• గొప్ప సాంస్కృతిక, చారిత్రక వారసత్వం ఉన్న నగరమిది
• భవిష్యత్తు తరాలకు విజయవాడ గొప్పదనాన్ని తెలియజేయాలి
• తెలుగు వ్యాప్తికి విజయవాడ ఉత్సవ్ వేదిక కావాలి
• భారత గౌరవ 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు
విజయవాడ: ఆంధ్రుల రాజధాని అమరావతి వైభవం ప్రపంచానికి తెలియాలని, ప్రపంచ పటంలో విజయవాడ, గుంటూరులతో కలిసిన అమరావతి నూతన వైభవం సంతరించుకోవాలని భారత గౌరవ 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు.
“ఒకే నగరం – ఒకటే సంబరం” అనే నినాదంతో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ కార్యక్రమంలో సోమవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ‘‘పౌరాణికంగా, చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి చెందిన విజయవాడ తరతరాలుగా తెలుగు వారి భాష, సంస్కృతుల రాజధానిగా ప్రత్యేకించి దక్షిణాదిన వాణిజ్య రాజధానిగా విరాజిల్లింది, విరాజిల్లుతోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రూపంలో విజయవాడ ప్రాధాన్యత మరింత పెరిగింది.’’ అని చెప్పారు.
తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అమరావతితో పాటు విజయవాడ, గుంటూరు నగరాలు అభివృద్ధి చెంది ఓ విశాలరాజధాని ఏర్పాటు దిశగా చొరవ తీసుకున్నానని గుర్తు చేశారు. అందులో భాగంగానే… స్మార్ట్ సిటీలు, అమృత్ నగరాల్లో అమరావతికి చోటు కల్పించామని, ఇది విజయవాడ అభివృద్ధికీ ఉపకరించే అంశమని, అమృత్ నగరాల్లో విజయవాడ అభివృద్ధి చెందిందని చెప్పారు.
కొండపావులూరులో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), సూరంపల్లిలో ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ జాతీయ సంస్థ, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, ప్రత్యేక దూరదర్శన్ కేంద్రం, రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసు, విజయవాడ విమానాశ్రయాన్ని అంతర్జాతీయంగా తీర్చిదిద్దడంతో పాటు టెర్మినల్ సామర్థ్యం పెంపు, ముక్త్యాల నుంచి విజయవాడ వరకూ బకింగ్ హాం కెనాల్ అభివృద్ధి, గుంటూరులో వ్యవసాయ విశ్వవిద్యాలయం, మంగళగిరిలో ఎయిమ్స్… ఇవన్నీ విజయవాడ – అమరావతి – గుంటూరు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న చొరవలేనని చెప్పారు.
విజయవాడ ఘన చరిత్రను వెంకయ్యనాయుడు గుర్తు చేస్తూ ‘‘కళ, సాహిత్య, భాషా రంగాల్లో విశేషమైన చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన విజయవాడ తెలుగు వారి గొప్ప వారసత్వాన్ని కళ్ళకు కడుతుంది. అనేక పత్రికలు విజయవాడ నుంచి ప్రారంభమై తెలుగు వారి వాడిని, వేడిని రుచి చూపించాయి. ఇక్కడ ప్రచురణ కేంద్రాలు పుస్తక రాజధానిగా విజయవాడను మార్చాయి. ఆంధ్రప్రభ దినపత్రిక ఇక్కడ నుంచే పునఃప్రారంభమైంది.
ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా ఇక్కడే ప్రారంభమైంది. తొలి స్పీకర్ శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారు, టీవీ చలపతిరావు , విశ్వనాథ సత్యనారాయణ వంటి ఎందరో మహనీయులు ఈ నేలను పునీతం చేశారు. తెలుగు వారి కీర్తి పతాకాన్ని ప్రపంచ యవనికపై రెపరెపలాడించిన ఎన్టీఆర్ కూడా విజయవాడలో చదువుకున్నారు. ఇక్కడి రామ్మోహన గ్రంథాలయం, హనుమంతరాయ గ్రంథాలయం తెలుగు నాట జరిగిన స్వాతంత్ర్య ఉద్యమానికి సాక్ష్యాలుగా నిలిచాయి.
చారిత్రకంగానూ యుద్ధమల్లుని శాసనం, కొండవీడులోని మరోశాసనం ఈ నగరాన్ని బెజవాడగా పేర్కొన్నాయి. విష్ణుకుండినుల రాజధానిగా విలసిల్లిన ఈ నగరంలో మొగల్రాజపురం గుహాలయాలు 3, 4 శతాబ్దాల నాటి చరిత్రను కళ్ళకు కడుతాయి. చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ కూడా బెజవాడను సందర్శించి, శాతవాహనుల చరిత్రను రాసినట్లు ఆధారాలు తెలియజేస్తున్నాయి.
స్వరాజ్య ఉద్యమ కాలంలో మహాత్మాగాంధీ 1919 – 1946 మధ్య అనేక పర్యాయాలు సందర్శించారు. ఇక్కడి గాంధీ కొండ ఆయన జీవితంలోని అనేక అంశాలను మనకు తెలియజేస్తుంది.’’ అని చెప్పారు. విజయవాడకు శ్రీతుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం మరో గుర్తింపు అన్నారు. ఈ కళా క్షేత్రం దశాబ్ధాలుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వేలాది కళాకారుల ప్రదర్శనలకు, కార్యక్రమాలకు చక్కని వేదిక అయ్యిందని, 2015లో తాను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఈ కళాక్షేత్రం చరిత్రను దృష్టిలో ఉంచుకుని ఆధునీకరణ కోసం 2 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశానని చెప్పారు.
విజయాలనందించే దుర్గమ్మగా… ముగ్గురమ్మల మూలపుటమ్మ వెలసిన కనకదుర్గ క్షేత్రం విజయవాడకు గొప్ప రక్ష అని అన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు ఏటా నవరాత్రుల సమయంలో ఇక్కడి స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కోసం, ఆశీస్సుల కోసం వస్తుంటారని అన్నారు.
విజయవాడ ప్రాశస్త్యాన్ని తెలియజేసే విషయాల గురించి ఇక్కడి ప్రజలు తెలుసుకోవడమే కాకుండా, ఘనమైన ఈ చరిత్ర, వారసత్వాలను భవిష్యత్ తరాలకు తెలియజేయడానికి విజయవాడ ఉత్సవ్ ఒక చక్కని వేదిక అని అన్నారు.
‘‘ముఖ్యంగా తెలుగు భాష, సంస్కృతుల పరివ్యాప్తికి ఈ కార్యక్రమాన్ని వేదికగా మలచుకోవలసిన అవసరం ఉంది. మన జీవన విధానంలో ఆయువు పట్టులాంటిది మన మాతృభాష. ఒకప్పుడు మన పద్యం, గద్యం జగద్విదితం. దానిని మరల ఇలాంటి కార్యక్రమాల ద్వారా దశదిశల వ్యాప్తి చేయాలి. మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, మన కట్టు, మన బొట్టు, చివరకు మన తిట్టు సహా సంప్రదాయాలను పునరుజ్జీవింపచేసుకోవలసిన అవసరం ఉంది.’’ అని చెప్పారు.
“ఒకే నగరం – ఒకటే సంబరం” అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం దసరా ఉత్సవాలకు మరింత శోభను తీసుకురావడమే గాక, విజయవాడ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేస్తుందన్నారు. ఈ సమయంలో ఏర్పాటు చేస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగు వారి వైభవాన్ని కళ్ళకు కట్టేలా నిర్వాహకులు చొరవ తీసుకోవాలని సూచిస్తూ మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారని వారిని అభినందించారు.