మరీ ఇంత విచక్షణారహితంగా పదవుల పందేరమా..
మెజారిటీ ఉంది కదాని ఇష్టం వచ్చినట్టు చేసెయ్యడమేనా..
ఎవరి నిర్ణయాలు..
ఇంకెవరి సూచనలు..
రాష్ట్రపతి..ఉపరాష్ట్రపతి పదవులకు అభ్యర్ధుల ఎంపికలో ఓటు బ్యాంకు రాజకీయాలు చోటు చేసుకున్నాయని విమర్శలు వెల్లువెత్తుతుండగా అసలు గత ఎనిమిదేళ్లుగా మెజారిటీ బలుపుతో ఎవ్వరినీ సంప్రదించకుండా..లెక్క చెయ్యకుండా మోడీ ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో మొక్కుబడి విమర్శలు చెయ్యడం మినహా ఎవరైనా గాని చేసేది ఏమీ ఉండడం లేదు. పెద్దనోట్ల రద్దు,జీఎస్టీ.. జనజీవితంపై ప్రభావం చూపే ఇలాంటి ఎన్నో కీలక నిర్ణయాలతో పాటు రాష్ట్రపతి.. ఉపరాష్ట్రపతి వంటి మహోన్నత పదవులకు అభ్యర్ధులను ఎంపిక చేసే విషయంలో కూడా ఎన్డీయే ప్రభుత్వం కొన్ని కనీస సంప్రదాయాలు పాటించకపోవడం శోచనీయం. గతంలో ఇందిరా గాంధీ వంటి నేత కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే ముందు అఖిల పక్షాలను సమావేశపరచి ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నించిన సందర్భాలు ఉన్నాయి.అయితే ఈ పద్ధతికి మోడీ సర్కారు తిలోదకాలు ఇచ్చినట్టే.పెద్ద నోట్ల రద్దు సమయంలోనైతే ఆర్ధిక మంత్రితో సహా తన సొంత క్యాబినెట్ సహచరులకు సైతం కనీస సమాచారం లేకుండా నిర్ణయాన్ని అమలులోకి తెచ్చిన ఘనత మోడీకి ఉంది.ఇలాంటి దృష్టాంతాలు ఎన్నో..వీటిపై చాలా చర్చలు జరిగినా మోడీజీ వ్యవహార శైలిలో మార్పు లేదు.
సరే..ఇప్పుడు తాజాగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక మరోసారి విమర్శలకు ద్వారాలు తెరిచింది.ముఖ్యంగా ఇళయరాజా..విజయేంద్ర ప్రసాద్..! ఇళయరాజా సంగీత ప్రపంచానికి..సినిమా రంగానికి మహత్తర సేవలు
చేశారన్నది నిర్వివాదం.అయితే ఎప్పుడూ తనదైన సంగీత లోకంలో మునిగి ఉండే ఆ స్రష్టకు ఇలాంటి పదవులపై ఆసక్తి ఉంటుందా..
ఇక్కడ మరో విషయాన్ని ఖచ్చితంగా ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది.గతంలో ఇలాగే పదవులపై.. రాజకీయాలపై ఆసక్తి లేని వ్యక్తులకు.. వారెంతటి విశిష్టులైనా గాని పదవులు ఇవ్వడం వల్ల ఒరిగిందేమిటి… కొందరు సభ మొహం చూసిందే లేదు.. కొందరు వచ్చినా అమావాస్యకో పున్నమికో.. అలాంటి వారిలో లతామంగేష్కర్..సచిన్ టెండూల్కర్..జయబాధురి వంటి వారున్నారు.
వారి వారి రంగాల్లో వారెంతటి నిష్ణాతులైనా గాని రాజ్యసభ పదవులు చేబట్టి వారు సాధించింది ఏమీ లేదు.ఇప్పుడు ఇళయరాజా విషయంలో అదే జరుగుతుందని జనాల అభిప్రాయం..!
ఇప్పుడు విజయేంద్రప్రసాద్ సంగతి.. అసలు ఆయనకు ఆ పదవి ఎందుకు ఇవ్వాలన్నది కీలకమైన ప్రశ్న.. ఆయన చేసింది.. సాధించింది ఏముందని..
ఆయన సినిమా కథా రచయిత.. ఆయన పని చేసింది కూడా కళాఖండాలు కావు. జనాలకి ఆయన పేరు తెలిసిందే తక్కువ.ప్రజా జీవితంతో ఆయనకు పెద్ద సంబంథాలు ఉన్న సందర్బాలు కూడా తెలిసింది లేదు.ఆయన ఎన్నాళ్లుగా కధా రచనా రంగంలో ఉన్నా రాజమౌళి తండ్రిగానే ఆయన ఇటీవల వార్తల్లోకి వచ్చారు. అదేమంత పెద్ద భుజకీర్తి కాదేమో.మరి ఆయన మోడీ దృష్టిలోకి ఎలా వెళ్లారో..!? ఆయన పేరును ఎవరు సిఫార్సు చేశారో.. వారి ఉద్దేశాలు ఏంటో… అంతా అగమ్యగోచరం.
ఒక వ్యవస్థ మీద నీరస భావం ఏర్పడడానికి ఇలాంటి ఉదంతాలు చాలవా..!. అయినా ఒక పద్ధతి పాడూ లేని ఈ వ్యవస్థ ఎవరి మేలు కోసం..పోనీ ఇదంతా ఉత్తుత్తి వ్యవహారమా..ప్రజాధనం..!. ఎవరికి లెక్క..ఎవరిది బాధ్యత…! ఏం జరిగినా..ఏం చేసినా ఈ దేశంలో..ఇలాంటి ప్రజాస్వామ్యంలో అడిగే నాధుడు ఉండడనేగా..!?
ఇ.సురేష్ కుమార్
జర్నలిస్ట్
9948546286