ఏపీ ముఖ్యమంత్రిని ఉత్తర కొరియా నియంతతో పోల్చిన చంద్రబాబుకు మతి చెడలేదు కదా!
మూడు సంవత్సరాల 3 నెలల క్రితం రాజ్యాంగబద్ధంగా జరిగిన ఎన్నికల్లో గెలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతగా ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ తో పోల్చారు తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు. అవును, టీడీపీని ప్రజాస్వామ్యంలేని పేద (ఉత్తర) కొరియా పాలకపక్షం మాదిరిగా నడపాలనుకుంటున్న నారావారిపల్లె నేతకు కిమ్ ఆదర్శప్రాయుడు కావచ్చేమో మరి. కాని, ఉత్తర కొరియాకు ఏ రకంగాగానూ ఆంధ్రప్రదేశ్‌తో పోలిక లేదు.
అలాగే, ఏపీ సీఎంకు నియంత కిమ్‌తో ఏ విధంగానూ సాపత్యం లేదు. సంపన్న సోదర దేశం దక్షిణ కొరియాకు పూర్తి విరుద్ధమైన ఉత్తర కొరియాలో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు. సైనిక పాలనతో ఈ పేద కొరియా కునారిల్లుతోంది. చంద్రబాబు గారి చలవతో సైజు కుదించుకుపోయిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ల బాబూకొడుకుల పాలన తర్వాత కూడా ఇంకా ప్రజాస్వామ్యం బతికి ఉంది. ప్రజాస్వామ్య, పౌర హక్కులను ఇక్కడి రాజ్యాంగ వ్యవస్థలు కాపాడుతున్నాయి. ఈ వ్యవస్థలను పరిరక్షించే బాధ్యతను సిఎం జగన్ చక్కగా నిర్వర్తిస్తున్నారు.
రెండు పొరుగు రాష్ట్రాల నీడన ఇంకా వెనుకబడి ఉన్న కుప్పంలో మూడు రోజల కుప్పిగంతుల తర్వాత మాజీ సీఎం బాబుగారు తన నాటకాలకు తెర దించారు. సంతోషం. అయితే, కుప్పం నుంచి పోతూపోతూ– ఏపీని జనరంజకంగా పాలిస్తున్న వైఎస్సార్సీపీ ముఖ్యమంత్రిపై అభాండాలు వేయడం చంద్రబాబు వయసుకు తగని పని. అంతే కాదు, నియంతృత్వ పోకడలతో తన బుల్లి దేశాన్ని పాలిస్తున్న ఉత్తర కొరియా నేత కిమ్‌తో ఏపీ సీఎంను పోల్చి జూనియర్ కిమ్ అనడం ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత బాధ్యతారాహిత్యానికి, అవగాహనారాహిత్యానికి పరాకాష్ట.
టీడీపీ అధినేత ఇకనైనా కిమ్ నామస్మరణ మానుకుంటే మేలు. ఎందుకంటే, ఉత్తర కొరియా నుంచి కుప్పం వచ్చి కార్ల ఫ్యాక్టరీ పెట్టడానికి అక్కడేమీ కియా మోటార్స్ వంటి గొప్ప కంపెనీ ఏమీ లేదు. కుప్పం అసెంబ్లీ సీటుకు 33 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నాని గర్వగా చెప్పుకుంటున్న చంద్రబాబు గారికి మరో 13 సంవత్సరాలు గడిచినా రాజకీయ పరిపక్వత రాదేమోననే అనుమానం వస్తోంది.