనే తెరపైకి తెస్తున్నాయి. ఒకప్పటి జగన్ సన్నిహితుడయిన, మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి.. తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
ఆమేరకు ఆయన తగిన ప్రణాళిక రూపొందించుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. విజయసాయిరెడ్డి గత కొద్దిరోజుల నుంచి వైసీపీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ మాజీ నేతలు, ప్రజల్లో ఇమేజ్ ఉన్న నేతలు, జిల్లాల్లో ప్రభావితం చేసే నాయకులతో బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ మీటింగులు నిర్వహిస్తున్నారు. వీరుకాక.. వివిధ రంగాల్లో ప్రముఖులైన వారి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. డిసెంబర్ లో తాను ప్రారంభించనున్న ఫోరం లో చేరాలని, ఆయన ఈ సందర్భంగా వారికి సూచిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి పోరాడటమే తన ఫోరం లక్ష్యమని ఆయన వారికి వివరిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందని, దానిని ఫోరం భర్తీ చేస్తుందని వారికి చెబుతున్నారు. ఫోరం ఏర్పాటుకు ముందే ఆయన రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారట.
“జిల్లా, నియోజకవర్గాలను ప్రభావితం చేయగల మీరంతా నాతో ఉంటే మనం అనుకున్నది సాధించవచ్చు. మీకు రాజకీయ అనుభవం ఎక్కువ. ప్రజల నాడి మీకే ఎక్కువ తెలుసు. కాబట్టి మీరే జిల్లా బాధ్యతలు తీసుకోండి” అని విజయసాయి, తాను కలిసిన నాయకులకు చెబుతున్నారు. కాగా ఫోరం ఏర్పాటు చేసిన తర్వాత.. రాజకీయ పార్టీ ప్రారంభించే ప్రణాళికతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రాష్ట్రంలో రెడ్డి వర్గాన్ని ఆకర్షించే వ్యూహంతో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందులో బీజేపీ ఆశీస్సులున్న ఒక బీసీ పార్టీ అధినేత కూడా విజయసాయితో కలసి అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.
కాగా ఫోరం ఏర్పాటు.. రాజకీయ పార్టీ ఏర్పాటు మధ్యకాలంలో ఒక టీవీ చానెల్, 20 యూట్యూబ్ చానెళ్లు ఏర్పాటుచేసేందుకు విజయసాయిరెడ్డి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. నిజానికి ఆయన గతంలోనే తాను టీవీ చానెల్ తీసుకుంటానని ప్రకటించిన ప్పటికీ, అది ఇప్పటికీ పూర్తి కాలేదు. అయితే మధ్యలో నష్టాల్లో ఉన్న కొన్ని చానెళ్ల యాజమాన్యాలతో మాట్లాడినప్పటికీ, అది వర్కవుట్ కాలేదని సమాచారం. కానీ ఇప్పుడు దానిపై సీరియస్ గా దృష్టి సారించారని, దానికంటే ముందు డిజిటల్ మీడియా, 20 యూట్యూబ్ చానెళ్లు ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికోసం ఒక ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటుచేసేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ‘మనం మీడియా-డిజిటల్ మీడియాలోకి వస్తున్నాం. కాబట్టి మీకేమీ భయం లేదు.
దానికోసం మనం భారీగా ఖర్చు పెట్టబోతున్నాం. ఇప్పుడు సోషల్మీడియా యుగం. దాన్ని మనం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటాం. అది మీకు రాజకీయంగా ఉపయోగపడుతుంది’ అని సీనియర్ నాయకులకు స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా తాను వైసీపీ అధికారంలో ఉండగా చేయలేని పనులను, నిజాయితీగా అంగీకరించాలని విజయసాయి నిర్ణయించుకున్నారు. ఇటీవల ఆయన జిల్లా పర్యటనకు వెళ్లిన సందర్భంగా.. కర్నూలు జిల్లాకు నర్శింహారెడ్డి పేరు పెట్టాలని సూచించారు. దానికి స్పందించిన మీడియా.. మీరు అధికారంలో ఉండగా ఆ పేరు ఎందుకు పెట్టాలని డిమాండ్ చేయలేదు అని ప్రశ్నించింది. ‘నిజమే. అప్పుడే అడగాల్సింది. అడగలేదు. తప్పయిపోయింది. అప్పుడు ఆ ఆలోచన రాలేదు’ అని విజయసాయిరెడ్డి అంగీకరించడం ప్రస్తావనార్హం. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఏర్పాటుచేయనున్న ఫోరం.. కొత్త రాజకీయ పార్టీతో, వైసీపీకి ఎంతవరకూ నష్టమన్నది చూడాలి.