Suryaa.co.in

Political News

విజయశాంతి గారూ..రండి కలసి పోరాడదాం

విజయ శాంతి గారూ ప్రస్తుత రాజకీయాలలో మన మహిళల పాత్ర ఇంతే..! ఎదురు తిరగండి పోరాడుదాం..
స్వాతంత్ర ఉద్యమంలో మహిళలకి అత్యధిక ప్రాతినిధ్యం ఉండేది.
భారత జాతీయ కాంగ్రెస్కి విదేశీయురాలు అయిన అనిబ్బిసెంట్ నాయకత్వం వహించింది.. ఝాన్సి లక్ష్మి భాయి సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించింది. ముందు ఉండి నడిపించింది.
దండి సత్యాగ్రహాన్ని స్వాతంత్ర పోరాటాన్ని మహాత్మ గాంధీతో కలిసి సరోజినీ నాయుడు నడిపించింది..
సుభాష్ చంద్రబోస్ తో కలిసి ఆజాద్ హింద్ ఫౌజ్ ను కెప్టెన్ లక్ష్మి సారథ్యం వహించింది..
నెహ్రూ సతీమణి కమలా నెహ్రూ,సుచేత కృపాలని, అరుణఅసఫలి, ప్రిన్సెస్ కౌర్, గైడెన్లియు, మణిపూర్ గిరిపుత్రిక, పద్మజా నాయుడు,దుర్గాబాయి దేశ్ ముఖ్ , మాగంటి అన్నపూర్ణమ్మ ,భారతీదేవి రంగా, సూర్యదేవర రాజ్యలక్ష్మి, మొదలైనవారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు.. వారికి ఆ నాటి నాయకులు, నాయకత్వ బాధ్యతలు ఇవ్వగలిగారు.
కానీ కాలం మారింది. సమానత్వం సాధించుకున్నాం అని చెప్పుకుంటున్న మాకు.. అన్ని రంగాల్లో పురోగమనం సాధించాం అని చెప్పుకుంటున్న మేము.. రాజకీయ చట్రంలో అనేక బాధలు పడుతున్నాం..
అవమానాలు ఎదుర్కుంటున్నాం.
ఇంత వరకు మహిళా రిజర్వేషన్ బిల్లు సాధించుకొలేక పోయాము..
దానికి కారణం ఏమిటి..?
ఒక జయలలిత,మాయావతి, నందిని శతపధి, మమత బెనర్జీ, వీరందరూ ముఖ్యమంత్రులు అయిన ఎన్నో అవమానాలు, ఎన్నో రాజకీయ ఒత్తిళ్లు..?
ఉన్న ఏకైక ప్రధానమంత్రి ఇందిరా గాంధీనీ చంపుకోలేదా మనం…?
సోనియా గాంధీని ప్రధాన మంత్రి కానిచ్చామా..?
నవీన భారతంలో ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉన్న భార్యల స్థానాల్లో భర్తల పెత్తనం.
వసుంధర రాజే సింథియా, ఉమా భారతి పరిస్థితి ఈనాడు ఏమిటి..?
రామజన్మ భూమి విషయంలో, అయోధ్య రామ మందిరం నిర్మాణ విషయంలో ప్రముఖ పాత్ర వహించిన ఉమాభారతి గారి పరిస్థితి ఏమిటి?
ఈరోజు అన్ని పార్టీలు ఒక తాసు ముక్కలే…
ఈనాటి రాజకీయాలలో మగమహారాజులు మహిళలని కేవలం ఉద్యమాలలో పోలీస్ లాఠీ చార్జీల కు వ్యతిరేకంగా ముందు వరుసలో మమ్మల్ని నిలబెడతారు…
7 సంవత్సరాల పాటు తెరాసా పాలనలో మహిళ మంత్రులు లేరు.
ప్రతిభ,ధైర్యం,సాహసం,విద్య, పరిపాలన దక్షత ఉన్న అనేక మంది మహిళలం అన్ని పార్టీలల్లో ఉన్నాం..
కానీ మాకు అందుతున్న స్థానం ఏంటి..? గౌరవం ఏమిటి..?
నాకు సమర్ధత లేదా..?
రేణుకా చౌదరికి సమర్ధత లేదా..?
Dk అరుణ కి లేదా? గీతా రెడ్డికి లేదా? పురంధేశ్వరి లేదా? పరిటాల సునీత, గల్లా అరుణ,
విజయ శాంతికి లేదా? కొండా సురేఖకి లేదా? కవితకి లేదా? వంగలపూడి అనిత లేదా?
ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో సాయుధ పోరాటాలను,స్వాతంత్ర ఉద్యమాలు, మహిళల చేతులతో నడిపించిన నేలలు, శాంతిశ్రీ, రాణి రుద్రమ్మ, నాగమ్మ, మాంచాల,వీరనారులు పుట్టిన గడ్డ ఇది..ఏలిన గడ్డ ఇది.
చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవిల సాయుధ పోరాటాన్ని మరిచిపోగలుగుతామా..? సంఘం లక్ష్మీబాయి,ఈశ్వరి భాయి,సదా లక్ష్మి సేవలను మరిచి మరిచిపోగలుగుతామా..vijayasanthi-itemఅయినా మన సమర్ధత, దక్షత, నాయకత్వం గుర్తించడం ప్రస్తుత రాజకీయ పార్టీలకు చేత కాదు.
ఒక్క తాటి మీద,ఒకే ఆలోచనతో రాజకీయాలలో ఆకర్షణ శక్తి ప్రజలను నడిపించగల శక్తి, స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న ఆడవాళ్ళకి, నేటి రాజకీయాలలో చోటు లేకుండా పోయింది..
కులం పేరు తోనో , వర్గం పేరుతోనో మతం పేరుతోనో మహిళల్ని అణచివేయడం జరుగుతుంది.
రాజ్యాంగాన్ని ప్రసాదించిన డా” బీఆర్ అంబేద్కర్ మహిళలకి కులం మతం, ప్రాంతం భాషతో సంబంధం లేకుండా అత్యున్నతమైన హక్కుల్ని ఆదేశక సూత్రాలని పొందుపరిచారు.
అంబేడ్కర్ జీ కల ఈ నాటి రాజకీయాల్లో సాకారం చేసుకోలేక పోతున్నాం మేము.. ఇది పురుషాధిక్య సమాజం వల్లనా..?
లేక రాజకీయ చట్రం లో ఉన్న అసమానతల వల్లనా ?
సో..
మనం నిర్వేదం పడొద్దు..మన జీవితాలలో వెలుగు నింపిన రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి ,గురజాడ,నెహ్రూ,అంబేడ్కర్ (శారదా చట్టం), నెహ్రూ ,అంబేడ్కర్, నందమూరి తారక రామారావు,రాజీవ్ గాంధీ, వాజపేయి కి కృతజ్ఞులం..
ఇప్పుడైనా ,ఎప్పుడైనా మనం కలిసి కట్టుగా ఉంటే సాధించలేనిది ఏమీ లేదు..జీవికి తల్లి, మనిషికి భూమి, ప్రకృతి ఆధారం..
మనమే ప్రకృతి, మనమే భూమి,ప్రపంచాన్ని జయించుదాం..
శరత్ చంద్ర కలగన్న, శాంతి కపోతం స్త్రీ..రవీంద్ర నాథ్ ఠాగూర్ ,కలం నుండి జాలువారిన కవితాత్మలం మనం..సమస్త జీవరాశికి మూలం మనం..
(40 సంవత్సరాల నా రాజకీయ చరిత్రలో నేను చూసిన వ్యధలు, నైరాశ్య పరిస్థితులు, 64 సంవత్సరాల వయసులో బయట పెట్టించాయి.)

– కాట్రగడ్డ ప్రసూన
మాజీ ఎమ్మెల్యే ,
ఉపాధ్యక్షురాలు తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రం

LEAVE A RESPONSE