– ఎంపీ విజయసాయిరెడ్డి
జనవరి 16: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తాను సభ్యతతో ప్రజలకు రాజకీయ సందేశం ఇస్తూ మాట్లాడుతుంటే పాలకపక్షం నేతలు అడ్డగోలుగా విమర్శిస్తున్నారని మాట్లాడటం విడ్డూరంగా ఉందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన ఈ అంశంపై తనదైన శైలిలో స్పందించారు.
పండగపూట సొంతూరు నారావారిపల్లెలోనూ అబద్ధాలు, అవాస్తవాలతో కూడిన ప్రసంగాలు చేసి, మంచి మాటలు చెబుతారని ఎదురుచూసిన అక్కడి ప్రజలకు నిరాశే మిగిల్చారు. పొద్దున్న లెగిస్తే తన రాజకీయ ప్రత్యర్ధులను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పాలకపక్షం నేతలను సైకోలు, నియంతలు, దౌర్జన్యకారులు అంటూ నోటికొచ్చినట్టు తిట్టిపోసే చంద్రబాబు, తాను సభ్యతతో మాట్లాడతానని చెప్పడం ఆశ్చర్యకరమని అన్నారు.
ఈ ఏడాది రాష్ట్రంలో ఊరూరా భోగి, సంక్రాంతి పండగలు ముందెప్పుడూ లేనంత ఆనందోత్సాహాలతో ప్రజలు జరుపుకుంటూ, వీధుల్లో, రహదారుల్లో బంధుమిత్రులను కలుస్తూ సామూహిక జీవనానికి సంకేతంగా నిలుస్తున్నారని అన్నారు అయితే సొంతూళ్లో సంక్రాంతి పండగ జరుపుకోవడానికి వచ్చిన చంద్రబాబు ఇవేమీ చూడకుండా సత్యదూరమైన విషయాలు మాట్లాడుతున్నారని అన్నారు.
ఏపీలో రోడ్లు, గ్రామాల్లోని వాతావరణం చూసి జనం భయపడుతున్నారని నారావారిపల్లెలో చంద్రబాబు పచ్చి అబద్దాలు ప్రచారం చేసేందుకు ప్రయత్నించారని అన్నారు. ప్రభుత్వం అమాయకులపై కేసులు పెడుతున్నట్టు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. కేసులకు భయపడితే బానిసత్వం తప్పదని టీడీపీ అధ్యక్షుడు ప్రజలను బెదిరించడం ఆయన సందర్భ శుద్ధి లేని మాటలకు నిదర్శనమని అన్నారు.
తెలుగుదేశం నిర్వాకాల వల్ల జనం మరణిస్తే దానిని చంద్రబాబు కుట్ర కోణంలో చూడడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. తెలుగుదేశం అధ్యక్షుడి ప్రకటనలు, ప్రసంగాలు, బెదిరింపులు ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత జరిగే ఏపీ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ ఉనికి కోల్పోవడం తధ్యమని అన్నారు.