Suryaa.co.in

Andhra Pradesh

విజయవాడను విజయమ్మ వాడగా, విశాఖపట్నంను విజయసాయిపట్నంగా మార్చవచ్చు

-నడివీధిలో ఎన్టీఆర్ ఆత్మగౌరవం
-పేరు మార్పుపై యుజిసి చైర్మన్ ను కలిసి చర్చిస్తా
-ఎన్నికల కమిషన్ కు క్లారిఫికేషన్ ఇవ్వకపోతే పార్టీ గుర్తింపు రద్దు
-పీపుల్స్ ఆక్ట్ 1951 ప్రకారం ఒక పార్టీకి జీవితకాల అధ్యక్షుడి ఎన్నిక చెల్లుతుందా?

తెలుగువారికి ఆత్మ గౌరవాన్ని తీసుకువచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇది ఎవరూ కాదనలేని సత్యం. అప్పటివరకు అందరూ మనని మద్రాసీలు అని అనేవారు. అటువంటి తెలుగు వారికి ఆత్మగౌరవాన్ని తీసుకువచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. తెలుగువారికి ఆత్మ గౌరవాన్ని ఇచ్చిన ఎన్టీఆర్ గారి ఆత్మగౌరవం, ఈరోజు నడివీధిలో ఉంది. ఎన్టీఆర్ గారి ఆత్మ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రపంచ నలుమూలల ఉన్న తెలుగు వారందరిపై ఉన్నది. ఎన్టీఆర్ పేరును తిరిగి పునరుద్ధరించే వరకు, రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు… శాంతియుత పద్ధతిలో పోరాడుదామని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు పిలుపునిచ్చారు.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును నిలిపి వేస్తూ ఇన్ ట్రిమ్ స్టే ఇవ్వాలని కోరుతూ, తక్షణమే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని పూర్వ విద్యార్థులకు సూచించారు. గురువారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…. జగన్మోహన్ రెడ్డి రాగద్వేషాలకు, బంధు ప్రీతికి అతీతంగా వ్యవహరిస్తానని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని గుర్తు చేశారు. కానీ తాను చేసిన ప్రమాణస్వీకారానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై తాను త్వరలోనే యుజిసి చైర్మన్ ను కలిసి చర్చిస్తానని తెలిపారు. నేను శాశ్వత అధ్యక్షున్ని కాదు బాబోయ్ అని కేంద్ర ఎన్నికల కమిషన్ కు చెప్పినట్టుగానే, తనకు సలహాదారులు సరైన సలహాలు ఇవ్వలేదని, తప్పు చేయడం మానవ సహజం అని చెప్పి తన తప్పును ఒప్పుకొని, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని తిరిగి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించాలని రఘురామ కృష్ణంరాజు హితవు పలికారు. దీనితో యూనివర్సిటీ పూర్వ విద్యార్థులతో పాటు, ప్రస్తుత విద్యార్థులకు టెన్షన్ తప్పుతుందని అన్నారు.

వైఎస్ఆర్ కు ఉన్న అదనపు అర్హత ఏమిటంటే…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా టంగుటూరి ప్రకాశం పంతులు నుంచి మొదలుకొని ఎంతోమంది పనిచేశారని , కానీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న అదనపు అర్హత ఏమిటంటే… ఈ మహానుభావుడైన జగన్మోహన్ రెడ్డికి తండ్రి కావడం, వస్తాయో రావో తెలియని 17 మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నామని , అలాగే ఎన్టీ రామారావు ఎంబిబిఎస్ చదవలేదు కాబట్టి, వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎంబిబిఎస్ చదివినందుకు హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెడుతున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ఆన్ డౌటేడ్ లీ తుగ్లక్ నిర్ణయం అని… వ్యాఖ్యానించారు. పథకాలకు పేరు పెట్టడం వేరు, వ్యవస్థల పేర్లు మార్చడం తప్పు అని, బూతు కూడా అని అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న 20 పథకాలు జగన్మోహన్ రెడ్డి పేరిట కొనసాగుతుండగా, మరో 55 పథకాలు వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరిట కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రతిదానికి తండ్రి కొడుకుల పేర్లు పెట్టడం ఏమిటని ప్రశ్నించిన రఘురామకృష్ణం రాజు, ప్రభుత్వం మారితే పథకాల పేర్లు కూడా మారిపోతాయి అన్నారు. వ్యవస్థల పేర్లు మార్చినప్పుడు ప్రజలు స్పందించకపోతే, విజయవాడను, విజయమ్మ వాడగా, విశాఖపట్నం పేరును, విజయ సాయి పట్నం గా మార్చవచ్చునని అపహాస్యం చేశారు.

యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ( యు జి సి ), నేషనల్ మెడికల్ కౌన్సిల్( ఎన్ ఎం సి )ల ఆమోదం పొందిన తర్వాతే, పేరు మార్పు పై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. తాను ఇప్పటికే పలువురు మాజీ యుజిసి, ప్రస్తుత యుజిసి అధికారులతో మాట్లాడానని, ఇప్పటివరకు ఇటువంటి పిచ్చి ప్రతిపాదన అన్నది ఎక్కడి నుంచి తమ వద్దకు రాలేదని చెప్పారన్నారు. యూనివర్సిటీ పేరు మార్పు వల్ల, విదేశాలకు వెళ్లిన విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనలో గందరగోళం నెలకొనే అవకాశం ఉన్నదని, అప్పుడు వారు ఇబ్బందుల్లో పడతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను ఇప్పటికే విధ్వంసం చేసిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు తన తండ్రి గుల్బర్గాలో ఎంబీబీఎస్ చదివారన్న ఒక్క కారణం చేత, ఆంధ్ర ప్రదేశ్ లో ఎంబీబీఎస్ చదివిన లక్షలాదిమంది విద్యార్థులను ఇబ్బంది పెట్టడం భావ్యమా అంటూ ప్రశ్నించారు.

కేంద్ర ఎన్నికల కమిషన్ అడిగినట్లుగా క్లారిఫికేషన్ ఇవ్వకపోతే, పార్టీ గుర్తింపు రద్దు అవుతుందని రఘురామకృష్ణంరాజు అన్నారు. పార్టీ గుర్తింపును రద్దు చేసుకోరు కనుక, నాలుగేళ్ల కాలానికి అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహిస్తే, తాను కూడా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. పార్టీలో ఒక సిస్టం తీసుకురావడానికే, తాను పోటీ చేస్తానని అన్నారు .

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక నిర్వహిస్తున్నారని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనూ అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలని ఆకాంక్షించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని సవరిస్తూ, జీవితకాల అధ్యక్షునిగా జగన్మోహన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జూలై 9వ తేదీన తమ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనకు సంబంధించిన వార్తల, మీడియా క్లిప్పింగులను జత చేస్తూ, జులై 11 వ తేదీన కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులతో తాను భేటీ అయినట్లు రఘురామ వెల్లడించారు.

పీపుల్స్ ఆక్ట్ 1951 ప్రకారం ఒక పార్టీకి జీవితకాల అధ్యక్షుడి ఎన్నిక చెల్లుతుందా?, ఎన్నికల కమిషన్ నిబంధనలు ఈ మేరకు అనుమతిస్తాయా? అంటూ తాను లేవనెత్తిన ప్రశ్నలపై, ఎన్నికల కమిషన్ తమ పార్టీ నాయకత్వాన్ని వివరణ కోరుతూ, నాలుగు సార్లు లేఖలు రాసిందన్నారు. ఆగస్టు 15వ తేదీన రాసిన మూడవ లేఖ అనంతరం, తాము మీటింగు నిర్వహించుకోవడానికి అనుమతిని ఇవ్వాలని కోరుతూ తమ పార్టీ పెద్దలు సమాధానం ఇచ్చారన్నారు. అదే నెల 18వ తేదీన రిమైండర్ లేఖను రాయగా, 23వ తేదీన పార్టీ అధ్యక్షుడి హోదాలో జగన్మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డిలు ఎన్నికల కమిషన్ కు లేఖ రాస్తూ, ఏకగ్రీవంగా అధ్యక్షుడిని మాత్రమే ఎన్నుకున్నామని, వివరణ ఇచ్చుకున్నారని తెలిపారు.

శాశ్వత అధ్యక్షుడి ఎన్నిక ప్రకటనపై స్పష్టత ఇవ్వలేదని చెప్పారు. పార్టీ కూడా శాశ్వత అధ్యక్షుడి ఎన్నికను ధ్రువీకరించినట్లు కొన్ని మీడియా కథనాలు వచ్చాయని, వాటి పై విచారణ జరుపుతున్నామని తమ లేఖలో జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డిలు పేర్కొన్నారన్నారు. విజయసాయిరెడ్డి ప్లీనరీలో చేసిన ప్రసంగ వీడియోను ప్రదర్శించిన రఘురామకృష్ణం రాజు, వీడియోలో ఉన్నది విజయ సాయి రెడ్డా?, కాదా?? అని ప్రశ్నించారు. ప్లీనరీలో మీరు చేసిన ప్రకటననే ఇతర దినపత్రికలు కవర్ చేస్తే వారిపై సిఐడి ని పురమాయించి కేసులు పెడతారా?, లేకపోతే సాక్షి మీడియాలో వచ్చిన కథనాలను, కేంద్ర ఎన్నికల కమిషన్ కు అందజేసినందుకు తనపై కేసులు పెడతారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విచారణ జరిపించి, జీవితకాల అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోలేదని, ఎన్నుకున్నట్లుగా ప్రకటించినప్పుడు ముసిముసి నవ్వులు నవ్వింది జగన్మోహన్ రెడ్డి కాదు అని, ఆ ప్రకటన చేసింది విజయ సాయి రెడ్డి కూడా కాదని ఖండించాలంటూ రఘురామకృష్ణం రాజు షరతులు విధించారు. జూలై 8వ తేదీన శాశ్వత అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డిని ప్రతిపాదించారని, 9వ తేదీన ప్రకటించారని, శాశ్వత అధ్యక్షుడు అనే పదం… పార్టీ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని అందుకే తాను అధ్యక్ష ఎన్నికకు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తిగా నామినేషన్ దాఖలు చేయలేదని చెప్పారు.

రాష్ట్రం నలుమూలల నుంచి కుప్పంకు తరలింపు
కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా, రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలను అక్కడికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. స్కూలు బస్సులలో ప్రజలను తరలించేందుకు వీలుగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారని పేర్కొన్నారు. కుప్పంలో ఓట్లు వేయడానికి పొరుగు రాష్ట్రమైన తమిళనాడు నుంచి ఆరవ ప్రజలను తరలించినట్టుగానే, ఇప్పుడు కుప్పంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను బస్సులలో తరలించేందుకు ఏర్పాట్లు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కుప్పం ప్రజలు ఎలాగో జగన్మోహన్ రెడ్డి పర్యటనకు దూరంగా ఉంటారని తెలిసే, ఇతర ప్రాంతాలు ప్రజలను తరలిస్తున్నారని రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు

LEAVE A RESPONSE